ఇమ్రాన్‌ పార్టీపై నిషేధం?

పాక్‌ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌కు చెందిన లాహోర్‌ ఇంటి నుంచి పోలీసులు మారణాయుధాలు స్వాధీనం చేసుకొన్న నేపథ్యంలో ఆయన సారథ్యంలోని ‘పాకిస్థాన్‌ తెహ్రీక్‌ ఏ ఇన్సాఫ్‌’ (పీటీఐ) పార్టీని నిషేధిత సంస్థగా ప్రకటించే అంశాన్ని షెహబాజ్‌ షరీఫ్‌ ప్రభుత్వం పరిశీలిస్తోంది.

Updated : 20 Mar 2023 06:01 IST

న్యాయ నిపుణులనుసంప్రదిస్తున్నట్లు తెలిపిన మంత్రి
అధినేత సహా పీటీఐ నేతలపై ఉగ్రవాద కేసు నమోదు

ఇస్లామాబాద్‌, లాహోర్‌: పాక్‌ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌కు చెందిన లాహోర్‌ ఇంటి నుంచి పోలీసులు మారణాయుధాలు స్వాధీనం చేసుకొన్న నేపథ్యంలో ఆయన సారథ్యంలోని ‘పాకిస్థాన్‌ తెహ్రీక్‌ ఏ ఇన్సాఫ్‌’ (పీటీఐ) పార్టీని నిషేధిత సంస్థగా ప్రకటించే అంశాన్ని షెహబాజ్‌ షరీఫ్‌ ప్రభుత్వం పరిశీలిస్తోంది. అంతర్గత వ్యవహారాల శాఖ మంత్రి రాణా సనావుల్లా ఈ విషయాన్ని ధ్రువీకరిస్తూ న్యాయ నిపుణులతో ప్రభుత్వం చర్చించనున్నట్లు మీడియాకు తెలిపారు. శనివారం ఇస్లామాబాద్‌ జిల్లా కోర్టుకు ఇమ్రాన్‌ హాజరైన సందర్భంగా ఆయన అనుచరులు సృష్టించిన విధ్వంసం, పోలీసులతో ఘర్షణకు దిగడంపై పాలకపక్ష నేతలు మండిపడుతున్నారు. కోర్టు లోపలికి వెళ్లకుండా వాహనంలో కూర్చొనే హాజరు సంతకం పెట్టడంపైనా వీరు విస్తుపోతున్నారు. ఈ అల్లర్లకు సంబంధించి ఇమ్రాన్‌ఖాన్‌తోపాటు దాదాపు 12 మంది పీటీఐ నేతలపై ఇస్లామాబాద్‌ పోలీసులు ఆదివారం ఉగ్రవాద కేసు నమోదు చేశారు. ఇమ్రాన్‌ పార్టీ ఓ ఉగ్రవాద సంస్థ అంటూ పాకిస్థాన్‌ ముస్లింలీగ్‌ (ఎన్‌) ఉపాధ్యక్షురాలు మరియం నవాజ్‌ వ్యాఖ్యానించగా.. ఈ వాదనను దాదాపుగా సమర్థిస్తున్నట్లే ప్రధాని షెహబాజ్‌ సైతం ట్వీట్‌ చేశారు.  


నా ఇంటిపై దాడి కోర్టు ధిక్కారమే : ఇమ్రాన్‌

‘‘సెర్చ్‌ వారెంట్‌ లేకుండా భారీసంఖ్యలో పోలీసులు నా ఇంటిపై దాడి చేయడం కోర్టు ధిక్కారమే. రాజకీయాలతో సంబంధం లేని బుష్రా బీబి (భార్య) ఇంట్లో ఒంటరిగా ఉండగా ఇలా చొరబడటం ఇస్లామిక్‌ సూత్రాలకు కూడా విరుద్ధమే. వారిపై న్యాయపరమైన చర్యలు తీసుకుంటాం’’ అంటూ ఇమ్రాన్‌ఖాన్‌ లాహోర్‌లోని తన ఇంట్లో పోలీసులు జరిపిన సోదాలపై వరుస ట్వీట్లు చేశారు. కాగా, ఈ తనిఖీల తర్వాత.. ఇమ్రాన్‌తోపాటు వెయ్యిమంది పీటీఐ కార్యకర్తలపై ఉగ్రవాద అభియోగాలతో కేసులు నమోదు చేస్తున్నట్లు లాహోర్‌ పోలీసులు ఆదివారం ప్రకటించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని