ఇజ్రాయెల్‌ దుందుడుకు చర్య

ఇజ్రాయెల్‌ సైనికులు గాజా ప్రాంతం నుంచి ఉపసంహరించుకున్న సమయంలోనే వెస్ట్‌బ్యాంక్‌లో నాలుగు యూదు కాలనీలను ఖాళీ చేయించిన 2005 నాటి చట్టాన్ని ఇజ్రాయెల్‌ పార్లమెంటు మంగళవారం రద్దు చేసింది.

Published : 22 Mar 2023 05:43 IST

2005 చట్టాన్ని రద్దు చేసిన పార్లమెంటు
వెస్ట్‌బ్యాంక్‌ ప్రాంతాలకు మళ్లీ యూదులు వెళ్లే అవకాశం

జెరూసలెం: ఇజ్రాయెల్‌ సైనికులు గాజా ప్రాంతం నుంచి ఉపసంహరించుకున్న సమయంలోనే వెస్ట్‌బ్యాంక్‌లో నాలుగు యూదు కాలనీలను ఖాళీ చేయించిన 2005 నాటి చట్టాన్ని ఇజ్రాయెల్‌ పార్లమెంటు మంగళవారం రద్దు చేసింది. దీనివల్ల వెస్ట్‌బ్యాంక్‌ ప్రాంతాలకు యూదులు తిరిగివచ్చి కాలనీలు ఏర్పాటు చేసుకోవడానికి వీలు కలుగుతోంది. గాజా నుంచి ఇజ్రాయెల్‌ వైదొలగిన రెండేళ్లకు హమాస్‌ అనే మిలిటెంట్‌ సంస్థ ఆ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకుంది. తూర్పు జెరూసలెం రాజధానిగా వెస్ట్‌బ్యాంక్‌, గాజా ప్రాంతాలతో స్వతంత్ర పాలస్తీనాను ఏర్పాటు చేసుకోవాలన్న పాలస్తీనా ప్రజల స్వప్నానికి ఇజ్రాయెల్‌ తాజా చర్య తూట్లు పొడిచింది. 1967 పశ్చిమాసియా యుద్ధంలో ఇజ్రాయెల్‌ ఈ ప్రాంతాలను ఆక్రమించింది. అప్పటి నుంచి 7 లక్షల మంది ఇజ్రాయెలీలు వెస్ట్‌బ్యాంక్‌, తూర్పు జెరూసలెంలలో డజన్ల కొద్దీ కాలనీలను ఏర్పాటుచేసుకున్నారు. ఈ కాలనీలే ఇజ్రాయెల్‌-పాలస్తీనా శాంతి ప్రక్రియకు అడ్డుతగులుతున్నాయి. పాలస్తీనా వారు తమవని వాదిస్తున్న ప్రాంతాల్లో యూదు కాలనీలను ఏర్పాటు చేయకూడదని ఇజ్రాయెల్‌ నేస్తం అమెరికాతో సహా పలు దేశాలు డిమాండ్‌ చేస్తున్నాయి. కానీ, బెంజమిన్‌ నెతన్యాహు మితవాద ప్రభుత్వం అంతర్జాతీయ డిమాండ్లను లెక్కచేయడం లేదు. యూదు కాలనీల విస్తరణకే కట్టుబడి ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని