పుతిన్‌ను అరెస్టు చేస్తే యుద్ధమే

అంతర్జాతీయ క్రిమినల్‌ కోర్టు (ఐసీసీ) వారెంట్‌తో ఏ దేశమైనా తమ అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ను అరెస్టు చేసే ప్రయత్నం చేస్తే, వారిపై యుద్ధం ప్రకటిస్తామని నాటో, ఐరోపా కూటమిని రష్యా హెచ్చరించింది.

Published : 24 Mar 2023 05:09 IST

అణుముప్పూ తప్పదు
పాశ్చాత్య దేశాలకు రష్యా హెచ్చరిక

మాస్కో/బ్రసెల్స్‌/బీజింగ్‌: అంతర్జాతీయ క్రిమినల్‌ కోర్టు (ఐసీసీ) వారెంట్‌తో ఏ దేశమైనా తమ అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ను అరెస్టు చేసే ప్రయత్నం చేస్తే, వారిపై యుద్ధం ప్రకటిస్తామని నాటో, ఐరోపా కూటమిని రష్యా హెచ్చరించింది. తమ దేశంలోకి అడుగుపెడితే రష్యా అధ్యక్షుడిని అదుపులోకి తీసుకుంటామని ఇటీవల జర్మనీ మంత్రి ప్రకటించిన నేపథ్యంలో గురువారం రష్యా భద్రతా మండలి ఉపకార్యదర్శి దిమిత్రి మెద్వ్‌దెవ్‌ ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘పుతిన్‌ను అరెస్టు చేయాలన్న ఊహ ఎప్పటికీ వాస్తవమవ్వదు. పోనీ వాస్తవమైందనే ఊహిద్దాం. ఉదాహరణకు పుతిన్‌ జర్మనీ వెళ్లారు. అక్కడ అరెస్టు చేశారనుకుందాం. అది రష్యా సమాఖ్యపై యుద్ధం ప్రకటించడమే. తక్షణమే మా క్షిపణులు, మిగతా ఆయుధాలన్నీ జర్మనీ ఛాన్సలర్‌ కార్యాలయంవైపు దూసుకుపోతాయి’’ అని మెద్వ్‌దెవ్‌ తెలిపారు. అణుముప్పు తొలగిపోయిందా అన్న ప్రశ్నకు ‘‘ఎక్కడా తగ్గలేదు. ఉక్రెయిన్‌కు వాళ్లు (పాశ్చాత్య దేశాలు) ఆయుధాలు పంపిస్తున్న కొద్దీ ఈ ముప్పు తీవ్రత పెరుగుతూనే ఉంటుంది’’ అని పేర్కొన్నారు.రష్యా దాడులను ఎదుర్కొంటున్న ఉక్రెయిన్‌కు రానున్న 12 నెలల్లో 10 లక్షల రౌండ్ల ఆర్టిలరీ ఆయుధాలను పంపాలన్న ప్రతిపాదనకు యూరోపియన్‌ యూనియన్‌(ఈయూ) పచ్చజెండా ఊపింది. ఈ ప్రణాళికకు ఇప్పుడే 27 దేశాల ఈయూ కూటమికి చెందిన విదేశీ, రక్షణమంత్రులు అంగీకారం తెలిపారు. గురువారం దేశాధినేతలూ ఆమోదముద్ర వేశారు.

స్పెయిన్‌ను రంగంలోకి దింపుతోన్న చైనా..!

రష్యా పర్యటనకు వెళ్లి ఉక్రెయిన్‌ యుద్ధం ఆపాల్సిందిగా పుతిన్‌ను కోరిన చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌ తన శాంతి ప్రయత్నాలను ముమ్మరం చేశారు. స్పెయిన్‌ ప్రధాని పెడ్రో సాంచెజ్‌ను బీజింగ్‌ పర్యటనకు రావాల్సిందిగా ఆహ్వానం పంపారు. శాంతి ప్రతిపాదనకు తమతో పాటు స్పెయిన్‌ కూడా మధ్యవర్తిగా వ్యవహరించాలని చైనా కోరుకుంటోంది. ఈ నేపథ్యంలోనే సాంచెజ్‌కు ఆహ్వానం వెళ్లినట్లు సంబంధిత వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ నెల 30,31 తేదీల్లో సాంచెజ్‌.. చైనాలో పర్యటిస్తారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని