భారతీయ అమెరికన్‌ చిన్నారి హత్యకేసులో దోషికి 100 ఏళ్ల జైలుశిక్ష

అయిదేళ్ల భారతీయ-అమెరికన్‌ చిన్నారి మృతికి కారణమైన వ్యక్తికి అమెరికాలోని ఓ న్యాయస్థానం 100 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది.

Updated : 27 Mar 2023 05:46 IST

అమెరికాలోని జిల్లా న్యాయస్థానం తీర్పు

వాషింగ్టన్‌: అయిదేళ్ల భారతీయ-అమెరికన్‌ చిన్నారి మృతికి కారణమైన వ్యక్తికి అమెరికాలోని ఓ న్యాయస్థానం 100 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది. 2021లో లూసియానా రాష్ట్రంలోని ష్రెవెపోర్ట్‌లో జరిగిన ఘటనకు సంబంధించి నిందితుడు జోసెఫ్‌ లీ స్మిత్‌(35)కు ఈ శిక్ష విధించినట్లు స్థానిక మీడియా తెలిపింది. ఈ కేసు వివరాలివీ.. మాంక్‌హౌస్‌ డ్రైవ్‌లోని ఓ హోటల్‌ను స్నేహల్‌ పటేల్‌, విమల్‌ నడిపేవారు. వారి కుమార్తె మాయా పటేల్‌ హోటల్‌ గదిలో ఆడుకుంటుండగా, ఆమె తలలోకి ఓ తూటా దూసుకెళ్లింది. కుటుంబ సభ్యులు ఆమెను ఆస్పత్రికి తరలించగా, మూడు రోజుల పాటు మృత్యువుతో పోరాడి 2021 మార్చి 23న ప్రాణాలు విడిచింది. నిందితుడు స్మిత్‌ హోటల్‌ పార్కింగ్‌ స్థలంలో ఓ వ్యక్తితో గొడవపడి తుపాకీతో కాల్చాడని, అయితే అది గురి తప్పి తూటా హోటల్‌ గదిలోకి దూసుకెళ్లడంతో ఈ ఘోరం జరిగిందని దర్యాప్తులో తేలింది. ఈ కేసులో ఈ ఏడాది జనవరిలోనే జిల్లా న్యాయస్థానం స్మిత్‌ను దోషిగా తేల్చింది. ఇప్పుడు అతడికి శిక్షను ఖరారు చేసింది. హత్య చేసినందుకు 60 ఏళ్లు, న్యాయ విచారణకు ఆటంకం కలిగించినందుకు 20 ఏళ్లు, హాని తలపెట్టినందుకు 20 ఏళ్లు కలిపి మొత్తం 100 ఏళ్ల జైలు శిక్ష విధించింది. ప్రొబేషన్‌, పెరోల్‌, శిక్ష తగ్గింపు లాంటి సదుపాయాలేవీ లేకుండా శిక్షను అనుభవించాలని కోర్టు ఆదేశించింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు