గాలిపటంతో ‘ఇంటికి’ కరెంట్‌!

సరదాగా ఎగరేసుకునే పతంగితో ఇంటికి కావల్సిన కరెంటును సృష్టించొచ్చు! ఎంచక్కా కరెంటు బిల్లుల ఖర్చు తగ్గించుకోవచ్చు!  ఇదేమీ పరాచికానికి చెబుతున్నది కాదు.

Updated : 29 Mar 2023 10:58 IST

సరదాగా ఎగరేసుకునే పతంగితో ఇంటికి కావల్సిన కరెంటును సృష్టించొచ్చు! ఎంచక్కా కరెంటు బిల్లుల ఖర్చు తగ్గించుకోవచ్చు!  ఇదేమీ పరాచికానికి చెబుతున్నది కాదు. పచ్చినిజం! పునరుత్పాదక ఇంధన ఉత్పత్తిలో ఇదో మార్గమంటున్నారు శాస్త్రవేత్తలు!

గాలి ద్వారా కరెంటు ఉత్పత్తి (పవన విద్యుత్‌) ఇప్పటికే ఉన్నదే. భూమిపై 80 మీటర్ల ఎత్తులో ఏర్పాటు చేసే గాలిమర (విండ్‌ టర్బైన్స్‌)ల ద్వారా పవన విద్యుత్‌ను తయారు చేస్తున్నారు. అయితే భూమి మీదికంటే 200 మీటర్లపైన (656 అడుగులపైన) ఎత్తులో గాలులు మరింత స్థిరంగా, బలంగా వీస్తాయని... వాటి ద్వారా మరింత ఎక్కువ విద్యుత్‌ సృష్టించవచ్చన్నది శాస్త్రవేత్తల అంచనా. భూమ్మీద పవన విద్యుత్‌ కంటే పైన ఎత్తులో వీచే రెట్టింపుగాలితో ఎనిమిదింతలు ఎక్కువ విద్యుత్‌ను తయారు చేయవచ్చంటున్నారు.

ఈ ప్రక్రియపై పరిశోధనలు ఇప్పటికే ఆరంభమయ్యాయి. భారీ ఖర్చుతో కూడుకొని ఉండటంతో కొన్ని కంపెనీలు వెనక్కి తగ్గగా... మరికొన్ని మందకొడిగా సాగుతున్నాయి. తాజాగా రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం కారణంగా ఐరోపా దేశాల అవసరాల దృష్ట్యా... పునరుత్పాదక ఇంధనంపై దృష్టి అధికమైంది. ఈ నేపథ్యంలో మళ్లీ ఆకాశంలో అత్యంత ఎత్తులో గాలిని ఒడిసిపట్టి, విద్యుత్‌ను సృష్టించటంపై దృష్టిసారిస్తున్నారు. మామూలుగా సంక్రాంతికి ఎగరేసే పతంగుల్లాంటివి కాకుండా... భారీ గాలిపటాలను ఈ ప్రక్రియలో వినియోగిస్తారు. నెదర్లాండ్స్‌లోని డెల్ట్ఫ్‌ సాంకేతిక విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు 10 చదరపు మీటర్ల గాలిపటాన్ని ఓ జనరేటర్‌కు అనుసంధానం చేసి... గాలిద్వారా 10 కిలోవాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేయగలిగారు. ఇది పదికుటుంబాలకు సరిపడేంత విద్యుత్‌. దీన్ని మునుముందు 50 కిలోవాట్లకు, ఆ పైన 100 మెగావాట్లకు పెంచి, లక్ష ఇళ్లకు విద్యుత్‌ అందివ్వాలన్నది వారి యోచన. ఈ ప్రయోగానికి లాడర్‌మిల్‌ అని పేరుపెట్టారు. గతంలో ఈ ప్రాజెక్టుకు సారథ్యం వహించిన నెదార్లండ్స్‌ మాజీ వ్యోమగామి వుబూ ఓకల్స్‌ ‘‘ప్రకృతి మనకందిస్తున్న అన్నిరకాల ఇంధనాలను వినియోగించుకోవాలి. ఈ దిశలో గాలిపటాలు అత్యంత చవకైనవి. ఆకర్షణీయమైనవి’’ అని అనేవారు.గూగుల్‌ కూడా మొదట్లో 10 మిలియన్‌ డాలర్ల పెట్టుబడితో మకాని అనే సంస్థను నెలకొల్పి ఈ పునరుత్పాదక ఇంధన ప్రయోగాల్లో భాగమైంది. చిన్న విమానం సైజులో ఎగిరే ఇంధనప్లాంట్‌ను తయారు చేసి 300 మీటర్ల ఎత్తులో విద్యుత్‌ను ఉత్పత్తి చేసింది. ఇది  300 ఇళ్లకు సరిపోతుంది. పరిశోధనల సమయంలోనే ఈ ఇంధనప్లాంట్‌ సముద్రంలో కూలిపోయింది. తర్వాత గూగుల్‌ మాతృసంస్థ ఆల్ఫాబెట్‌ ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకుంది. కానీ చాలా కంపెనీలకు మకాని ప్రయోగం ఉత్ప్రేరకమైంది. ప్రస్తుతం జర్మనీ, యునైటెడ్‌ కింగ్‌డమ్‌కు చెందిన కంపెనీలు, స్టార్టప్‌లు అత్యంత ఎత్తులో గాలిని ఒడిసి పట్టుకొని... గాలిపటాల ద్వారా విద్యుత్‌ ఉత్పత్తి చేయటానికి ముందుకొస్తున్నాయి. జర్మన్‌ కంపెనీ స్కైసెయిల్స్‌ పవర్‌... తూర్పు ఆఫ్రికాలోనూ ఈ ఎత్తైన పవన విద్యుత్‌ కేంద్రాలను ఏర్పాటు చేయాలని చూస్తోంది. ఒక్కో గాలిపటం...500 ఇళ్లకు సరిపడా విద్యుత్‌ను అందిస్తుందన్నది అంచనా. ఇందుకోసం... సంప్రదాయ పవన విద్యుత్‌లో వాడేవాటికంటే 90శాతం తక్కువ పరికరాలు చాలన్నది ఆ కంపెనీ ధీమా.


‘‘ఈ భూమిపై ప్రతి ఒక్కరికీ అవసరమైనదానికంటే 100 రెట్లు ఎక్కువ ఇంధనం గాలిలో ఉంది. కానీ అది అత్యంత ఎత్తులో ఉంది. దాన్ని మనం వినియోగించుకోవటం లేదు’’

- కెన్‌ కాల్‌డైరా, పర్యావరణ శాస్త్రవేత్త స్టాన్‌ఫర్డ్‌ విశ్వవిద్యాలయం

- మొరిజ్‌ డీల్‌, ఆచార్యుడు, ఫ్రీబర్గ్‌ విశ్వవిద్యాలయం, ఇంగ్లాండ్‌


ఇప్పుడిప్పుడే ఊపందుకుంటున్న ఈ కొత్త ప్రయోగం పూర్తిస్థాయిలో అందుబాటులోకి రావటానికి మరికొన్నేళ్లు పట్టొచ్చు. ‘‘ప్రస్తుతం మనం చూస్తున్న పవన విద్యుత్‌ ఈ స్థాయికి చేరుకోవటానికి 40 సంవత్సరాలు పట్టింది. ఇప్పుడు అత్యంత ఎత్తులో గాలి ద్వారా గాలిపటాల రూపంలో విద్యుత్‌ను తయారు చేయటానికి కూడా కొన్నేళ్లు పడుతుంది’’ అని ఫ్రీబర్గ్‌ విశ్వవిద్యాలయంలో ఏరోస్పేస్‌ ఇంజినీరింగ్‌ పరిశోధకులు రిషికేశ్‌ జోషి వ్యాఖ్యానించారు. ఈ ప్రయోగాలన్నీ ప్రస్తుత పవన విద్యుత్తుకు అదనమే తప్ప... ప్రత్యామ్నాయం కాదని శాస్త్రవేత్తలు స్పష్టం చేస్తున్నారు.

 ఈనాడు ప్రత్యేక విభాగం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు