సంక్షిప్త వార్తలు(5)

త్రీడీ ముద్రిత విధానంలో ఉత్పత్తి చేసిన విడిభాగాలతో తయారైన ఓ రాకెట్‌ ప్రయోగం అమెరికాలో తాజాగా విఫలమైంది. ‘టెర్రాన్‌’గా పిలిచే ఈ 110 అడుగుల ఎత్తయిన రాకెట్‌ను రిలేటివిటీ స్పేస్‌ అనే అంకుర కంపెనీ రూపొందించింది.

Updated : 24 Mar 2023 05:59 IST

త్రీడీ ముద్రిత రాకెట్‌ ప్రయోగం విఫలం

కెనవెరాల్‌: త్రీడీ ముద్రిత విధానంలో ఉత్పత్తి చేసిన విడిభాగాలతో తయారైన ఓ రాకెట్‌ ప్రయోగం అమెరికాలో తాజాగా విఫలమైంది. ‘టెర్రాన్‌’గా పిలిచే ఈ 110 అడుగుల ఎత్తయిన రాకెట్‌ను రిలేటివిటీ స్పేస్‌ అనే అంకుర కంపెనీ రూపొందించింది. 200 కిలోమీటర్ల ఎత్తులోని కక్ష్యలో దాన్ని ప్రవేశపెట్టాలని భావించింది. ఈ ప్రయోగంలో భాగంగా కేప్‌ కెనవెరాల్‌ స్పేస్‌ ఫోర్స్‌ స్టేషన్‌ నుంచి బుధవారం రాత్రి రాకెట్‌ సజావుగానే పైకి ఎగిరింది. తద్వారా తొలి దశను విజయవంతంగా పూర్తిచేసుకుంది. అయితే తర్వాతి దశ ఆరంభమైన కొద్దిసేపటికే రాకెట్‌ అట్లాంటిక్‌ మహాసముద్రంలో కూలిపోయింది. టెర్రాన్‌లో 85 శాతాన్ని త్రీడీ ముద్రణ సాంకేతికత సాయంతో రూపొందించిన విడిభాగాలతోనే తయారుచేశారు. దీని ప్రయోగ ప్రయత్నాలు ఇంతకుముందు రెండుసార్లు విఫలమయ్యాయి.  


అగ్రరాజ్యంలో ఇద్దరిని కాల్చి హతుడైన విద్యార్థి

డెన్వర్‌: అమెరికాలోని డెన్వర్‌లో ఈస్ట్‌ హైస్కూలుకు చెందిన ఆస్టిన్‌ లైల్‌ అనే 17 ఏళ్ల విద్యార్థి ఇద్దరు పాఠశాల అధికారులపై కాల్పులు జరిపాడు. బుధవారం ఉదయం 10 గంటలకు ఈ సంఘటన జరిగింది. ఘటన అనంతరం అతను కారులో పరారయ్యాడు. అదే రోజు రాత్రి లైల్‌ కారు డెన్వర్‌కు సమీపంలోని ఒక అడవిలో కనిపించింది. ఆ కారుకు దగ్గర్లోనే అతని మృతదేహాన్ని కనుగొన్నట్లు పోలీసులు చెప్పారు.


టిక్‌టాక్‌ సీఈవోపై ప్రశ్నల వర్షం

వాషింగ్టన్‌: టిక్‌టాక్‌ను ఎందుకు నిషేధించకూడదన్న విషయంలో ఆ సంస్థ సీఈవో షౌ జీ చూను అమెరికా చట్టసభ సభ్యుల (కాంగ్రెషనల్‌) కమిటీ గురువారం ప్రశ్నించింది. కమిటీ వద్ద ఆయన స్వయంగా వాదనలు వినిపించారు. టిక్‌టాక్‌కు అమెరికాలో 15 కోట్ల మంది వినియోగదారులు ఉన్నారు. అమెరికా-చైనా మధ్య వాణిజ్యం, సాంకేతిక పరమైన అంశాల్లో పోటీ తీవ్రంగా ఉన్న విషయం తెలిసిందే. దీని ప్రభావం టిక్‌టాక్‌పై, దాని మాతృ సంస్థ బైట్‌డ్యాన్స్‌పైనా పడింది. అమెరికా కాంగ్రెస్‌, శ్వేతసౌధం, సైనిక బలగాలు, సగానికి పైగా రాష్ట్రాలు టిక్‌టాక్‌ను అధికారిక ఫోన్లలో వాడకుండా నిషేధం ఉంది. టిక్‌టాక్‌ వల్ల అమెరికాకు, దేశ ప్రజల వ్యక్తిగత భద్రతకు ముప్పు ఉందో లేదో చెప్పాలని సీఈవోను కాంగ్రెషనల్‌ కమిటీ అధ్యక్షురాలు కెథే మిక్‌మోరిస్‌ రాజుర్జ్‌ ప్రశ్నించారు. తమ యాప్‌ వల్ల జాతీయ భద్రతకు ఏమాత్రం ముప్పు ఉండదనీ, యువ వినియోగదారుల భద్రత తమకు అత్యంత ముఖ్యమని చూ చెప్పారు. ఒరాకిల్‌ సర్వర్లలో డేటాను భద్రపరచనున్నామని, బైట్‌ డ్యాన్స్‌ అనేది చైనాకు గానీ, మరే ఇతర దేశానికి గానీ ఏజెంటు కాదని స్పష్టంచేశారు.


కుల వివక్షకు వ్యతిరేకంగా అమెరికాలో బిల్లు

వాషింగ్టన్‌: అమెరికాలో కుల వివక్షను నిషేధిస్తూ కాలిఫోర్నియా రాష్ట్ర సెనెట్‌లో బుధవారం ఒక బిల్లు ప్రవేశపెట్టారు. డెమోక్రటిక్‌ పార్టీ సెనెటర్‌ ఆయిషా వహబ్‌ ఈ బిల్లును ప్రవేశపెట్టారు. ఆమె రాష్ట్ర లెజిస్లేచర్‌కు ఎన్నికైన తొలి అఫ్గాన్‌ అమెరికన్‌ ముస్లిం సభ్యురాలు. బిల్లు కనుక సభామోదం పొందితే అమెరికాలో అతిపెద్ద జనాభా కలిగిన కాలిఫోర్నియా రాష్ట్రం కుల విచక్షణను నిషేధించిన మొట్టమొదటి రాష్ట్రమవుతుంది.


మరోసారి క్షమాపణ కోరిన బోరిస్‌ జాన్సన్‌

లండన్‌: పార్టీగేట్‌ ఉదంతంపై బ్రిటన్‌ మాజీ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ మరోసారి క్షమాపణలు కోరారు. బోరిస్‌కు తెలిసే పార్లమెంటును తప్పుదోవ పట్టించారా అనే అంశంపై హౌస్‌ ఆఫ్‌ కామన్స్‌ ప్రివిలేజ్‌ కమిటీ విచారణ జరుపుతోంది. బుధవారం ఈ కమిటీ ముందు హాజరైన ఆయన జరిగిన ఘటనకు క్షమాపణ తెలిపారు. పార్టీలో కొవిడ్‌ నిబంధనలు పాటించడంపై పార్లమెంటును తప్పుదోవ పట్టించడం అనుకోకుండా జరిగిందని, బాధ్యతారాహిత్యంతో ఉద్దేశపూర్వకంగా మాత్రం కాదని వెల్లడించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని