నీటి లోపల వంద రోజులు జీవిస్తే.. ప్రొఫెసర్‌ ఆసక్తికర ప్రయోగం!

మానవుడు పుట్టినప్పటి నుంచి భూమిపైనే జీవిస్తున్నాడు. ఈ క్రమంలో అనేక వ్యాధుల బారిన పడుతున్నాడు. అందుకే భూమిపై కాకుండా 100 రోజులు నీటిలో ఉంటే ఏ జరుగుతుందో తెలుసుకోవాలనే ఆలోచన ఓ ప్రొఫెసర్‌కు వచ్చింది.

Updated : 22 Mar 2023 09:26 IST

వాషింగ్టన్‌: మానవుడు పుట్టినప్పటి నుంచి భూమిపైనే జీవిస్తున్నాడు. ఈ క్రమంలో అనేక వ్యాధుల బారిన పడుతున్నాడు. అందుకే భూమిపై కాకుండా 100 రోజులు నీటిలో ఉంటే ఏ జరుగుతుందో తెలుసుకోవాలనే ఆలోచన ఓ ప్రొఫెసర్‌కు వచ్చింది. దాన్ని ఆచరిస్తే అనేక ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయనేది ఆయన విశ్వాసం.

పీడనంపై విశ్వాసంతో..

జోసెఫ్‌ అలియాస్‌ ‘డాక్టర్‌ డీప్‌ సీ’ 28ఏళ్లపాటు అమెరికా నౌకాదళంలో పనిచేశారు. అనంతరం యూనివర్సిటీ ఆఫ్‌ సౌత్‌ ఫ్లోరిడాలో చదివారు. అక్కడే ప్రొఫెసర్‌ స్థాయికి ఎదిగి మెదడుకు అయ్యే గాయాల గురించి పరిశోధనలు చేశారు. సైనికులకు బుల్లెట్లు, పదునైన ఆయుధాలు తగలడం వల్ల ఎక్కువగా గాయాలవుతుంటాయి. వీటి నుంచి కోలుకోవడం దాదాపుగా అసాధ్యం. అలాంటి వారి కోసం తన వంతుగా ఏదైనా పరిశోధన చేయాలని జోసెఫ్‌ నిర్ణయించుకున్నారు. హైపర్‌బారిక్‌ పీడనం గురించి అధ్యయనం చేశారు. మెదడు దెబ్బతిన్న వారి శరీరంలోకి స్వచ్ఛమైన ఆక్సిజన్‌ వెళ్లేలా ఈ చికిత్స చేయడం ద్వారా కాస్త మెరుగైన ఫలితాలు వస్తున్నాయని తెలుసుకున్నారు. ఈ క్రమంలో అధిక పీడనానికి గురయిన కణాలు ఐదు రోజుల్లోనే రెట్టింపు అవుతాయని ఆయనకు విశ్వాసం కలిగింది. తద్వారా ఆయుర్దాయం పెరుగుతుందని, వృద్ధాప్య సంబంధ వ్యాధులు దరి చేరవనే నిర్ణయానికి వచ్చారు. అందుకే జోసెఫ్‌ 100 రోజులు నీటిలో నివసించే ప్రయోగానికి పూనుకున్నారు.

ఆరోగ్యంపై నిరంతర పర్యవేక్షణ

నీటిలో ఉండేందుకు అనువుగా 100 చదరపు అడుగుల వైశాల్యంతో నివాస స్థలాన్ని సిద్ధం చేశారు. దీన్ని భూమట్టానికి కింద నీటిలో 30 అడుగుల లోతులో... ‘జూల్స్‌ అండర్‌ సీ లాడ్జ్‌’లో ఉంచారు. కీలార్గోలో ఆ ప్రదేశం ఉంది. లాడ్జి లోపలికి నీరు ప్రవేశించకుండా నిరంతరం గాలిని పంప్‌ చేస్తారు. దాంతో భూమి ఉపరితలంపై కంటే లోపల 1.6రెట్లు పీడనం ఉంటుంది. నీటి లోపల ఉంటూనే జోసెఫ్‌ బయోమెడికల్‌ ఇంజినీరింగ్‌ క్లాసులు బోధిస్తున్నారు. ఒక ప్రత్యేక వైద్య బృందం ఆయన ఆరోగ్య పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తూ ఉంది. ఎప్పటికప్పుడు ఆరోగ్య పరీక్షలు కూడా చేస్తున్నారు. ఆ పరీక్షలు మానసిక, శారీరక మార్పులను తెలుసుకునేలా ఉంటాయి. రక్త ప్రసరణ, అల్టాస్రౌండ్‌, ఎలక్ట్రోకార్డియోగ్రామ్స్‌, స్టెమ్‌సెల్‌ పరీక్షల ద్వారా మొత్తం సమాచారాన్ని సేకరిస్తున్నారు. ఈ నెల ప్రారంభంలో జోసెఫ్‌ లాడ్జ్‌లోకి వెళ్లారు. జూన్‌ 9 వరకు అక్కడే ఉండనున్నారు. ఇలా నీటి అడుగున జీవించే సాహసం 2014లోనూ జరిగింది. టెన్నెస్సీకి చెందిన ఇద్దరు ప్రొఫెసర్లు 73 రోజుల పాటు నీటిలో నివాసం ఉన్నారు.

పరిశోధనలే పరమావధి

తన ప్రయోగం గురించి ప్రొఫెసర్‌ జోసెఫ్‌ మాట్లాడుతూ ‘‘మనం జీవించడానికి కావాల్సినవన్నీ ఈ గ్రహంపై ఉన్నాయి. మొండి వ్యాధులను నయం చేసే శక్తి సముద్రంలోని కొన్ని జీవుల్లో ఉంది. దాన్ని కనుక్కుంటే సరిపోతుందని నమ్ముతున్నా. అందుకోసం మరిన్ని పరిశోధనలు జరగాలి. మానవ శరీరం ఎక్కువ రోజులు నీటిలో ఉండలేదు. ఉంటే ఏం జరుగుతుందో తెలుసుకునేందుకే ఈ ప్రయత్నం. ఈ ప్రయాణంలో నా శరీరం స్పందించే ప్రతి తీరును అధ్యయనం చేస్తాం. పీడనం కారణంగా నా ఆరోగ్యం కూడా మెరుగుపడుతుందని భావిస్తున్నా’’ అని వెల్లడించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని