సూర్యుణ్ని కమ్మేద్దామా?

అరచేతిని అడ్డుపెట్టి సూర్యకాంతిని అడ్డుకోలేరు... అన్నది ఇన్నాళ్లుగా మనం వింటున్న మాట. కానీ మునుముందు అలా అడ్డుకోవటమే భూతాపానికి మందుగా మారేలా ఉంది.

Updated : 16 Mar 2023 10:06 IST

ఆకాశంలోకే కిరణాల పరావర్తనం
భూతాపం తగ్గించేందుకు సౌరజియో ఇంజినీరింగ్‌
అధ్యయనానికి ఐక్యరాజ్య  సమితి పిలుపు
మానవాళికి ప్రమాదమంటున్న శాస్త్రవేత్తలు

రచేతిని అడ్డుపెట్టి సూర్యకాంతిని అడ్డుకోలేరు... అన్నది ఇన్నాళ్లుగా మనం వింటున్న మాట. కానీ మునుముందు అలా అడ్డుకోవటమే భూతాపానికి మందుగా మారేలా ఉంది. వేగంగా పెరుగుతున్న ఉష్ణోగ్రతలను తగ్గించటానికి అత్యంత వివాదాస్పద సౌర జియో ఇంజినీరింగ్‌ ప్రక్రియను ఆశ్రయించాలనే డిమాండ్‌ ఊపందుకుంటోంది. ఇటీవల మ్యూనిక్‌ సదస్సు నేపథ్యంలో జార్జ్‌ సోరెస్‌లాంటి ప్రపంచ సంపన్నుడు ఇందులో పెట్టుబడులకు పిలుపునివ్వగా... తాజాగా ఐక్యరాజ్య సమితి కూడా సౌర జియో ఇంజినీరింగ్‌ను ఇప్పుడే వాడొద్దంటూనే... మునుముందు అనివార్యమైతే ఉపయోగించేలా అధ్యయనానికి ఆహ్వానం పలకటం విశేషం

అడ్డుగోడ ఎందుకంటే

కాలుష్యంతో పాటు మానవాళి ‘అభివృద్ధి’కి అనుషంగ] ప్రభావంగా భూమిపై ఉష్ణోగ్రతలు నానాటికీ వేగంగా పెరుగుతున్నాయి. పారిశ్రామిక విప్లవం నాటితో పోలిస్తే ఇప్పటికి భూతాపం ఒక డిగ్రీ సెంటిగ్రేడ్‌ పెరిగింది. కాలుష్యం, ప్రమాదకర ఉద్గారాలు ఇందుకు కారణం. ఈ మాత్రం దానికే అనేక పర్యావరణ దుష్ఫలితాలను ప్రపంచం చవిచూస్తోంది. ధ్రువాల వద్ద మంచు కరుగుతోంది. సముద్ర మట్టాలు పెరుగుతున్నాయి. అనేక ప్రకృతి విపత్తులకూ ఈ ఉష్ణోగ్రతలు కారణమవుతున్నాయి. ఈ ఉష్ణోగ్రత పెరుగుదలను 1.5 డిగ్రీల సెల్సియస్‌ వద్దే కట్టడి చేయటానికి కాప్‌ సదస్సుల పేరుతో ప్రపంచ దేశాలన్నీ అనేక తీర్మానాలు చేశాయి. కర్బన ఉద్గారాల కట్టడికి, ఇతరత్రా చర్యలకు ప్రమాణాలు చేశాయి. కానీ అవన్నీ ఆచరణలో సమర్థంగా అమలు కావటం లేదు. సౌకర్యాలన్నింటినీ వదులుకొని, ఈ పద్ధతులను నమ్ముకుంటే లాభం లేదని... వేగంగా పెరుగుతున్న భూతాపాన్ని తగ్గించాలంటే ఏకంగా సూర్యుడికే అడ్డుగోడ వేయాలనే డిమాండ్‌ తలెత్తింది. అదే సౌర (సోలార్‌) జియో ఇంజినీరింగ్‌!

వద్దంటూనే...

వివాదాస్పదమైన ఈ అంశంపై ఐక్యరాజ్యసమితి తాజాగా విడుదల చేసిన నివేదిక ఆసక్తికరంగా మారింది. సౌర జియో ఇంజినీరింగ్‌ అమలు ఇప్పుడే వద్దంటూనే... భవిష్యత్‌లో అనివార్యం కావొచ్చేమో అంటూ ఐరాస అనుమానం వ్యక్తంజేయటం గమనార్హం. ‘‘మనకున్నది ఒక్కటే పర్యావరణం. ఇప్పటికే ఎదుర్కొంటున్న సమస్యలను దొడ్దిదారుల్లో పరిష్కరించి కొత్తవి సృష్టించుకోవటం సరికాదు. సౌర జియో ఇంజినీరింగ్‌పై ప్రస్తుతానికి ఎలాంటి నమ్మదగిన సమాచారం లేదు. ఇందులో అనేక ప్రమాదాలు కనిపిస్తున్నాయి. కానీ మునుముందు భూతాపం తగ్గించటానికి ఇదే అనివార్యం కావొచ్చు కూడా. పర్యావరణ మార్పుల ప్రభావం మానవాళిపై దారుణంగా ఉన్నట్లయితే... తక్షణమే ఉష్ణోగ్రతలు తగ్గించేందుకు తాత్కాలికంగా దీన్ని వినియోగించే అవసరం రావొచ్చు. కాబట్టి... ఈ సాంకేతికతపై లోతుగా అధ్యయనంతో పాటు ప్రభుత్వాల మధ్య సమన్వయం అవసరం’’ అని ఐరాస నివేదిక పేర్కొంది.

ప్రమాదకరం

కొంతమంది శాస్త్రవేత్తలు, జార్జ్‌ సోరెస్‌లాంటి సంపన్నులు మాత్రమే ఈ సౌర జియో ఇంజినీరింగ్‌కు మద్దతు పలుకుతున్నారు. తొందరపడుతున్నారు. వీరిలో పర్యావరణ మార్పుల ఉద్యమాన్ని, కాప్‌ సదస్సు తీర్మానాలను వ్యతిరేకించే వారే ఎక్కువ. కానీ మిగిలిన శాస్త్రలోకం మాత్రం కృత్రిమ పద్ధతిలో ప్రకృతిని అడ్డుకునే ఎలాంటి ప్రక్రియ అయినా మానవాళికి ప్రమాదకరంగా పరిణమిస్తుందని హెచ్చరిస్తోంది. వాతావరణంలోకి భాస్వరాన్ని చల్లటం వల్ల ఆమ్లవర్షాలు పెరిగిపోతాయి. ఓజోన్‌పొర కరిగిపోతుందనే ఆందోళన వ్యక్తమౌతోంది.

ఏమిటీ సౌర జియో ఇంజినీరింగ్‌?

కృత్రిమ పద్ధతిలో సూర్యుడి కిరణాల ప్రభావాన్ని భూమిపై తగ్గించటమే సౌర జియో ఇంజినీరింగ్‌. అంటే ఒక రకంగా ప్రకృతి చర్యను నియంత్రించటం! ఇప్పటిదాకా దీన్ని ఎవ్వరూ అమలు చేయలేదు. శాస్త్రవేత్తల అంచనాలు, ఊహల్లోనే ఉంది. ఈ సౌర జియో ఇంజినీరింగ్‌ అమలుకు సాంకేతికంగా చాలా మార్గాలున్నాయంటున్నా... మూడింటిని ప్రధానంగా చెబుతున్నారు.

సౌర రేడియేషన్‌ మేనేజ్‌మెంట్‌

సౌర రేడియేషన్‌ మేనేజ్‌మెంట్‌... ఎస్‌ఆర్‌ఎంగా పిలిచే ఈ ప్రక్రియలో... భూమిపై పడే సూర్య కిరణాలను పరావర్తనం చేయించి మళ్లీ ఆకాశంవైపే మళ్లించి... భూమిపై వేడిని తగ్గిస్తారు. ఇందుకోసం ఉపరితల కక్ష్యలో అద్దాల అమరిక, స్ట్రాటోస్ఫియర్‌లో టన్నులకొద్దీ భాస్వరాన్ని చల్లటం, సూర్యకిరణాలు పరావర్తనం చెందేలా మేఘాలు, మొక్కలు, మంచును మారుస్తారు. అగ్నిపర్వతాలు పేలినప్పుడు భాస్వర వాయుకణాలు భారీస్థాయిలో వాతావరణంలో చేరి ఉష్ణోగ్రతను తగ్గిస్తుంటాయి. అదే కిటుకును విస్తృతస్థాయిలో ఈ ఎస్‌ఆర్‌ఎంలో ఉపయోగించాలన్నది ఆలోచన.

కార్బన్‌ డై ఆక్సైడ్‌ను తొలగించటం

వాతావరణంలోని కర్బనాన్ని భారీస్థాయిలో తొలగిస్తారు. ఇందుకు జీవ-యాంత్రిక పద్ధతులను ఉపయోగించి ఇనుప గుళికల ద్వారా సముద్రాల్లో కిరణాలను పరావర్తనం చేయించే ప్లాంక్టన్‌ బ్లూమ్స్‌ (ఒకరకమైన నాచు)ను, కృత్రిమ   చెట్లతో కూడిన అడవులను సృష్టిస్తారు.

భూ రేడియేషన్‌ మేనేజ్‌మెంట్‌

ఇందులోనూ...వాతావరణంలో 20-40వేల అడుగుల ఎత్తున మంచు స్ఫటికాలతో కూడిన తెల్లని మేఘాలను పలుచగా చేసి... సూర్యకిరణాల వేడిని ఆకాశంలోకే పరావర్తనం చెందేలా చేస్తారు.

ఈనాడు ప్రత్యేక విభాగం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని