కీవ్‌లో జపాన్‌ ప్రధాని ఆకస్మిక పర్యటన

జపాన్‌ ప్రధానమంత్రి ఫుమియో కిషిద ఆకస్మికంగా ఉక్రెయిన్‌ రాజధాని కీవ్‌లో పర్యటించారు. ఈ సంఘటన పలు దేశాలను ముఖ్యంగా చైనాను ఆశ్చర్యానికి లోను చేసింది.

Published : 22 Mar 2023 06:13 IST

బీజింగ్‌: జపాన్‌ ప్రధానమంత్రి ఫుమియో కిషిద ఆకస్మికంగా ఉక్రెయిన్‌ రాజధాని కీవ్‌లో పర్యటించారు. ఈ సంఘటన పలు దేశాలను ముఖ్యంగా చైనాను ఆశ్చర్యానికి లోను చేసింది. ఈ నెల 19నుంచి 21 వరకూ భారత్‌లో పర్యటించిన కిషిద మంగళవారం దిల్లీ నుంచి సంప్రదాయ ప్రభుత్వ విమానంలో కాకుండా ఛార్టర్డ్‌ విమానంలో రహస్యంగా ప్రయాణించి పోలండ్‌ చేరుకున్నారు. ఆ విమానం ఆదివారం రాత్రి జపాన్‌ రాజధాని టోక్యోలోని హనెడా విమానాశ్రయం నుంచి భారత్‌కు బయలుదేరింది. ఈ మేరకు జపాన్‌ టీవీ ఎన్‌హెచ్‌కే తెలిపింది. భారత పర్యటనను పూర్తి చేసుకున్న కిషిద మంగళవారం తెల్లవారుజామున అప్పటికే సిద్ధంగా ఉన్న ఛార్టర్డ్‌ విమానం ఎక్కి రహస్యంగా ప్రయాణించారు. పోలండ్‌ చేరుకున్న ఆయన అక్కడ నుంచి కీవ్‌కు చేరారు. ఉక్రెయిన్‌ అధ్యక్షుడు వొలొదిమిర్‌ జెలెన్‌స్కీతో భేటీ అయ్యారు. తమ దేశం తరఫున సంఘీభావం తెలిపి, తమ మద్దతు ఉంటుందని హామీ ఇచ్చారు.

అబ్రామ్స్‌ యుద్ధ ట్యాంకుల సరఫరాకు చర్యలు వేగవంతం

రష్యాతో యుద్ధం చేస్తున్న ఉక్రెయిన్‌కు తాము అందిస్తామన్న అత్యాధునిక అబ్రామ్స్‌ యుద్ధ ట్యాంకుల సరఫరా కార్యక్రమాన్ని అమెరికా వేగవంతం చేసింది. ఇందులో భాగంగా తమ వద్ద గల పాత యుద్ధ ట్యాంకులను ఆధునికీకరించి వాటిని ఎనిమిది నుంచి 10 నెలల్లో ఉక్రెయిన్‌కు అందించేందుకు చర్యలు చేపట్టింది. నిజానికి 31 నూతన ఎం1ఏ2 అబ్రామ్స్‌ ట్యాంకులను ఉక్రెయిన్‌కు అందించాలని భావించింది. వాటిని తయారు చేసి ఆ దేశానికి సరఫరా చేసేందుకు ఏడాది నుంచి రెండేళ్ల కాలం పట్టే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో తమ ఆయుధాగారంలో ఉన్న ఎం1ఏ1 రకం యుద్ధట్యాంకులను వారికి అందిస్తే వాటిని వినియోగించడం, నిర్వహించడం ఉక్రెయిన్‌ దళాలకు సులభంగా ఉంటుందని అమెరికా అధికారులు భావిస్తున్నారు. అంతేకాకుండా వాటిని ఆధునికీకరించి సరఫరా చేయడం కూడా త్వరితగతిన పూర్తవుతుందని అంచనాకొచ్చారు. ఈ విషయంపై త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.


ఐసీసీకి మెద్వదేవ్‌ క్షిపణి దాడి హెచ్చరిక

మాస్కో: క్షిపణులతో దాడి చేయగలమంటూ అంతర్జాతీయ న్యాయస్థానాని(ఐసీసీ)కి రష్యా సెక్యూరిటీ కౌన్సిల్‌ డిప్యూటీ ఛైర్మన్‌ దిమిత్రి మెద్వదేవ్‌ హెచ్చరికలు జారీ చేశారు. రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు ఐసీసీ అరెస్టు వారెంట్‌ జారీచేసిన నేపథ్యంలో ఈ తీవ్ర హెచ్చరికలు వెలువడ్డాయి. ‘భగవంతుడు, క్షిపణులకు ప్రతి ఒక్కరు జవాబుదారీగా ఉంటారు. ఉత్తర సముద్రంలోని రష్యా నౌక నుంచి హేగ్‌లోని భవనంపైకి హైపర్‌ సోనిక్‌ క్షిపణి దాడి ఊహించడం సాధ్యమే’ అంటూ హెచ్చరించారు. ఆకాశాన్ని సునిశితంగా గమనిస్తూ ఉండండి అంటూ జడ్జీలపై బెదిరింపులకు దిగారు. అలాగే ఐసీసీ ఒక దయనీయ అంతర్జాతీయ సంస్థ అంటూ వ్యాఖ్యానించారు.



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు