అగ్రదేశాల మధ్య అణు తూటాల రగడ

ఉక్రెయిన్‌కు డిప్లీటెడ్‌ యురేనియంతో చేసిన తూటాలను సరఫరా చేస్తామన్న బ్రిటన్‌ ప్రకటన ప్రకంపనలు సృష్టిస్తోంది. దీనిపై రష్యా అధ్యక్షుడు పుతిన్‌ నిప్పులు చెరిగారు.

Published : 28 Mar 2023 05:25 IST

వాషింగ్టన్‌: ఉక్రెయిన్‌కు డిప్లీటెడ్‌ యురేనియంతో చేసిన తూటాలను సరఫరా చేస్తామన్న బ్రిటన్‌ ప్రకటన ప్రకంపనలు సృష్టిస్తోంది. దీనిపై రష్యా అధ్యక్షుడు పుతిన్‌ నిప్పులు చెరిగారు. ఉక్రెయిన్‌కు అణు పరికరాలను అందిస్తున్నారని ఆరోపించారు. బ్రిటన్‌ గనుక వీటిని ఉక్రెయిన్‌కు అందిస్తే తమదైన శైలిలో స్పందిస్తానని హెచ్చరించారు. యురేనియం అని పేరున్నంత మాత్రాన అవి అణ్వస్త్రాలు కావని బ్రిటన్‌ స్పష్టం చేస్తోంది. అవి పూర్తిగా సంప్రదాయ ఆయుధాలేనని వాదిస్తోంది.

ఏమిటీ డిప్లీటెడ్‌ యురేనియం..?

అణు ఇంధనం, ఆయుధాల తయారీకి ఉపయోగించే శుద్ధ యురేనియం తయారీలో ఉప ఉత్పత్తిగా డిప్లీటెడ్‌ యురేనియం (డీయూ) వస్తుంది. ఇది శుద్ధ యురేనియం కన్నా చాలా తక్కువ శక్తిని కలిగి ఉంటుంది. అణుబాంబులో జరిగే ‘విచ్ఛిత్తి ప్రక్రియ’ను ఇది కలిగించలేదు. ఈ పదార్థం చాలా మందంగా, సీసం కన్నా దృఢంగా ఉంటుంది. ఈ లక్షణాల దృష్ట్యా దీన్ని శతఘ్ని, ట్యాంకు గుళ్ల తయారీలో వాడుతున్నారు. అవి ఆధునిక యుద్ధ ట్యాంకులకు అమర్చే దుర్భేద్య కవచాలనూ ఛిద్రం చేసుకొని లోపలికి దూసుకెళ్లగలవు. ఈ క్రమంలో అమితంగా వేడెక్కుతాయి. ఈ ఉష్ణం ఎంత తీవ్రంగా ఉంటుందంటే.. ఆ ట్యాంకులు వెంటనే మంటల్లో చిక్కుకుపోతాయి. అసాధారణ వేగంతో ప్రయోగించినప్పుడు డీయూ తూటాలు అద్భుత ఫలితాలను ఇస్తాయి.

1970ల నుంచి అమెరికా డీయూతో కవచ ఛేదక తూటాలను తయారు చేయడం మొదలుపెట్టింది. ట్యాంక్‌ కవచాల తయారీలోనూ వాడుతోంది. ట్యాంక్‌ కిల్లర్‌గా పిలిచే ఏ-10 విమానాలూ ఈ తూటాలనే ప్రయోగిస్తున్నాయి.  

బాంబు కాదు కానీ..

డీయూతో తయారుచేసే ఆయుధాలను అణ్వస్త్రాలుగా పరిగణించరు. వీటి నుంచి వెలువడే రేడియోధార్మికత చాలా తక్కువ. డీయూ ప్రధానంగా ఆల్ఫా రేణువులను వెలువరిస్తుంది. చర్మం గుండా చొచ్చుకెళ్లే అంత శక్తి వాటికి ఉండదు. అందువల్ల డీయూ.. చర్మానికి తగిలినా పెద్ద ప్రమాదంగా పరిగణించాల్సిన అవసరం లేదని నిపుణులు చెబుతున్నారు. కాలిన గాయాలు, తీవ్ర రేడియోధార్మిక ప్రభావం వంటివి చాలా అరుదని పేర్కొన్నారు. అయితే ఈ పదార్థంలో రసాయన విషతుల్యత ఎక్కువ. అందువల్ల దాని విషయంలో జాగ్రత్తలు అవసరమని అంతర్జాతీయ అణు ఇంధన సంస్థ (ఐఏఈఏ) హెచ్చరిస్తోంది. రేడియోధార్మిక ముప్పుగా కన్నా విషతుల్య రసాయనంగా దీన్ని ఎక్కువగా ఈ సంస్థ పరిగణిస్తోంది. ఆ పదార్థాన్ని నోరు లేదా శ్వాస ద్వారా తీసుకోవడం హానికరమని తెలిపింది.

శరీరంలోకి ప్రవేశించే డీయూ రేణువులు చాలావరకూ విసర్జితాల ద్వారా బయటకు వెళ్లిపోతాయి. కొన్ని మాత్రం రక్తంలో కలిసే అవకాశం ఉంది. ఫలితంగా మూత్రపిండాలు దెబ్బతినవచ్చు.

డీయూ తూటాలను గ్లౌజుల ధరించి మాత్రమే తాకాలని నిపుణులు చెబుతున్నారు.

ఒక ప్రాంతంలో వాడిన డీయూ తూటాల సంఖ్యను బట్టి అక్కడ ముప్పు తీవ్రత ఉంటుందన్నారు. ఒకవేళ భారీగా వినియోగిస్తే సంబంధిత ప్రాంతంలో నేల, నీరు కలుషితమయ్యే ప్రమాదం ఉంది. అలాంటి పరిస్థితుల్లో వీటి నుంచి వచ్చే స్వల్పస్థాయి రేడియోధార్మికత కూడా ఆరోగ్య సమస్యలను కలిగించొచ్చని పలువురు నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఏయే దేశాల వద్ద?

డీయూ ఆయుధాలను అమెరికా, ఫ్రాన్స్‌, బ్రిటన్‌, రష్యా, చైనా, పాకిస్థాన్‌లు తయారు చేశాయి. మరో 14 దేశాల వద్ద కూడా అటువంటి ఆయుధ నిల్వలు ఉన్నాయి.

విపరీతంగా వాడిన అమెరికా

డీయూ షెల్స్‌ను 1991, 2003లో జరిగిన గల్ఫ్‌ యుద్ధాల్లో, కొసావోలో ఉపయోగించారు. వీటివల్ల ఆయా ప్రాంతాల్లో తీవ్ర సమస్యలు తలెత్తుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. 2003లో ఇరాక్‌పై అమెరికా సాగించిన యుద్ధంలో దాదాపు 10 వేల రౌండ్ల డీయూ తూటాలు వాడినట్లు కథనాలు వచ్చాయి. జనావాసాల వద్ద కూడా వీటిని ప్రయోగించినట్లు తెలిపాయి. ఇరాక్‌లోని 300 ప్రదేశాల్లో డీయూ తూటాల అవశేషాలను గుర్తించారు. వీటిని శుభ్రం చేయడానికి అప్పట్లోనే కనీసం 30 మిలియన్‌ డాలర్లు అవుతుందని అంచనావేశారు. డీయూ ఆయుధాల్లో చాలావరకూ అమెరికా ప్రయోగించగా.. మిగిలినవి సంకీర్ణ సేనలు వాడినట్లు భావిస్తున్నారు. ఇరాక్‌ యుద్ధంలో అమెరికా 300 టన్నుల డీయూ వాడినట్లు రష్యా అధికారులు ఆరోపించారు. దీనివల్ల ఇరాక్‌లోని ఫలూజా నగరంలో హిరోషిమా, నాగసాకీని మించిన స్థాయిలో రేడియేషన్‌ ఉందని పేర్కొన్నారు. ఈ నగరం రెండో చెర్నోబిల్‌గా మారిందన్నారు. 2018లో అల్‌ అరేబియా పత్రిక కథనం ప్రకారం ఇరాక్‌లో వైకల్యంతో పుట్టేవారి సంఖ్య భారీగా పెరిగిపోయింది. మరోవైపు తాము ప్రస్తుతం ఎదుర్కొంటున్న అనేక ఆరోగ్య సమస్యలకు డీయూ ఆయుధాలే కారణమా అని అమెరికాలో పలువురు మాజీ సైనికులు సందేహాలు లేవనెత్తుతున్నారు. ఇరాక్‌, కొసావోలో క్యాన్సర్‌ కేసులు బాగా పెరుగుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు