భారత హైకమిషన్‌పై నీళ్ల సీసాల వర్షం

బ్రిటన్‌ రాజధాని లండన్‌లోని భారత రాయబార కార్యాలయంపై ఖలిస్థాన్‌ అనుకూలురు మరోసారి అక్కసు చూపారు.

Published : 23 Mar 2023 03:21 IST

లండన్‌లో ఖలిస్థాన్‌ అనుకూలుర దుశ్చర్య

లండన్‌: బ్రిటన్‌ రాజధాని లండన్‌లోని భారత రాయబార కార్యాలయంపై ఖలిస్థాన్‌ అనుకూలురు మరోసారి అక్కసు చూపారు. పక్కా ప్రణాళికతో మహిళలు, చిన్నారులు సహా సుమారు 2000 మంది కార్యాలయం మీదుగా ఖలిస్థాన్‌ అనుకూల నినాదాలు చేసుకుంటూ బుధవారం నిరసన ప్రదర్శన నిర్వహించారు. ప్రతిగా భారత దౌత్య సిబ్బంది భవనంపైకి చేరి త్రివర్ణ పతాకాలు ప్రదర్శించారు. ఆ సందర్భంగా బారికేడ్లు సహా పటిష్ఠ బందోబస్తు గల హైకమిషన్‌ కార్యాలయంపై ఆందోళనకారులు నీళ్ల సీసాలు విసిరారు. ఈ నేపథ్యంలో ఇండియా హౌస్‌ ప్రాంతంలో స్కాట్లాండ్‌ యార్డ్‌ పోలీసులు మరిన్ని బారికేడ్లు ఏర్పాటు చేశారు. అదనపు పోలీసు అధికారులను మోహరించారు. నిరసనకారులు మైకులను ఉపయోగించి భారత వ్యతిరేక ఉపన్యాసాలు చేశారు. పంజాబ్‌ పోలీసులు మానవహక్కుల ఉల్లంఘనలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. భారత మీడియా పక్షపాతంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. ఇదిలా ఉండగా లండన్‌లోని భారత రాయబార కార్యాలయం వద్ద భద్రత కట్టుదిట్టమైంది. బారీకేడ్ల సంఖ్య పెరిగడంతో పాటు భద్రతాధికారుల సంఖ్య పెరిగింది. లండన్‌లోని భారత రాయబార కార్యాలయం వద్ద ఆదివారం ఖలిస్థాన్‌ అనుకూలురు త్రివర్ణ పతాకాన్ని అవమానించిన అనంతరం కూడా అక్కడ పటిష్ఠ భద్రత ఏర్పాటు చేయకపోవడంపై భారత్‌ తీవ్రంగా స్పందించింది. దిల్లీ చాణక్యపురిలోని శాంతిపథ్‌లో ఉన్న బ్రిటన్‌ హైకమిషన్‌ కార్యాలయం బయట బారికేడ్లను తొలగించింది. ఈ పరిణామంతో యూకే ప్రభుత్వం ఇండియా హౌస్‌ వద్ద బారికేడ్లను ఏర్పాటు చేసి భద్రతను పెంచింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని