ఉనికికే ముప్పొస్తే ఎవరినైనా లేపేస్తాం: అమెరికాకు రష్యా తాజా హెచ్చరిక

యుద్ధం వస్తే క్షణాల్లో క్షిపణులతో దాడి చేసి.. స్పందించేందుకైనా తమ దేశానికి సమయం ఇవ్వబోమన్న అపోహల్లో అమెరికా రాజకీయనాయకులు ఉన్నారని.. వాటిని వీడాలని రష్యా పేర్కొంది.

Updated : 28 Mar 2023 06:01 IST

కీవ్‌/మాస్కో: యుద్ధం వస్తే క్షణాల్లో క్షిపణులతో దాడి చేసి.. స్పందించేందుకైనా తమ దేశానికి సమయం ఇవ్వబోమన్న అపోహల్లో అమెరికా రాజకీయనాయకులు ఉన్నారని.. వాటిని వీడాలని రష్యా పేర్కొంది. తమ దేశ ఉనికికే ప్రమాదం వస్తే.. అమెరికా సహా ఎలాంటి శక్తినైనా ధ్వంసం చేసే అత్యాధునిక ఆయుధాలు తమ దగ్గర ఉన్నాయని పేర్కొంది. ‘‘రష్యా ఓపిగ్గా ఉంది. సైనికశక్తితో ఇతరులను కవ్వించాలని అనుకోవడం లేదు. అయితే ఉనికికే ముప్పు ఎదురైతే అమెరికా సహా ఎలాంటి వ్యతిరేక శక్తులనైనా ధ్వంసం చేయగల సత్తా మాకు ఉంది’’ అని ఆ దేశ భద్రతా మండలి కార్యదర్శి నికొలోయ్‌ పత్రుషేవ్‌ హెచ్చరించారు. మరోవైపు ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీని సోమవారం అంతర్జాతీయ అణు ఇంధన సంస్థ (ఐఏఈఏ) అధిపతి రఫెల్‌ గ్రాసీ కలిశారు. ఈ సందర్భంగా జపొరీజియా అణువిద్యుత్కేంద్రంలో నెలకొన్న ప్రమాదకర పరిస్థితిపై అధ్యక్షుడికి గ్రాసీ వివరించారు. ప్లాంటులో పరిస్థితి మెరుగుపడటం లేదని, ఆ ప్రాంతమంతా సైన్యం ఉండటంతో చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయని పేర్కొన్నారు. ఇటీవల విద్యుత్కేంద్రానికి పలుమార్లు కలిగిన విద్యుత్తు అంతరాయాలను, డీజిల్‌ జనరేటర్లపై ఆధారపడాల్సి రావడాన్ని ప్రస్తావించారు. ఈ వారంలో ప్లాంటును రఫెల్‌ గ్రాసీ దర్శించనున్నారు.

* తూర్పు ఉక్రెయిన్‌లో స్లొవియాన్స్క్‌లో రష్యా దాడుల్లో ఇద్దరు పౌరులు మృతి చెందారని, 29 మంది గాయపడ్డారని ఆ నగర గవర్నర్‌ తెలిపారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని