H1B Visa: అమెరికా వీడాల్సిందేనా..!

అమెరికాలో ఇటీవల ఉద్యోగం కోల్పోయిన హెచ్‌-1బి వీసాదారులు నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు.

Updated : 19 Mar 2023 06:57 IST

ఉద్యోగం కోల్పోయిన హెచ్‌-1బి భారతీయ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగుల్లో గుబులు

వాషింగ్టన్‌: అమెరికాలో ఇటీవల ఉద్యోగం కోల్పోయిన హెచ్‌-1బి వీసాదారులు నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. వీసా గడువు సమయమైన (గ్రేస్‌పీరియడ్‌) 60 రోజుల్లో ఉద్యోగం దొరకక వేల మంది భారతీయ సాఫ్ట్‌వేర్‌ నిపుణులు అయోమయ పరిస్థితుల్లో ఉన్నారు. కుటుంబాలతో వీరంతా అమెరికాను వీడి రావాల్సిన పరిస్థితి. ‘‘ఇది భారీ మానవ సంక్షోభం. ఈ ప్రభావం హెచ్‌-1బి వృత్తినిపుణుల కుటుంబసభ్యులపైనే కాదు, అమెరికాలో పుట్టిన పిల్లలపైనా పడనుంది. వీరు కూడా అర్థంతరంగా దేశాన్ని వీడాలి. ఆరంభంలో ఉద్యోగాలు కోల్పోయిన వారి పరిస్థితి మరీ విషమంగా ఉంది. వీరికి సమయం మించిపోతోంది’’ అని ఈ తరహా కేసులను చట్టసభ సభ్యుల ముందు ఎప్పటికప్పుడు లేవనెత్తుతున్న ఫౌండేషన్‌ ఫర్‌ ఇండియా అండ్‌ ఇండియన్‌ డయాస్పోరా స్టడీస్‌ (ఎఫ్‌ఐఐడీఎస్‌) శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపింది. ప్రస్తుత 60 రోజుల గడువు కారణంగా వేల మంది సాఫ్ట్‌వేర్‌ నిపుణులు ఇబ్బంది పడుతున్న విషయాన్ని గుర్తించిన అధ్యక్ష ఉప సలహా సంఘం ఇటీవల గ్రేస్‌ పీరియడ్‌ను ఆర్నెల్లకు పెంచాలని సిఫార్సు చేసింది. దీని వలన ఉద్యోగం కోల్పోయిన వారు కొత్త కొలువు వెతుక్కోవడానికి తగిన సమయం దొరుకుతుందని అభిప్రాయపడింది. సంక్లిష్టమైన దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేయడానికీ వెసులుబాటు లభ్యమవుతుందని పేర్కొంది. అయితే ఇది అమల్లోకి రావడానికి కొంత సమయం పడుతుంది. ఈ కొత్త విధానాన్ని తక్షణమే తీసుకురావాలని యూఎస్‌సీఐఎస్‌ను, డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ హోంలాండ్‌ను.. ఎఫ్‌ఐఐడీఎస్‌ కోరింది. అయితే ఈ నూతన సిఫార్సుకు వైట్‌హౌస్‌ ఆమోదముద్ర వేయాల్సి ఉంది. దీనికి కొంత సమయం పట్టే అవకాశం ఉంది. ఒక వేళ తొందరగా అమల్లోకి వచ్చినా.. గత ఏడాది అక్టోబరు సమయంలో ఉద్యోగాలు కోల్పోయిన వారికి పెద్దగా ప్రయోజనం ఒనగూరదు. గత ఏడాది నుంచి రెండు లక్షల 50 వేల మంది హెచ్‌-1బి వృత్తినిపుణులు అమెరికాలో ఉద్యోగాలు కోల్పోయారు. మెటాలాంటి పెద్ద సాంకేతిక సంస్థలు భారీగా వేటు వేస్తుండటంతో ఈ సంఖ్య క్రమంగా పెరుగుతూనే ఉంది ‘‘వీరంతా పన్ను చెల్లిస్తున్న హెచ్‌-1బి వలసదారులే. ఇందులో ఎక్కువమంది భారతీయులు. తమ తరఫున మరో సంస్థ హెచ్‌-1బికి దరఖాస్తు చేయకపోతే వీరంతా దేశం విడిచి వెళ్లాల్సి వస్తుంది’’ అని ఎఫ్‌ఐఐడీఎస్‌ తెలిపింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు