నోరూరించే సబ్బులు!

‘‘మానవుడు జలక్రీడలాడుతూ చాక్లెట్లు తినును కాబోలు’’ అంటూ ‘యమగోల’ చిత్రంలో స్నానాలతొట్టి వద్ద ఉన్న సబ్బును తిని నవ్వులు పూయిస్తాడు చిత్రగుప్తుడు (అల్లు).

Published : 25 Mar 2023 04:36 IST

‘‘మానవుడు జలక్రీడలాడుతూ చాక్లెట్లు తినును కాబోలు’’ అంటూ ‘యమగోల’ చిత్రంలో స్నానాలతొట్టి వద్ద ఉన్న సబ్బును తిని నవ్వులు పూయిస్తాడు చిత్రగుప్తుడు (అల్లు). రష్యాలోని సెయింట్‌ పీటర్స్‌బర్గ్‌కు చెందిన జులియా పొపొవా తయారుచేసే సబ్బులు అచ్చం పిజ్జా, బర్గర్‌, టెడ్డీబేర్‌, పండ్లు, మద్యం సీసాలు, చేపలు, నాణేలు ఇలా విభిన్న ఆకారాల్లో దర్శనమిస్తాయి. నోరూరించే ఆహార పదార్థాల్లా కనిపించే ఈ సబ్బులను తినడానికి ప్రయత్నించి నోరెళ్లబెట్టినవారు ఎంతోమంది ఉన్నారు. యూనివర్సిటీలో చదివే రోజుల్లో సబ్బులను విభిన్న ఆకారాల్లోకి మార్చాలనే ఆలోచన ఈమెకు వచ్చింది. అనుకున్నదే తడవుగా మార్కెట్లో లభించే సబ్బులు కొని, వాటిని కరిగించి ఏ రూపంలోకి మారిస్తే బాగుంటుందని ఆలోచించింది. ఎదురుగా ఓ గుర్రంబొమ్మ కనపడటంతో సిలికాన్‌ను ఉపయోగించి ప్రయత్నించింది. ఆ బొమ్మ చాలా బాగా రావడంతో జులియాను బంధువులు, స్నేహితులు ప్రోత్సహించారు. ఉద్యోగానికి రాజీనామా చేసి, విభిన్న ఆకారాల్లో సబ్బులు తయారుచేసి స్థానిక మార్కెట్లో విక్రయించడం మొదలుపెట్టింది. ఈ క్రమంలోనే ‘ఓమ్‌నామ్‌’ అనే బ్రాండ్‌ను స్థాపించి తనదైన శైలిలో సబ్బులు రూపొందించింది. వ్యాపార విస్తరణకు రష్యన్‌, ఇంగ్లిష్‌ భాషల్లో ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలు తెరిచింది. తన పోస్టులు చూసి వచ్చే ఆర్డర్లకు డెలివరీలు చేసింది. వ్యాపారం విస్తరించడంతో ‘ఇట్సీ స్టోర్‌’ అనే ఈ కామర్స్‌ సంస్థలో ఉత్పత్తులను విక్రయానికి పెట్టింది. దీంతో దేశ విదేశాల నుంచి జులియాకు ఆర్డర్లు వస్తున్నాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు