PM Modi: మోదీ అసాధారణ నేత.. చైనాలో భారీగా ఆదరణ

రెండు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలున్నా భారత ప్రధాని నరేంద్ర మోదీకి చైనా ప్రజల్లో భారీగా ఆదరణ ఉందని, ఆయనను చైనీయులు అసాధారణ పురుషుడిగా పరిగణిస్తున్నారని అమెరికా పత్రిక ‘డిప్లొమాట్‌’ వెల్లడించింది.

Published : 20 Mar 2023 08:31 IST

 ‘ది డిప్లొమాట్‌’ పత్రిక కథనం

బీజింగ్‌: రెండు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలున్నా భారత ప్రధాని నరేంద్ర మోదీకి చైనా ప్రజల్లో భారీగా ఆదరణ ఉందని, ఆయనను చైనీయులు అసాధారణ పురుషుడిగా పరిగణిస్తున్నారని అమెరికా పత్రిక ‘డిప్లొమాట్‌’ వెల్లడించింది. ఈ మేరకు ఒక కథనాన్ని అది ప్రచురించింది. మోదీ నాయకత్వంలోని భారత్‌ అగ్ర దేశాల మధ్య సమతూకం పాటిస్తోందని చైనా వ్యవహారాలను విశ్లేషించే జర్నలిస్టు ము షుంషాన్‌ అందులో పేర్కొన్నారు. ‘చైనీయులు సామాజిక మాధ్యమాల్లో ‘మోదీ లాక్షియన్‌’ అని మోదీకి పేరు పెట్టుకున్నారు. దాని అర్థం అసాధారణ సామర్థ్యమున్న వృద్ధుడైన దివ్య పురుషుడు. ఆయన మిగిలిన నేతలకన్నా విభిన్నంగా ఉంటారు’ అని ఆయన విశ్లేషించారు. ఆయన వస్త్రధారణ, రూపం అసాధారణంగా ఉంటాయని, ఆయన విధానాలూ గత నేతలకన్నా భిన్నంగా ఉంటాయని తెలిపారు. రష్యా, అమెరికా, దక్షిణ దేశాలతో మోదీ స్నేహంగా ఉంటారనేది చైనీయుల అభిప్రాయమని షుంషాన్‌ వివరించారు. 20ఏళ్ల నుంచీ అంతర్జాతీయ మీడియా వార్తలను తాను అందిస్తున్నానని, కానీ చైనీయులు ఒక విదేశీ నేతకు ముద్దు పేరు పెట్టడం ఎప్పుడూ లేదని పేర్కొన్నారు. చైనా ప్రజల దృష్టిలో ఆయనకు ప్రత్యేక స్థానముందని తెలిపారు. చైనాలో ట్విటర్‌కు పోటీగా వచ్చిన ‘సైనా వీబో’లో మోదీ 2015లో చేరారు. ఆయనకు 2.44 లక్షల మంది ఫాలోయర్లు ఉన్నారు. అయితే చైనా యాప్‌లపై నిషేధంలో భాగంగా 2020 జులై తర్వాత ఆయన తన ఖాతాను మూసేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని