పాక్‌ రాజకీయాల్లో ఇమ్రాన్‌ అయినా ఉండాలి.. మేమైనా ఉండాలి

పాకిస్థాన్‌ మాజీ ప్రధాని, పాకిస్థాన్‌ తెహ్రీక్‌-ఏ-ఇన్సాఫ్‌(పీటీఐ) పార్టీ అధ్యక్షుడు ఇమ్రాన్‌ ఖాన్‌పై ఆ దేశ అంతర్గత వ్యవహారాల మంత్రి రాణా సనావుల్లా సంచలన వ్యాఖ్యలు చేశారు.

Published : 28 Mar 2023 05:25 IST

మంత్రి సనావుల్లా సంచలన వ్యాఖ్యలు

ఇస్లామాబాద్‌: పాకిస్థాన్‌ మాజీ ప్రధాని, పాకిస్థాన్‌ తెహ్రీక్‌-ఏ-ఇన్సాఫ్‌(పీటీఐ) పార్టీ అధ్యక్షుడు ఇమ్రాన్‌ ఖాన్‌పై ఆ దేశ అంతర్గత వ్యవహారాల మంత్రి రాణా సనావుల్లా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇమ్రాన్‌ రాజకీయాలను శత్రుత్వంగా మార్చారని, ఆయనైనా లేదా తామైనా రాజకీయాలకు దూరం కావాల్సిన పరిస్థితికి తీసుకొచ్చారని వ్యాఖ్యానించారు. అధికార పాకిస్థాన్‌ ముస్లిం లీగ్‌-నవాజ్‌(పీఎంఎల్‌-ఎన్‌) తన ఉనికిని కాపాడుకోవడానికి ఎంతవరకైనా వెళ్తుందని హెచ్చరించారు. శనివారం ఓ ప్రైవేటు టీవీ ఛానల్‌ ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘పీఎంఎల్‌-ఎన్‌’కు ఇమ్రాన్‌ శత్రువుగా మారారు. మేం ఆయన్ను అలాగే పరిగణిస్తాం. మా పార్టీ ఉనికి ప్రమాదంలో ఉంది. దాన్ని కాపాడుకోవడానికి పీటీఐకు వ్యతిరేకంగా ఎంతకైనా తెగిస్తాం. ఇమ్రాన్‌ అయినా రాజకీయాల్లో కనుమరుగు కావాలి. లేదా మేమైనా రాజకీయాలకు దూరం కావాలి. పీటీఐ, పీఎంఎల్‌-ఎన్‌.. ఈ రెండింటిలో ఏదో ఒకటి మాత్రమే ఉండే స్థితికి ఇమ్రాన్‌ దేశ రాజకీయాలను దిగజార్చారు’’ అని సనావుల్లా పేర్కొన్నారు. ఇమ్రాన్‌ రెండు పార్టీల కార్యకర్తల మధ్య శత్రుత్వాన్ని పెంచేలా వ్యవహరిస్తున్నారని ఆయన మండిపడ్డారు. దీనివల్ల పీటీఐ కార్యకర్తలు  మమ్మల్ని చంపడమో, లేదా మా కార్యకర్తలు ఆయన్ను చంపడమో జరిగే పరిస్థితి తలెత్తే ప్రమాదం ఉందన్నారు. కాగా, ఈ వ్యాఖ్యలపై పీటీఐ పార్టీ స్పందించింది. ‘‘ప్రభుత్వం నుంచి ఇమ్రాన్‌కు ప్రాణాపాయం ఉంది. పీఎంఎల్‌-ఎన్‌ నేతలు నేరుగా హత్య బెదిరింపులకు దిగారు’’అని ఆ పార్టీ నేతలు మండిపడ్డారు. సనావుల్లా వ్యాఖ్యలపై జోక్యం చేసుకోవాలని ఇమ్రాన్‌ ఇస్లామాబాద్‌ హైకోర్టును ఆశ్రయించారు.


7 కేసుల్లో ఇమ్రాన్‌కు మధ్యంతర బెయిలు

మ్రాన్‌ ఖాన్‌పై నమోదైన 143 కేసుల్లో ఏడింటిలో సోమవారం మధ్యంతర బెయిలు లభించింది. ఈ నెల 18న అవినీతి కేసులో విచారణ కోసం ఇమ్రాన్‌ ఇస్లామాబాద్‌ జిల్లా కోర్టుకు వచ్చినప్పుడు పీటీఐ కార్యకర్తలు పెద్దఎత్తున గుమికూడి భద్రతాదళాలపై దాడికి దిగిన సంగతి తెలిసిందే. ఈ ఘటనకు సంబంధించి ఇమ్రాన్‌తోపాటు ఆయన కార్యకర్తలపై వందల సంఖ్యలో కేసులు నమోదయ్యాయి. వీటిపై ఇమ్రాన్‌ ఇస్లామాబాద్‌ హైకోర్టును ఆశ్రయించారు. ఏడు కేసుల్లో ఉపశమనం లభించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని