ఉత్తర కొరియా డమ్మీ అణ్వాయుధ ప్రయోగం

డమ్మీ అణ్వాయుధంతో కూడిన క్షిపణిని ప్రయోగించామని ఉత్తర కొరియా సోమవారం వెల్లడించింది. దక్షిణ కొరియాపై అణ్వస్త్ర దాడి ఎలా చేయాలనే అంశాన్ని పరీక్షించే దిశగా దీన్ని చేపట్టింది.

Published : 21 Mar 2023 05:14 IST

క్షిపణి సాయంతో సముద్రంలో పరీక్ష

సియోల్‌: డమ్మీ అణ్వాయుధంతో కూడిన క్షిపణిని ప్రయోగించామని ఉత్తర కొరియా సోమవారం వెల్లడించింది. దక్షిణ కొరియాపై అణ్వస్త్ర దాడి ఎలా చేయాలనే అంశాన్ని పరీక్షించే దిశగా దీన్ని చేపట్టింది. అమెరికా, దక్షిణ కొరియాల ఉమ్మడి సైనిక విన్యాసాలను నిరసిస్తూ ఈ ప్రయోగాన్ని నిర్వహించింది. శత్రువుల దూకుడు నేపథ్యంలో యుద్ధ సన్నద్ధతను మెరుగుపరచుకోవాలని ఉత్తర కొరియా అణ్వస్త్ర బలగాలను ఆ దేశ అధ్యక్షుడు కిమ్‌ జోంగ్‌ ఉన్‌ ఆదేశించారు.  విన్యాసాల్లో భాగంగా ఆదివారం అమెరికాకు చెందిన బీ-1బీ బాంబర్‌ విమానాలు ఎగరడానికి సుమారు గంట ముందు ఉత్తర కొరియా తూర్పు తీరం నుంచి స్వల్పశ్రేణి క్షిపణిని ప్రయోగించినట్లు దక్షిణ కొరియా, జపాన్‌ సైనిక దళాలు గుర్తించాయి. డమ్మీ అణ్వాయుధం కలిగిన ఈ క్షిపణి సుమారు 800 కిలోమీటర్ల దూరం ప్రయాణించి.. సముద్రంలో లక్ష్యంగా నిర్దేశించిన ప్రాంతానికి 800 మీటర్ల ఎగువన విస్ఫోటం చెందిందని ఉత్తర కొరియా అధికార వార్తా సంస్థ కేసీఎన్‌ఏ తెలిపింది. దీని ద్వారా అణ్వాయుధ విస్ఫోట నియంత్రణ సాధనాలు, వార్‌హెడ్‌ డిటోనేటర్ల సమర్థతను పరీక్షించినట్లు పేర్కొంది. అమెరికా, దక్షిణ కొరియాలకు ఇది తీవ్ర హెచ్చరిక అని స్పష్టం చేసింది. ఉత్తర కొరియా అధినేత కిమ్‌ జోంగ్‌ ఉన్‌ తన కుమార్తె, సీనియర్‌ సైనిక అధికారులతో కలిసి ఈ క్షిపణి ప్రయోగానికి హాజరయ్యారు. అమెరికా, దక్షిణ కొరియాలు మార్చి 13న ఉమ్మడి సైనిక విన్యాసాలను ప్రారంభించాయి. వీటిని వ్యతిరేకిస్తున్న ఉత్తర కొరియా.. క్షిపణి ప్రయోగాలను ముమ్మరం చేసింది. మొత్తంగా ఈ నెలలో చేపట్టిన ఐదో అస్త్రపరీక్ష ఇది. ఈ దేశం 2022లో రికార్డుస్థాయిలో 70 క్షిపణులను పరీక్షించగా.. ఈ ఏడాది ఇప్పటివరకు 20 ప్రయోగించింది. ఉత్తర కొరియా ఇటీవల ఖండాంతర బాలిస్టిక్‌ క్షిపణిని ప్రయోగించిన నేపథ్యంలో ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి సోమవారం అత్యవసరంగా సమావేశమైంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు