ఇమ్రాన్‌ ఇంట్లోకి భారీగా పోలీసుల చొరబాటు

మాజీ ప్రధాని, పాకిస్థాన్‌ తెహ్రీక్‌ ఏ ఇన్సాఫ్‌ (పీటీఐ) పార్టీ అధినేత ఇమ్రాన్‌ఖాన్‌కు చెందిన జమన్‌ పార్క్‌ నివాస ఆవరణలోకి శనివారం వేల సంఖ్యలో సాయుధ పోలీసు సిబ్బంది చొరబడ్డారు.

Published : 19 Mar 2023 03:21 IST

మాజీ ప్రధాని ఇస్లామాబాద్‌ కోర్టుకు వెళుతుండగా ఘటన
ఆయుధాలు, పేలుడు పదార్థాలు స్వాధీనం!

లాహోర్‌, ఇస్లామాబాద్‌: మాజీ ప్రధాని, పాకిస్థాన్‌ తెహ్రీక్‌ ఏ ఇన్సాఫ్‌ (పీటీఐ) పార్టీ అధినేత ఇమ్రాన్‌ఖాన్‌కు చెందిన జమన్‌ పార్క్‌ నివాస ఆవరణలోకి శనివారం వేల సంఖ్యలో సాయుధ పోలీసు సిబ్బంది చొరబడ్డారు. ఆ ప్రాంతంలో గుడారాలు వేసుకొని ఉంటున్న ఇమ్రాన్‌ మద్దతుదారులు గత వారం రోజులుగా మాజీ ప్రధాని అరెస్టుకు పోలీసులు చేస్తున్న ప్రయత్నాలను అడ్డుకొంటున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ‘తోషాఖానా’ అవినీతి కేసులో విచారణ నిమిత్తం శనివారం ఉదయం ఇమ్రాన్‌ ఇస్లామాబాద్‌ కోర్టుకు బయలుదేరిన తర్వాత.. ఇదే అదనుగా పంజాబ్‌ ప్రావిన్సు పోలీసులు మధ్యాహ్నం 12.00 గంటలకు   మేజర్‌ ఆపరేషన్‌ ప్రారంభించారు. ఆ మార్గంలో ఉన్న బారికేడ్లు, గుడారాలు తొలగించారు. ప్రతిఘటించిన వారిపై లాఠీచార్జి జరిపి అందరినీ ఆ ప్రాంతం నుంచి ఖాళీ చేయించారు. ప్రధాన గేటు, గోడలు తొలగించి ఇమ్రాన్‌ ఇంటి లోపలికి ప్రవేశించారు. ఈ సందర్భంగా 10 మంది కార్యకర్తలు, ముగ్గురు పోలీసులు గాయపడ్డారు. ఇంటి ఆవరణ లోపలి నుంచి తమపైకి కాల్పులు జరిపారని, పెట్రోల్‌ బాటిళ్లు విసిరినట్లు చెబుతున్న పోలీసులు 61 మంది పీటీఐ కార్యకర్తలను అరెస్టు చేశారు. పంజాబ్‌ డీజీపీ విజ్ఞప్తి మేరకు ఇమ్రాన్‌ నివాసం తనిఖీకి లాహోర్‌ హైకోర్టు శుక్రవారమే అనుమతులు మంజూరు చేసింది. పోలీసు చర్య ముగిశాక పాక్‌ అంతర్గత వ్యవహారాల మంత్రి రాణా సనావుల్లా మీడియాతో మాట్లాడుతూ.. ఇమ్రాన్‌ ఇంటి లోపల ఉన్న ‘ఉగ్రవాదులు’ అందరూ పట్టుబడ్డారని.. పోలీసు దాడుల్లో ఆయుధాలు, పేలుడు పదార్థాలు, బాంబు తయారీ సామగ్రి స్వాధీనం చేసుకొన్నట్లు తెలిపారు. పోలీసులు ఇమ్రాన్‌ భార్య బుష్రా బీబి ఉన్న గదిలోకి వెళ్లలేదని ఆయన స్పష్టం చేశారు. మరోవైపు, ఇస్లామాబాద్‌ కోర్టు వద్ద వాతావరణం ఉద్రిక్తంగా మారడంతో న్యాయవాది సూచన మేరకు.. వాహనంలోనే ఇమ్రాన్‌ హాజరు సంతకం తీసుకొని, వెనక్కు వెళ్లేందుకు జడ్జి అనుమతించారు. ‘తోషాఖానా’ కేసులో ఆయనపై ఉన్న అరెస్టు వారెంటును సైతం రద్దు చేసి, తదుపరి విచారణ మార్చి 30న ఉంటుందని ప్రకటించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని