ఉక్రెయిన్‌ పోరు.. యుద్ధ ఖైదీలకు నరకమే

ఉక్రెయిన్‌-రష్యా మధ్య జరుగుతున్న పోరులో యుద్ధఖైదీలు.. దారుణమైన వేధింపులకు గురవుతున్నారని ఐక్యరాజ్యసమితి (ఐరాస) తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది.

Updated : 25 Mar 2023 06:29 IST

మానవహక్కుల ఉల్లంఘనపై ఐరాస తీవ్ర ఆందోళన

కీవ్‌: ఉక్రెయిన్‌-రష్యా మధ్య జరుగుతున్న పోరులో యుద్ధఖైదీలు.. దారుణమైన వేధింపులకు గురవుతున్నారని ఐక్యరాజ్యసమితి (ఐరాస) తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. వారిని క్రూరంగా హింసించడంతో పాటు, పోరులో రక్షణ కవచాలుగా వాడుకోవడానికి సైతం ఇరు దేశాలు వెనుకాడటం లేదని పేర్కొంది. ఈ మేరకు కీవ్‌లోని ఐరాస మానవహక్కుల మిషన్‌ జనవరి నుంచి ఆరు నెలల కాలానికి తయారు చేసిన నివేదికను విడుదల చేసింది. 400 యుద్ధఖైదీలతో తాము మాట్లాడామని, ఇందులో రష్యా విడిచిపెట్టిన ఉక్రెనియన్లు సగం మంది, ఉక్రెయిన్‌లో ఖైదీలుగా ఉన్న రష్యన్లు సగం మంది ఉన్నారని తెలిపింది. మాస్కో అధీనంలోని జైళ్లలో మగ్గుతున్న యుద్ధఖైదీలతో మాట్లాడేందుకు అనుమతి లభించలేదని పేర్కొంది. ‘‘25 మంది రష్యా ఖైదీలకు ఉక్రెయిన్‌ సాయుధ దళాలు మరణశిక్ష విధించాయి. ఇది మాకు ఆందోళన కలిగించింది’’ అని ఐరాస పర్యవేక్షణ మిషన్‌ అధిపతి మటిల్డా బాగ్నర్‌ తెలిపారు. అయితే ఈ దారుణానికి మూలకారణం మాత్రం ఉక్రెయిన్‌పై ఆక్రమణేనని పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని