సంక్షిప్త వార్తలు(5)
దక్షిణ ఈక్వెడార్, ఉత్తర పెరూ భూభాగాలను శనివారం మధ్యాహ్నం 12.30 సమయంలో (అక్కడి కాలమానం ప్రకారం) తీవ్ర భూకంపం కుదిపేసింది.
ఈక్వెడార్, పెరూలో భారీ భూకంపం..
15 మంది మృతి.. 126 మందికి గాయాలు
క్విటో: దక్షిణ ఈక్వెడార్, ఉత్తర పెరూ భూభాగాలను శనివారం మధ్యాహ్నం 12.30 సమయంలో (అక్కడి కాలమానం ప్రకారం) తీవ్ర భూకంపం కుదిపేసింది. దీని ప్రభావంతో ఈక్వెడార్‌లో 14 మంది, పెరూలో ఒకరు మృతి చెందారు. రెండు ప్రాంతాల్లో కలిపి 126 మంది గాయాలపాలయ్యారు. రిక్టర్ స్కేలుపై 6.8 తీవ్రతతో భూకంపం సంభవించినట్లు అమెరికా జియోలాజికల్ సర్వే తెలిపింది. ఈక్వెడార్‌లో రెండో పెద్ద నగరం గ్వాయాకిల్‌కు 80 కి.మీ. దూరంలో పసిఫిక్ తీరానికి సమీపంలో భూకంప కేంద్రాన్ని గుర్తించారు.
బాల్యంలో శ్వాసకోశ ఇన్ఫెక్షన్లతో.. పెద్దయ్యాక మరణ ముప్పు
లండన్: బాల్యంలో శ్వాసకోశ ఇన్ఫెక్షన్లు వస్తే, పెద్దయ్యాక.. అంటే 26 నుంచి 73 ఏళ్ల వయసులో శ్వాసకోశ వ్యాధులతో మరణించే ముప్పు ఎక్కువగా ఉంటుందని తాజా పరిశోధనల్లో తేలింది. ఈ విషయాన్ని ‘ద లాన్సెట్’ జర్నల్‌లో ఇటీవల ప్రచురితమైన పరిశోధన వ్యాసంలో తెలిపారు. శ్వాసకోశ వ్యాధుల వల్ల సంభవించే ముందస్తు మరణాల సంఖ్య తక్కువే అయినా, రెండేళ్ల వయసులో ‘దిగువ శ్వాసనాళ ఇన్ఫెక్షన్లు’ (ఎల్‌ఆర్‌టీఐ).. అంటే బ్రాంకైటిస్ లేదా న్యుమోనియా వస్తే, పెద్దయ్యాక శ్వాసకోశ వ్యాధులతో మరణించే ముప్పు- అది లేనివారి కంటే 93% ఎక్కువగా ఉంటుందట!
క్రానిక్ అబ్‌స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్ (సీఓపీడీ) లాంటి సమస్యల వల్ల 2017 సంవత్సరంలో 39 లక్షల మంది మరణించారు. ప్రపంచవ్యాప్తంగా సంభవించిన మొత్తం మరణాల్లో ఇది 7%. చిన్న వయసులో ఎల్‌ఆర్‌టీఐ వస్తే పెద్దయ్యాక ఆస్థమా, సీఓపీడీ లాంటి ఊపిరితిత్తుల సమస్యలు వస్తాయని తెలిసింది. ప్రస్తుతం పెద్దల్లో శ్వాసకోశ వ్యాధులన్నింటికీ ధూమపానం లాంటి జీవనశైలి సమస్యలనే ప్రధాన కారణంగా ఇన్నాళ్లూ చూస్తున్నామని, కానీ చిన్నవయసులో వారికి వచ్చిన వ్యాధులను బట్టి కూడా పెద్దయ్యాక కలిగే ముప్పును అంచనా వేయాల్సి ఉంటుందని లండన్ ఇంపీరియల్ కాలేజీకి చెందిన ప్రధాన పరిశోధకుడు జేమ్స్ అలిన్‌సన్ పేర్కొన్నారు. 1946లో పుట్టిన కొందరిని ఈ పరిశోధన కోసం అప్పటినుంచి 2019 వరకూ పరిశీలించారు. మొత్తం 3,589 మందిని పరిశీలించగా వారిలో 25% మందికి రెండేళ్ల వయసులోపే ఎల్‌ఆర్‌టీఐ వచ్చింది. వారిలో 19% మంది 73 ఏళ్లలోపే మరణించారు. మొత్తం 674 మరణాల్లో 8% మందికి సీఓపీడీ ఉండటం గమనార్హం!
బ్రిటన్ ఫోన్లకు హెచ్చరిక సందేశాల సౌకర్యం
ఏప్రిల్ నుంచి ప్రయోగాత్మకంగా అందుబాటులోకి
లండన్: తీవ్రమైన వాతావరణ పరిస్థితుల వంటి పౌరుల ప్రాణాలకు ముప్పు తెచ్చే సందర్భాల్లో వారిని హెచ్చరించి కాపాడేందుకు బ్రిటన్ ప్రభుత్వం వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. దీనిలో భాగంగా దేశంలోని ప్రజలందరి మొబైల్ ఫోన్లలో అత్యవసర హెచ్చరిక వ్యవస్థను అందుబాటులోకి తీసుకువస్తోంది. ఏప్రిల్ 23న దీన్ని ప్రయోగాత్మకంగా పరీక్షించనున్నారు.
వాతావరణ మార్పులపై ఐరాస నివేదికకు ఆమోదం
బెర్లిన్: వాతావరణ మార్పులపై ఐక్యరాజ్య సమితి రూపొందించిన అతి కీలకమైన నివేదికకు ఆదివారం పలు దేశాలు ఆమోదం తెలిపాయి. ధనిక, పేద దేశాల మధ్య కాలుష్య ఉద్గారాల లక్ష్యాలు, ముప్పు పొంచి ఉన్న దేశాలకు ఆర్థిక సాయం అంశాలపై ప్రతిష్టంభన నెలకొన్న నేపథ్యంలో ఈ ఆమోదం లభించడం గమనార్హం. స్విట్జర్లాండ్‌లోని ఇంటర్‌లాకెన్ పట్టణంలో జరిగిన సదస్సులో ఈ ఆమోదం లభించింది. ఆదివారం ఉదయానికే ఒప్పందానికి ఆమోదం లభించినా ప్రధాన అంశాలపై స్పష్టత రాలేదు. సోమవారం ఉదయం నివేదిక వివరాలను ఐరాస వెల్లడించనుంది.
‘కైలాస’.. సరిహద్దులు లేని దేశమట!
ఇంటర్నెట్ డెస్క్: వివాదాస్పద ఆధ్యాత్మికవేత్త నిత్యానంద స్వామి ప్రతినిధులమంటూ ఇటీవల ఐక్యరాజ్య సమితిలో కొందరు చేసిన ప్రసంగం కలకలం రేపింది. తాము కైలాస దేశానికి చెందిన వ్యక్తులమని.. అమెరికాతోపాటు అనేక నగరాలతో పలు ఒప్పందాలు చేసుకున్నామని ప్రకటించి వారు సంచలనం సృష్టించారు. ఈ ప్రకటనలపై అంతర్జాతీయంగా విమర్శలు రావడంతో ‘కైలాస’ పేరుతో ఓ దేశం ఉందా? అనే ప్రశ్నలు అంతటా తలెత్తాయి. దీనిపై స్పందించిన ‘కైలాస’ ప్రతినిధులు.. ఆ పేరుతో భౌగోళికంగా దేశం ఏదీ లేదని, తమది సరిహద్దులు లేని సేవా ఆధారిత దేశమని ప్రకటించారు. ‘‘ప్రాచీన హిందూ నాగరికత పునరుద్ధరణకు కృషి చేస్తున్నాం. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో ఐరాస గుర్తింపు పొందిన స్వచ్ఛంద సంస్థల ద్వారా సేవా కార్యకలాపాలు కొనసాగిస్తున్నాం. సావరిన్ ఆర్డర్ ఆఫ్ మాల్టా (భౌగోళికంగా లేనప్పటికీ దేశంగా గుర్తింపు) దేశం స్ఫూర్తితో సరిహద్దులు లేని మా సేవా ఆధారిత దేశంలో కుల, మత, లింగ భేదం లేకుండా ప్రతిఒక్కరి ఆనందమే మా ధ్యేయం’ అని పేర్కొన్నారు. ఈ దేశాన్ని ఎలా సందర్శించాలి, దేశంగా ప్రకటించుకోడానికి రుజువులు ఏమిటి? అని అడిగిన ప్రశ్నలకు స్పందిస్తూ.. ‘సావరిన్ ఆర్డర్ ఆఫ్ మాల్టా మాదిరిగానే కైలాస కూడా కొన్ని స్వచ్ఛంద సంస్థలు, ఆలయాలతోపాటు వివిధ దేశాల్లో ఉన్న మఠాల ద్వారా వ్యవహారాలు కొనసాగిస్తుంది’ అని వివరణ ఇచ్చారు. ఈక్వెడార్ ప్రాంతంలో సొంత ద్వీపముందని నిత్యానంద ఎప్పుడూ చెప్పలేదన్నారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Sports News
కోహ్లీ అందరికన్నా ముందొచ్చి..
-
Politics News
సమస్యలు అడిగితే చెప్పుతో కొడతా.. ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి
-
World News
82 ఏళ్ల వయసులో తండ్రి కాబోతున్న అల్ పాసినో
-
World News
‘బ్లూటూత్’తో మెదడు, వెన్నెముకల అనుసంధానం!.. నడుస్తున్న పక్షవాత బాధితుడు
-
Ap-top-news News
తిరుపతి జూలో పులి పిల్ల మృతి.. నిర్వాహకుల నిర్లక్ష్యమే కారణమా!
-
Ap-top-news News
అవినాష్ తల్లికి శస్త్రచికిత్స జరగలేదు.. చర్యలు తీసుకోండి