ఉక్రెయిన్‌పై రష్యా డ్రోన్ల దాడులు

ఉక్రెయిన్‌పై రష్యా దాడుల పర్వం కొనసాగుతోంది. శుక్రవారం రాత్రి 16 డ్రోన్లతో పుతిన్‌ సేన విరుచుకుపడింది.

Published : 19 Mar 2023 04:26 IST

కీవ్‌: ఉక్రెయిన్‌పై రష్యా దాడుల పర్వం కొనసాగుతోంది. శుక్రవారం రాత్రి 16 డ్రోన్లతో పుతిన్‌ సేన విరుచుకుపడింది. వీటిలో 11 లోహవిహంగాలను నేలకూల్చామని ఉక్రెయిన్‌ వైమానిక దళం ప్రకటించింది. రాజధాని కీవ్‌, పశ్చిమ లివివ్‌ ప్రావిన్స్‌ సహా మధ్య, పశ్చిమ, తూర్పు ప్రాంతాల్లో ఈ దాడులు జరిగాయని తెలిపింది. కీవ్‌ వైపు వచ్చిన డ్రోన్లను తమ గగనతల రక్షణ వ్యవస్థలు కూల్చేసినట్లు నగరపాలక వ్యవస్థ అధిపతి సెర్హిల్‌ పోప్‌కో చెప్పారు. మూడు డ్రోన్లు పోలండ్‌ సరిహద్దుల్లోని ఒక జిల్లాను తాకాయి. మొత్తంమీద గడిచిన 24 గంటల్లో రష్యా దళాలు 34 వైమానిక దాడులు, ఒక క్షిపణి దాడి, విమాన విధ్వంసక వ్యవస్థలతో 57 రౌండ్ల కాల్పులు జరిపినట్లు శనివారం ఉదయం ఉక్రెయిన్‌ వాయుసేన ప్రకటించింది. దక్షిణ ఖేర్సన్‌ ప్రావిన్స్‌లో నింగి నుంచి పడ్డ శకలాల వల్ల ఏడు ఇళ్లు, ఒక ప్రాథమిక పాఠశాల దెబ్బతిన్నాయి. దొనెట్స్క్‌ ప్రావిన్స్‌లో జరిగిన శతఘ్ని గుళ్ల దాడుల్లో ఒకరు చనిపోగా, ముగ్గురు గాయపడ్డారు. 11 పట్టణాలు, గ్రామాలపై ఈ ప్రభావం కనిపించింది. జపోరిజియా నగరంలో రష్యా రాకెట్లు ఒక నివాస ప్రాంతంపై పడ్డాయి. ఫలితంగా కొన్ని ఇళ్లు దెబ్బతిన్నాయి.

క్రిమియాను సందర్శించిన పుతిన్‌

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ శనివారం క్రిమియాను సందర్శించారు. రష్యాలో ఈ ప్రాంతం విలీనమై 9 ఏళ్లయిన సందర్భంగా ఆయన అక్కడికి వెళ్లారు. ఈ పర్యటనలో ఆయన ఒక బాలల కేంద్రాన్ని సందర్శించారు. ఉక్రెయిన్‌ నుంచి పిల్లల తరలింపునకు ఆయనే బాధ్యుడంటూ అంతర్జాతీయ క్రిమినల్‌ కోర్టు (ఐసీసీ) ఆయనకు అరెస్టు వారెంటు జారీ చేసిన నేపథ్యంలో దీనికి ప్రాధాన్యం ఏర్పడింది. భద్రతా కారణాలరీత్యా క్రిమియాను తమ ఆధీనంలో ఉంచుకోవడం అనివార్యమని పుతిన్‌ పేర్కొన్నారు.


ధాన్యం ఒప్పందాన్ని పొడిగించిన రష్యా, ఉక్రెయిన్‌

ఉక్రెయిన్‌ నుంచి ఆఫ్రికా, పశ్చిమాసియా, ఆసియాకు ఆహారధాన్యాల ఎగుమతికి వీలు కల్పించే ఒప్పందాన్ని పొడిగించాలని రష్యా, ఉక్రెయిన్‌ నిర్ణయించాయి. యుద్ధ సమయంలో చేపట్టిన ఈ చర్య వల్ల పేదలకు ఉపశమనం లభిస్తుంది. ఇప్పటికే ఆయా ప్రాంతాల్లో ఆహార ధాన్యాల ధరలు పెరగడం వల్ల అనేక మంది ఇబ్బంది పడుతున్నారు.  ఒప్పందం పొడిగింపు నిర్ణయాన్ని తుర్కియే అధ్యక్షుడు ఎర్దోగాన్‌.. ఐరాసలో ప్రకటించారు. 120 రోజుల పాటు ఈ పొడిగింపును ఇచ్చినట్లు ఉక్రెయిన్‌ ఉపప్రధాని ఒలెక్సాండర్‌ కుబ్రాకోవ్‌ పేర్కొన్నారు.


 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు