Injury: గాయం ‘స్మార్ట్‌’గా మానిపోతుంది

రోజువారీ పనుల్లో మనకు చర్మం గీరుకుపోవడం, కాలిన గాయాలు కావడం సర్వసాధారణం. చాలావరకూ వాటిని శరీరమే నయం చేసుకుంటుంది.

Updated : 26 Mar 2023 12:09 IST

రోజువారీ పనుల్లో మనకు చర్మం గీరుకుపోవడం, కాలిన గాయాలు కావడం సర్వసాధారణం. చాలావరకూ వాటిని శరీరమే నయం చేసుకుంటుంది. మొండి గాయాలు అంత తేలికగా లొంగవు. మధుమేహం ఉన్నవారిలో ఇది మరీ సంక్లిష్టం. వీరికి గాయాలు త్వరగా మానకపోగా.. ఒక్కోసారి తీవ్ర ఇన్‌ఫెక్షన్లకు దారితీస్తుంటాయి. ఇది ఆ వ్యక్తులకే కాకుండా ఆరోగ్యపరిరక్షణ వ్యవస్థకు పెను భారమవుతోంది. మొండిగాయాల వల్ల ఒక్క అమెరికాలోనే ఏటా 250 కోట్ల డాలర్ల మేర ఆర్థిక నష్టాలు వాటిల్లుతున్నట్లు అంచనా. ఈ నేపథ్యంలో కాలిఫోర్నియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (క్యాల్టెక్‌) శాస్త్రవేత్తలు దీనికి కొత్త పరిష్కారాన్ని కనిపెట్టారు. గాయాలను త్వరగా నయం చేసే స్మార్ట్‌ బ్యాండేజీలను అభివృద్ధి చేశారు.


ఏమిటీ బ్యాండేజీ

సాధారణ బ్యాండేజీల్లో అబ్సార్బెంట్‌ పదార్థంతో కూడిన పొరలు ఉంటాయి. క్యాల్టెక్‌ పరిశోధకులు రూపొందించిన సాధనం దీనికి భిన్నం. ఇందులో స్థిరమైన, సాగే గుణమున్న పాలిమర్‌ను ఉపయోగించారు. అందులో ఎలక్ట్రానిక్‌ సాధనాలు, మందులు ఉంటాయి. ఇది సమర్థంగా పనిచేస్తుంది. ఖర్చు కూడా తక్కువే.


మూడు విధాలుగా సాయం 

 

1. స్మార్ట్‌ బ్యాండేజీలోని సెన్సర్‌.. గాయానికి సంబంధించిన యూరిక్‌ ఆమ్లం, ల్యాక్టేట్‌, పీహెచ్‌ స్థాయి, ఉష్ణోగ్రత వంటి అంశాలను పరిశీలిస్తుంది. వీటి ఆధారంగా ఇన్‌ఫ్లమేషన్‌, బ్యాక్టీరియా ఇన్‌ఫెక్షన్‌ వంటివి ఉత్పన్నమయ్యాయా అన్నది గుర్తిస్తుంది.

* గాయం నుంచి సేకరించిన సమాచారాన్ని వైర్‌లెస్‌ పద్ధతిలో సమీపంలోని కంప్యూటర్‌, ట్యాబ్‌ లేదా స్మార్ట్‌ఫోన్‌కు చేరవేస్తుంది. వీటిని వైద్య నిపుణులు పరిశీలించవచ్చు.

2. బ్యాండేజీలోనే యాంటీబయాటిక్‌ లేదా ఇతర మందులు ఉంటాయి. వాటిని నేరుగా గాయంలోకి విడుదల చేసి, ఇన్‌ఫ్లమేషన్‌, ఇన్‌ఫెక్షన్‌కు చికిత్స చేస్తుంది.

3. గాయంపైకి చిన్నపాటి విద్యుత్‌ క్షేత్రాన్ని ప్రయోగించడం ద్వారా కణజాల వృద్ధిని ప్రేరేపిస్తుంది. తద్వారా గాయం త్వరగా మానేలా చూస్తుంది.


ఫలించిన ప్రయోగాలు..

జంతువుల్లో జరిగిన ప్రయోగాల్లో ఈ స్మార్ట్‌ బ్యాండేజీలు మంచి ఫలితాలను ఇచ్చాయి. గాయం స్థితిగతుల గురించి ఎప్పటికప్పుడు కీలక వివరాలు అందాయి. జంతువుకు సంబంధించిన జీవక్రియల సమాచారాన్నీ శాస్త్రవేత్తలు పొందగలిగారు. దీర్ఘకాల గాయాలను ఈ సాధనం త్వరగా నయం చేసింది.  
త్వరలో మనుషులపై వీటిని ప్రయోగించాలనుకుంటున్నారు. మరింత పెద్దవైన దీర్ఘకాల గాయాలపైనా పరీక్షలు నిర్వహించబోతున్నారు. ప్రదేశాన్ని బట్టి గాయానికి సంబంధించిన పరామితులు, స్థితిగతుల్లో మార్పులు ఉంటాయని, ఆ మేరకు ఈ బ్యాండేజీలను మరింత సమర్థంగా తీర్చిదిద్దనున్నట్లు శాస్త్రవేత్తలు చెబుతున్నారు.


ఈనాడు ప్రత్యేక విభాగం


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు