అమెరికాను వణికించిన టోర్నడో

అమెరికా దక్షిణ ప్రాంతంలోని మిసిసిపి, అలబామా గ్రామీణ ప్రాంతాల్లో శుక్రవారం రాత్రి టోర్నడో బీభత్సం సృష్టించింది. తీవ్ర గాలులు, వడగళ్ల వానలకు 23మంది మృతి చెందగా నలుగురు గల్లంతయ్యారు.

Published : 26 Mar 2023 04:01 IST

మిసిసిపిలో 23 మంది మృతి
తీవ్ర గాలులు, వడగళ్లతో భారీ ఆస్తినష్టం

రోలింగ్‌ ఫోర్క్‌: అమెరికా దక్షిణ ప్రాంతంలోని మిసిసిపి, అలబామా గ్రామీణ ప్రాంతాల్లో శుక్రవారం రాత్రి టోర్నడో బీభత్సం సృష్టించింది. తీవ్ర గాలులు, వడగళ్ల వానలకు 23మంది మృతి చెందగా నలుగురు గల్లంతయ్యారు. పలువురికి గాయాలయ్యాయి. భారీగా ఆస్తినష్టం జరిగింది. జాక్సన్‌, సిల్వర్‌ సిటీ, షార్కీ కౌంటీ, రోలింగ్‌ ఫోర్క్‌ పట్టణాల్లో గంటకు 113 కి.మీ. వేగంతో గాలులు వీచాయి. దీంతో భవనాలు, దుకాణాలు నేలమట్టమయ్యాయి. 8 సెం.మీ. వర్షం కురిసింది. గోల్ఫ్‌ బంతుల పరిమాణంలో వడగళ్లు పడ్డాయి. విద్యుత్తుకు తీవ్ర అంతరాయం కలిగింది. అనూహ్య వరదలు, విరిగిపడిన స్తంభాల కారణంగా 23 మంది మృతి చెందినట్లు మరణాల నమోదు అధికారి ప్రకటించారు. దీన్ని ‘ప్రాణాంతక స్థితి’గా అమెరికా జాతీయ వాతావరణ సంస్థ ప్రకటించడం గమనార్హం. తన ఇల్లు కూలిపోయినట్లు రోలింగ్‌ ఫోర్క్‌ మేయర్‌ ఎల్డ్రిడ్జ్‌ వాకర్‌ తెలిపారు. బాధితుల కోసం అధికారులు ఆరుచోట్ల పునరావాస కేంద్రాలను తెరిచారు. ‘మీరు ప్రాణాంతక పరిస్థితుల్లో ఉన్నారు. కొట్టుకొస్తున్న చెత్త.. ఇళ్లులేని వారిని ప్రమాదంలో పడేయవచ్చు. సంచార గృహాలు దెబ్బతింటాయి. ఇళ్లు, వ్యాపారాలు, వాహనాలు తీవ్రంగా దెబ్బతినే ప్రమాదముంది’ అని జాతీయ వాతావరణ సంస్థ పేర్కొంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని