పసిమొగ్గలపై వాయు కాలుష్యం
అడ్డూఅదుపూ లేని మానవచర్యల కారణంగా వాయు కాలుష్యం నానాటికీ పెరుగుతోంది. ప్రపంచవ్యాప్తంగా స్వచ్ఛమైన గాలి అనేది మృగ్యమైపోతోంది.
పొగచూరుతున్న ఊపిరితిత్తులు
అడ్డూఅదుపూ లేని మానవచర్యల కారణంగా వాయు కాలుష్యం నానాటికీ పెరుగుతోంది. ప్రపంచవ్యాప్తంగా స్వచ్ఛమైన గాలి అనేది మృగ్యమైపోతోంది. ఫలితంగా అనునిత్యం భారీగా కాలుష్యకారకాలు ఊపిరితిత్తుల్లోకి వచ్చి చేరుతున్నాయి. ప్రధానంగా పిల్లలకు ఇది శరాఘాతమవుతోంది. ఎదుగుతున్న దశలో ఉన్న వారి శ్వాస, నాడీ వ్యవస్థలను దెబ్బతీసి, వారి భవితను ఛిద్రం చేస్తోంది. వాయు కాలుష్యం తగ్గితే ఆ ప్రాంతంలోని చిన్నారుల ఊపిరితిత్తుల సామర్థ్యం మెరుగుపడుతుందని స్వీడన్ శాస్త్రవేత్తలు తాజాగా చేసిన నిర్ధారణ.. ప్రభుత్వాలకు కర్తవ్యబోధ చేస్తోంది.
ప్రమాద ఘంటికలు..
* చిన్నారుల్లో మెదడు, ఊపిరితిత్తులు సహా అనేక కీలక భాగాలు ఎదుగుదల దశలో ఉంటాయి. వాయు కాలుష్యం ఎక్కువైతే వారి మెదడు, నాడీ వ్యవస్థలో వృద్ధి మందగిస్తుంది. విషయ పరిజ్ఞాన సామర్థ్యం తగ్గొచ్చు.
* ఉబ్బసం ముప్పు పెరుగుతుంది. చిన్నతనంలో వచ్చే క్యాన్సర్‌కూ ఆస్కారం ఉంటుంది.
* నవజాత శిశువులకు ఇళ్లలోని వాయు కాలుష్యం ముప్పు ఎక్కువ.
* వాయు కాలుష్యానికి స్వల్పంగా గురైనా.. పిల్లల మానసిక, ఎముకలు, కండరాల ఎదుగుదలపై తీవ్ర ప్రభావం పడుతోంది.
* కలుషిత గాలికి గర్భిణులు ఎక్కువగా గురైతే.. వారికి నెలలు నిండకుండానే కాన్పు కావొచ్చు. తక్కువ బరువుతో శిశువులు జన్మించడానికీ ఆస్కారం ఉంటుంది.
* ప్రపంచవ్యాప్తంగా 15 ఏళ్లలోపు చిన్నారుల్లో 93 శాతం మంది (180 కోట్ల మంది).. ఆరోగ్యం, ఎదుగుదలను ప్రమాదంలో పడేసే స్థాయిలో కలుషితమైన గాలిని శ్వాసిస్తున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) పేర్కొంది. కలుషిత గాలితో కలిగే దిగువ శ్వాసకోశ ఇన్‌ఫెక్షన్ల వల్ల ప్రపంచవ్యాప్తంగా ఏటా 7 లక్షల మంది పిల్లలు మరణిస్తున్నట్లు అంచనా.
* బాల్యంలో అధికమోతాదులో వాయు కాలుష్యం బారినపడితే.. పెద్దయ్యాక గుండె జబ్బుల ముప్పు పెరుగుతుంది.
ముప్పు అధికం
పెద్దలతో పోలిస్తే పిల్లలు వేగంగా శ్వాసిస్తారు. అందువల్ల వారి ఊపిరితిత్తుల్లోకి అధిక మోతాదులో కాలుష్యకారకాలు ప్రవేశిస్తాయి.
* తక్కువ ఎత్తు వల్ల పిల్లలు నేలకు దగ్గరగా ఉంటారు. పెద్దలతో పోలిస్తే.. వాతావరణంలో చాలా దిగువ ప్రాంతం నుంచి వారు గాలిని పీల్చుకుంటారు. అక్కడ కొన్నిరకాల కాలుష్యకారకాల తీవ్రత ఎక్కువ.
ఇలా చేయాలి..
* డబ్ల్యూహెచ్‌వో నిర్దేశించిన వాయు నాణ్యత ప్రమాణాలను అందుకోవడానికి ప్రభుత్వాలు ప్రయత్నించాలి.
* శిలాజ ఇంధనాల వాటాను తగ్గించాలి. ఇంధన సమర్థతను పెంచడంపై పెట్టుబడులు పెట్టాలి. పునర్‌వినియోగ వనరులకు ప్రాధాన్యం ఇవ్వాలి.
* వ్యర్థాల నిర్వహణ మెరుగుపడాలి. దీనివల్ల వాటిని కాల్చడం కూడా తగ్గుతుంది.
* రద్దీగా ఉండే రోడ్లు, కర్మాగారాలు, థర్మల్ విద్యుత్ కేంద్రాలు వంటివి వాయు కాలుష్యానికి ప్రధాన వనరులు. పాఠశాలలు, క్రీడా మైదానాలను వీటికి దూరంగా ఏర్పాటు చేస్తే పిల్లలను ఈ విషతుల్య వాయువుల బారి నుంచి రక్షించొచ్చు.
గాలి మారింది.. ఊపిరితిత్తులు మెరుగుపడ్డాయి..
గత 20 ఏళ్లలో స్వీడన్ రాజధాని స్టాక్‌హోమ్‌లో వాయు కాలుష్య కారకాలు బాగా తగ్గినట్లు కరోలిన్‌స్కా ఇన్‌స్టిట్యూట్ శాస్త్రవేత్తలు గుర్తించారు. దీనివల్ల అక్కడ వాయు నాణ్యత మెరుగుపడినట్లు తేల్చారు. ఈ కాలంలో పిల్లల ఊపిరితిత్తుల ఆరోగ్యం ఎలా ఉందన్నది వారు పరిశీలించారు.
* పరిశోధనలో భాగంగా బామ్సీ ప్రాజెక్టు కింద సేకరించిన డేటాను విశ్లేషించారు. ఆ ప్రాజెక్టు కింద.. 1994 నుంచి 1996 మధ్య జన్మించిన 4వేల మందిని పరిశీలించారు. 8, 16, 24 ఏళ్ల వయసులో స్పైరోమెట్రిక్ పరీక్షను నిర్వహించి, వీరి ఊపిరితిత్తుల పనితీరును పరిశీలించారు.
* పరీక్షార్థులు జన్మించినప్పటి నుంచి పెద్దయ్యేవరకూ నివసించిన ప్రాంతాల్లో గాల్లోని కాలుష్యకారకాలను విశ్లేషించారు. ముఖ్యంగా వాహనాల నుంచి వెలువడే హానికర రేణువుల స్థాయిని కొలిచారు.
* 2002-04తో పోలిస్తే 2016-19లో స్టాక్‌హోమ్‌లో వాయు కాలుష్యం 40 శాతం తగ్గిందని గుర్తించారు. కొన్నిచోట్ల ఈ క్షీణత 60 శాతం ఉంది. మిగతాచోట్ల వాయు నాణ్యతలో పెద్దగా వైరుధ్యంలేదు.
* వాయు నాణ్యత బాగున్న ప్రాంతాల్లోని యువతలో ఊపిరితిత్తుల పనితీరు మెరుగుపడినట్లు గుర్తించారు. కాలుష్యం తాకిడిని స్వల్పస్థాయిలో తగ్గించుకోగలిగినా.. చిన్నతనం నుంచి యువ్వనంలోకి అడుగుపెట్టేవరకూ ఊపిరితిత్తుల పనితీరు, ఎదుగుదలలో మెరుగుదల కనిపిస్తుందని తేలింది.
* ఇది చాలా ముఖ్యమైన పరిశీలన. చిన్నప్పటి ఊపిరితిత్తుల ఆరోగ్యాన్ని బట్టే భవిష్యత్‌లో దీర్ఘకాల శ్వాసకోశ వ్యాధుల ముప్పు ఆధారపడి ఉంటుంది. ఇలాంటివారికి శ్వాసకోశ ఇబ్బందులు తలెత్తే ముప్పు 20 శాతం తక్కువని వెల్లడైంది.
కలుషిత గాలి.. కోట్ల మంది చిన్నారులను విషతుల్యం చేస్తోంది. వారి జీవితాలను నాశనం చేస్తోంది. ఇది క్షమించరాని నేరం. ప్రతి చిన్నారి స్వచ్ఛమైన గాలిని పీల్చాలి. తద్వారా వారు ఆరోగ్యంగా ఎదిగి, తమ పూర్తి సామర్థ్యం మేరకు పనిచేస్తారు.
డబ్ల్యూహెచ్‌వో డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనోమ్ ఘెబ్రియేసస్
ఈనాడు ప్రత్యేక విభాగం
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Ts-top-news News
Guntur: మృతుని పేరు మీద 12 ఏళ్లుగా పింఛను
-
Movies News
Prabhas: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ప్రభాస్, ‘ఆదిపురుష్’ టీమ్
-
General News
Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
Ts-top-news News
TSPSC: తప్పులు సరిదిద్దుకునేందుకు చివరి అవకాశం
-
India News
Odisha Train Accident: చనిపోయాడనుకొని ట్రక్కులో ఎక్కించారు.. రైలు ప్రమాద ఘటనలో దారుణం
-
Crime News
Road Accident: కర్ణాటకలో రోడ్డు ప్రమాదం.. ఏపీకి చెందిన ఐదుగురి దుర్మరణం