H1B Visa: ఉద్యోగం కోల్పోయినా 180 రోజులు ఉండొచ్చు!

అమెరికాలో ఉద్యోగాలు కోల్పోయి ఇబ్బంది పడుతున్న హెచ్‌-1బి వీసాదారులకు శుభవార్త..! వీరి వీసా గడువును (గ్రేస్‌ పీరియడ్‌) ప్రస్తుత 60 రోజుల నుంచి 180 రోజులకు పొడిగించాల్సిందిగా బైడెన్‌ అధ్యక్ష సలహా ఉపసంఘం సిఫార్సు చేసింది.

Updated : 16 Mar 2023 07:27 IST

హెచ్‌-1బి వీసాల గడువు పెంపునకు సిఫార్సు

వాషింగ్టన్‌: అమెరికాలో ఉద్యోగాలు కోల్పోయి ఇబ్బంది పడుతున్న హెచ్‌-1బి వీసాదారులకు శుభవార్త..! వీరి వీసా గడువును (గ్రేస్‌ పీరియడ్‌) ప్రస్తుత 60 రోజుల నుంచి 180 రోజులకు పొడిగించాల్సిందిగా బైడెన్‌ అధ్యక్ష సలహా ఉపసంఘం సిఫార్సు చేసింది. ఇది అమల్లోకి వస్తే భారతీయులు సహా అమెరికాలో పనిచేస్తున్న వేలాది విదేశీ ఉద్యోగులకు భారీ ఊరటే. ఇటీవల గూగుల్‌, మైక్రోసాఫ్ట్‌, అమెజాన్‌ లాంటి సంస్థలు ఎక్కువ సంఖ్యలో ఉద్యోగాలు తొలగించిన నేపథ్యంలో చాలా మంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రస్తుత గడువైన 60 రోజుల్లో ఉద్యోగం సంపాదించడం కష్టతరంగా మారింది. దరఖాస్తులు నింపే ప్రక్రియా సంక్లిష్టంగా ఉండటంతో వ్యవధి సరిపోవడం లేదు.  ఈ సిఫార్సు అమల్లోకి వస్తే 180 రోజుల్లోపు కొత్త కొలువు వెతుక్కొనే వెసులుబాటు కలుగుతుంది. ‘‘ఉద్యోగం కోల్పోయిన హెచ్‌-1బి ఉద్యోగుల గ్రేస్‌ పీరియడ్‌ను 60 నుంచి 180 రోజులకు పొడిగించాలని డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ హోంల్యాండ్‌ సెక్యూరిటీకి, యూఎస్‌ పౌరసత్వ, వలస సేవల (యూఎస్‌సీఐఎస్‌) సంస్థకు వలస ఉపసంఘం సిఫార్సు చేసింది’’ అని అధ్యక్ష సలహా ఉపసంఘంలో ఆసియా అమెరికన్ల సభ్యుడైన అజయ్‌ జైన్‌ భటోరియా తెలిపారు. గ్రీన్‌కార్డుల అంశమూ ఉపసంఘం ముందుకు వచ్చింది. గ్రీన్‌కార్డు దరఖాస్తుల ఆరంభదశలో ఉద్యోగ ధ్రువీకరణ పత్రం ప్రతిపాదనపైనా చర్చ జరిగింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని