క్వాడ్, ఆకస్లపై రష్యా, చైనా వ్యతిరేకత
ఉక్రెయిన్ యుద్ధం అంతర్జాతీయ సమీకరణలను వేగంగా మార్చేస్తోంది. చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ మాస్కో వెళ్లి రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో సమావేశమైన సమయంలోనే జపాన్ ప్రధాన మంత్రి ఫుమియో కిషిద ఉక్రెయిన్, పోలండ్‌లను సందర్శించారు.
ఆ రెండు కూటములు ప్రచ్ఛన్నయుద్ధ మనస్తత్వానికి ప్రతీకలని ధ్వజం
బీజింగ్, మాస్కో, వాషింగ్టన్: ఉక్రెయిన్ యుద్ధం అంతర్జాతీయ సమీకరణలను వేగంగా మార్చేస్తోంది. చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ మాస్కో వెళ్లి రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో సమావేశమైన సమయంలోనే జపాన్ ప్రధాన మంత్రి ఫుమియో కిషిద ఉక్రెయిన్, పోలండ్‌లను సందర్శించారు. ఆసియా-పసిఫిక్‌లో అమెరికా, నాటోలు... క్వాడ్, ఆకస్ పేరిట కొత్త కూటములను కట్టడం ప్రచ్ఛన్న యుద్ధ మనస్తత్వాన్ని సూచిస్తోందనీ, ఆ ప్రాంతంలో శాంతి, సుస్థిరతలను దెబ్బతీస్తోందని పుతిన్, జిన్‌పింగ్‌లు బుధవారం మాస్కోలో పేర్కొన్నారు. అమెరికా వ్యూహానికి ప్రతిగా స్వేచ్ఛాయుత, సమాన, సమ్మిళిత భద్రతా వ్యవస్థను నిర్మిస్తామని ఉద్ఘాటించారు. క్వాడ్‌లో భారత్ కూడా సభ్య దేశమనే సంగతి ఇక్కడ గమనార్హం. కొత్త శకానికి రష్యా, చైనాలు వ్యూహాత్మక భాగస్వామ్య ఒప్పందాన్నీ, ఆర్థిక సహకార వృద్ధి ఒప్పందాన్నీ కుదుర్చుకున్నట్లు పుతిన్, జిన్‌పింగ్‌లు రెండు వేర్వేరు సంయుక్త ప్రకటనల్లో వెల్లడించారు. రష్యా, ఉక్రెయిన్ల మధ్య శాంతి సాధనకు మధ్యవర్తిత్వం వహిస్తానని జిన్‌పింగ్ ప్రకటించగా, అమెరికా ఆ ప్రకటన లొసుగులమయమని పేర్కొంది. చైనా, రష్యాలు 2030 వరకు ఆర్థిక సహకార వృద్ధికి కుదుర్చుకున్న ఒప్పందం కింద 16,500 కోట్ల డాలర్ల వ్యయంతో 80 ముఖ్యమైన ద్వైపాక్షిక ప్రాజెక్టులు చేపడతాయి. 2030కల్లా చైనాకు రష్యా 9800 కోట్ల ఘనపు మీటర్ల సహజ వాయువును, 10 కోట్ల టన్నుల ఎల్ఎన్జీని సరఫరా చేస్తుంది. 2022లో రెండు దేశాల వాణిజ్యం రికార్డు స్థాయిలో 19,027 కోట్ల డాలర్లకు చేరింది.
చైనా, రష్యా అవకాశవాద పొత్తు: అమెరికా
అమెరికా, నాటోల ప్రభావాన్ని ఎదుర్కోవడానికి పుతిన్ ఉపయోగపడతారని చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ ఆశిస్తున్నట్లు అమెరికా జాతీయ భద్రతా మండలి సమన్వయకర్త జాన్ కర్బీ బుధవారం వ్యాఖ్యానించారు. జిన్‌పింగ్ రష్యా పర్యటనను ఉద్దేశించి ఆయన ఈ విషయాన్ని పేర్కొన్నారు. చైనా, రష్యాలు నానాటికీ దగ్గరవుతున్నా ఆ రెండు దేశాలు ఇంకా కూటమి కట్టలేదనీ, కేవలం అవకాశవాద పొత్తును ఏర్పరచుకున్నాయని కర్బీ అన్నారు. ప్రపంచంలో మిత్రులను పోగొట్టుకున్న పుతిన్... చైనా అధ్యక్షుడి వల్ల ఏదో ఒరుగుతుందని ఆశిస్తున్నారనీ పేర్కొన్నారు. రష్యా, ఉక్రెయిన్లు కాల్పులు విరమించి, శాంతి చర్చలు ప్రారంభించాలనీ, అందుకు తాను మధ్యవర్తిత్వం వహిస్తాననీ జిన్‌పింగ్ అంటున్నారు. అయితే, జిన్‌పింగ్ ఇంతవరకు ఉక్రెయిన్‌పై రష్యా దండయాత్రను ఖండించలేదనీ, రష్యా నుంచి చమురు, గ్యాస్ కొంటూనే ఉన్నారనీ, అలాంటప్పుడు ఆయన నిష్పాక్షిక మధ్యవర్తిత్వం ఎలా వహించగలరని కర్బీ ప్రశ్నించారు. పుతిన్, జిన్‌పింగ్ సంయుక్త ప్రకటనలో ఐక్యరాజ్యసమితి నిబంధనలను అందరూ గౌరవించాలని పిలుపునిచ్చారనీ, ఆ నిబంధనలను నిజంగా గౌరవిస్తే ఉక్రెయిన్ నుంచి రష్యా వైదొలగాలని కర్బీ అన్నారు.
పోలండ్‌కు జపాన్ అండ
ఉక్రెయిన్‌కు అండగా నిలచిన పోలండ్ అభివృద్ధికి తోడ్పడతానని జపాన్ భరోసా ఇచ్చింది. యుద్ధం వల్ల ఉక్రెయిన్ నుంచి శరణార్థులు పోలండ్‌కు పోటెత్తుతున్నారు. 13 నెలలుగా కొనసాగుతున్న యుద్ధంలో ఉక్రెయిన్‌కు సైనిక, రాజకీయ, మానవతా సహాయాలను పోలండ్ అందిస్తోంది. దీనివల్ల పోలండ్పై పెరిగిన భారాన్ని తట్టుకోవడానికి సహాయం అందించడంతో పాటు అభివృద్ధి ప్రాజెక్టులకూ తోడ్పాటు అందిస్తామని జపాన్ ప్రధానమంత్రి కిషిద బుధవారం ప్రకటించారు. ఆయన ఉక్రెయిన్‌కు వెళ్లి, అక్కడి నుంచి పోలండ్‌కు వచ్చారు. రష్యా సామ్రాజ్యవాదం వల్ల ఎదురవుతున్న ప్రమాదాన్ని తాము గుర్తించామని జపాన్ ప్రధాని కిషిద, పోలండ్ ప్రధాని మాట్యూజ్ మోరోవియెకి సంయుక్త ప్రకటనలో ఉద్ఘాటించారు. మే నెలలో జీ-7 శిఖరాగ్ర సభకు జపాన్ ఆతిథ్యం ఇవ్వనున్నది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
సిబ్బందిని మందలించిందని.. వ్యాపార భాగస్వామిని చితకబాదాడు..
-
అప్పుడు హమాలీ.. ఇప్పుడు వడ్రంగి
-
వరద నీటిలో కొట్టుకుపోయిన 190 పశువులు
-
భారతీయులకు వీసాల జారీలో అమెరికా రికార్డు..!
-
Chandrayaan-3: ప్రజ్ఞాన్ రోవర్ మేల్కోకపోయినా ఇబ్బందేం లేదు: సోమనాథ్
-
Rajasthan : ఉప రాష్ట్రపతి తరచూ రాజస్థాన్‌కు ఎందుకొస్తున్నారు.. మీ పర్మిషన్ కావాలా?