Antarctica: పశ్చిమ అంటార్కిటికాలో 3 లక్షల టన్నుల మంచు మాయం

పశ్చిమ అంటార్కిటికాలోని అముండ్సెన్‌ సముద్రంలో గత 25 ఏళ్లలో 3 లక్షల టన్నుల మంచు కరిగిపోయినట్లు శాస్త్రవేత్తలు తాజాగా ప్రకటించారు.

Updated : 23 Mar 2023 07:16 IST

తాజా అధ్యయనంలో వెల్లడి

దిల్లీ: పశ్చిమ అంటార్కిటికాలోని అముండ్సెన్‌ సముద్రంలో గత 25 ఏళ్లలో 3 లక్షల టన్నుల మంచు కరిగిపోయినట్లు శాస్త్రవేత్తలు తాజాగా ప్రకటించారు. ఈ మేరకు లీడ్స్‌ విశ్వవిద్యాలయం నిర్వహించిన అధ్యయనంలో 1966-2021 మధ్య 3,331 బిలియన్‌ టన్నుల హిమ ఫలకాలు కరిగిపోయాయని, ఫలితంగా ప్రపంచవ్యాప్తంగా సముద్ర మట్టాలు 9 మిల్లీ మీటర్ల మేర పెరిగాయని వెల్లడైంది. ఒక వేళ కరిగిపోయిన ఈ మంచునంతా లండన్‌ నగరంపై పేర్చితే 2 కిలోమీటర్ల పొడవు ఉంటుందని, మన్‌హట్టన్‌పై ఉంచితే 137 ఎంపైర్‌ భవంతులను ఒకదానిపై ఒకటి ఉంచితే ఎంత పొడవు ఉంటుందో అంత ఉంటుందని శాస్త్రవేత్తలు చెప్పారు. ‘‘మహాసముద్రాల ఉష్ణోగ్రతలు, హిమ ఫలకాల్లో మార్పులు దీర్ఘకాలం ఉండేలా పరిస్థితి కనిపిస్తోంది. అలాగే పశ్చిమ అంటార్కిటికా మంచు ఫలకంపై భారీస్థాయిలో మార్పులు సంభవించనున్నాయి. సముద్ర మట్టాల పెరుగుదలకు అవసరమైన జలాలను ఈ మార్పులు సమకూర్చే అవకాశం ఉన్నందున మనం వాటిపై మరింతగా పరిశోధన చేయాలి’’ అని లీడ్స్‌ విశ్వవిద్యాలయానికి చెందిన ప్రధాన పరిశోధక కర్త బెంజమిన్‌ డేవిసన్‌ తెలిపారు. అముండ్సెన్‌ సముద్ర ప్రాంతంలోని 20 హిమ శిఖరాలు ప్రపంచ మహా సముద్రాల మట్టాలు పెరగడానికి దోహదం చేస్తున్నట్లు ఈ సందర్భంగా శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ మంచు అంతా కరిగిపోయి నీరుగా మారితే ప్రపంచవ్యాప్తంగా సముద్ర మట్టాలు ఒక మీటరు కంటే ఎక్కువగా పెరుగుతాయని శాస్త్రవేత్తలు హెచ్చరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని