మేరియుపొల్‌లో పర్యటించిన పుతిన్‌

ఉక్రెయిన్‌ నుంచి చేజిక్కించుకున్న మేరియుపొల్‌ నగరంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ పర్యటించారు.

Published : 20 Mar 2023 04:10 IST

కీవ్‌: ఉక్రెయిన్‌ నుంచి చేజిక్కించుకున్న మేరియుపొల్‌ నగరంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ పర్యటించారు. ఈ విషయాన్ని రష్యా వార్తా సంస్థలు ఆదివారం వెల్లడించాయి. ఉక్రెయిన్‌ భూభాగాలపై తమ బలగాలు క్షిపణి దాడులు చేస్తున్న సమయంలోనే పుతిన్‌ మేరియుపొల్‌కు వెళ్లడం ప్రాధాన్యం సంతరించుకుంది. అంతకుముందు ఆయన క్రిమియాను సందర్శించిన సంగతి తెలిసిందే. ఏడాదిగా జరుగుతున్న యుద్ధంలో ఉక్రెయిన్‌కు చెందిన అనేక నగరాలపై రష్యా తీవ్రస్థాయిలో విరుచుకుపడింది. తీర ప్రాంత నగరమైన మేరియుపొల్‌్ కూడా ఇందులో ఉంది. ఇక్కడ పుతిన్‌ సేన దాడులను ఉక్రెయిన్‌ బలగాలు చాలాకాలం పాటు ప్రతిఘటించాయి. ఒక ఉక్కు కర్మాగారంలో ఉండి 83 రోజుల పాటు పోరాడాయి. చివరికి రష్యా సేనల ఉద్ధృతికి చేతులెత్తేశాయి. గత సెప్టెంబరులో మేరియుపొల్‌ను పుతిన్‌ సర్కారు తమ దేశంలో విలీనం చేసుకుంది. యుద్ధం వల్ల ఈ నగరం దాదాపు మరుభూమిగా మారింది. తాజాగా హెలికాప్టర్‌లో మేరియుపొల్‌ చేరుకున్న పుతిన్‌.. అక్కడి ముఖ్య ప్రదేశాలను సందర్శించారు. కన్సర్ట్‌ హాల్‌, బీచ్‌ వంటివి ఇందులో ఉన్నాయి. స్థానికులతో ముచ్చటించడం కనిపించింది. యుద్ధనేరాల అభియోగంపై పుతిన్‌పై అంతర్జాతీయ క్రిమినల్‌ కోర్టు వారెంటు జారీ చేసిన నేపథ్యంలో జరిగిన పర్యటన.. ఆయనలోని ధిక్కార వైఖరికి నిదర్శనమని కొందరు విశ్లేషకులు పేర్కొంటున్నారు. దక్షిణ రష్యాలోని రోస్తోవ్‌-ఆన్‌-డాన్‌లో ఉన్న సైనిక శిబిరాన్ని కూడా పుతిన్‌ సందర్శించారు. అక్కడ సైనిక అధికారులతో భేటీ అయ్యారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు