చైనా కొంపముంచిన కొవిడ్‌ వ్యూహం!

జీరో కొవిడ్‌ విధానాన్ని అకస్మాత్తుగా ఎత్తివేయడం చైనా కొంపముంచిందా?.. దేశంలో వేలాది మరణాలకు ఇదే కారణమైందా?... ఈ ప్రశ్నలకు అవుననే సమాధానం వినిపిస్తోంది.

Published : 22 Mar 2023 06:16 IST

3 లక్షల మరణాలకు జిన్‌పింగ్‌ వైఫల్యమే కారణమా?

ఇంటర్నెట్‌ డెస్క్‌: జీరో కొవిడ్‌ విధానాన్ని అకస్మాత్తుగా ఎత్తివేయడం చైనా కొంపముంచిందా?.. దేశంలో వేలాది మరణాలకు ఇదే కారణమైందా?... ఈ ప్రశ్నలకు అవుననే సమాధానం వినిపిస్తోంది. పెద్దఎత్తున ప్రజా నిరసనలు చెలరేగడంతో అప్పటిదాకా కఠినంగా అమలుచేస్తున్న ‘జీరో కొవిడ్‌’ విధానాన్ని గతేడాది డిసెంబర్‌లో డ్రాగన్‌ ప్రభుత్వం హఠాత్తుగా ఎత్తివేసింది. ఆర్థికవ్యవస్థ మందగించి ప్రజలు భారీగా రోడ్లపైకి వచ్చారు. ఆందోళనకారులు ఏకంగా అధ్యక్షుడు జిన్‌పింగ్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేయడంతో ప్రభుత్వం దిగిరాక తప్పలేదు. అయితే, ఎటువంటి ముందస్తు జాగ్రత్తలు తీసుకోకుండా జీరో కొవిడ్‌ విధానానికి ముగింపు పలికిన అనంతరం దేశంలో లక్షల్లో మరణాలు నమోదయ్యాయి. ఇది ప్రభుత్వ వైఫల్యమే అనే వాదనలు వినిపిస్తున్నాయి. జీరో కొవిడ్‌ విధానాన్ని హఠాత్తుగా ఎత్తివేయకుండా వ్యాక్సినేషను పూర్తి చేసి, యాంటీ వైరల్‌ ఔషధాలు నిల్వ ఉంచుకున్నట్లయితే రెండు నుంచి మూడు లక్షల మరణాలను చైనా నివారించగలిగేదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

జీరో కొవిడ్‌ విధానం ఎత్తివేసిన ఆరు వారాల్లోనే 80 శాతం మందికి కొవిడ్‌ వేగంగా వ్యాపించినట్లు చైనా వ్యాధుల నియంత్రణ సంస్థ అంచనా వేసింది. దీని కారణంగా లక్షలాది ప్రాణాలు కోల్పోయినా చైనా మాత్రం 90 వేల మంది మాత్రమే మరణించినట్లు చెబుతోంది. జీరో కొవిడ్‌ విధానం ఎత్తివేసేనాటికి చైనాలో చాలామంది ప్రజలకు టీకాలు పూర్తిగా వేయలేదని, ముఖ్యంగా వృద్ధులకు టీకాలు అందించడంలో చైనా ప్రభుత్వం విఫలమైందని నిపుణులు తెలిపారు. దుకాణాల్లో  సరిపడా యాంటీ వైరల్‌ ఔషధాలు కూడా లేవన్నారు. సరైన ప్రణాళిక లేకపోవడంతో ఒమిక్రాన్‌ వేరియంట్‌ విజృంభించిందని చైనా వైద్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేశారు. శీతాకాలంలో.. వైరస్‌ చాలా తేలికగా వ్యాపించే సమయంలో అకస్మాత్తుగా జీరో కొవిడ్‌ విధానానికి ముగింపు పలకడం పరిస్థితిని మరింత దిగజార్చింది.


కొవిడ్‌ మూలాలు బహిర్గతం చేసే బిల్లుపై బైడెన్‌ సంతకం

కొవిడ్‌ మూలాలకు సంబంధించి వుహాన్‌ ల్యాబ్‌పై ఇంటెలిజెన్స్‌ సేకరించిన సమాచారాన్ని బహిర్గతం చేసే ద్వైపాక్షిక బిల్లుపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ సంతకం చేశారు. ఇప్పటికే ఈ బిల్లును అమెరికా కాంగ్రెస్‌లోని సెనేట్‌, రిపబ్లికన్లు ఆమోదించారు. చైనాలోని వుహాన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ వైరాలజీపై సేకరించిన సమాచారాన్ని బహిర్గతం చేయాలని ఈ బిల్లు సూచిస్తోంది. అక్కడ జరిగిన పరిశోధనలతో కొవిడ్‌ వ్యాప్తికి ఉన్న సంబంధాలను ఈ రహస్య సమాచారం వెల్లడించే అవకాశం ఉంది. ఈ వివరాలను తెలిపే క్రమంలో సున్నితమైన సమాచార వనరులను, ఇంటెలిజెన్స్‌ సంస్థ అనుసరించిన పద్ధతులను బహిర్గతం చేయాల్సిన అవసరం లేదు. ఇప్పటికే అమెరికాలో కొవిడ్‌ కారణంగా 11 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ నేపథ్యంలో తాజా బిల్లుపై బైడెన్‌ సంతకం చేస్తూ.. ‘‘జాతీయ భద్రతకు ప్రమాదకరంగా మారే సమాచారం మాత్రమే మా ప్రభుత్వం రహస్యంగా ఉంచుతుంది’’ అని పేర్కొన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని