నౌకా విధ్వంసక క్షిపణులను పరీక్షించిన రష్యా

శత్రు నౌకలను ధ్వంసం చేయగల రెండు మోస్కిట్‌ క్షిపణులను విజయవంతంగా ప్రయోగించినట్లు రష్యా ప్రకటించింది.

Published : 29 Mar 2023 05:33 IST

మాస్కో: శత్రు నౌకలను ధ్వంసం చేయగల రెండు మోస్కిట్‌ క్షిపణులను విజయవంతంగా ప్రయోగించినట్లు రష్యా ప్రకటించింది. ఇవి వంద కిలోమీటర్లు ప్రయాణించి.. జపాన్‌ సముద్రంలో లక్ష్యంగా నిర్దేశించిన రెండు నౌకలను ధ్వంసం చేశాయి. ఈ అస్త్రాలు సూపర్‌సోనిక్‌ వేగంతో దూసుకెళ్లగలవు. సంప్రదాయ, అణు వార్‌హెడ్లను మోసుకెళ్లగలవు. జపాన్‌ సముద్రంలోని పీటర్‌ ద గ్రేట్‌ గల్ఫ్‌లో ఈ పరీక్షలు జరిగినట్లు రష్యా రక్షణ మంత్రిత్వశాఖ తెలిపింది. ఇది జపాన్‌లోని హొక్కాయిడో దీవికి 700 కిలోమీటర్ల దూరంలో ఉంది.

జపోరిజియా అణు కర్మాగారానికి పెరుగుతున్న ముప్పు..

రష్యాతో జరుగుతున్న యుద్ధం కారణంగా ఉక్రెయిన్‌లోని జపోరిజియా అణు విద్యుత్‌ కర్మాగారానికి పెను ముప్పు పొంచి ఉందని అంతర్జాతీయ అణు ఇంధన సంస్థ (ఐఏఈఏ) డైరెక్టర్‌ జనరల్‌ రఫీల్‌ మారియానో గ్రాస్సీ పేర్కొన్నారు. కర్మాగారానికి సమీపంలో ఘర్షణలు తీవ్రమయ్యాయని చెప్పారు. దీని రక్షణకు ఒక ఒప్పందాన్ని ఖరారు చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. తాజాగా ఆయన ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీతో సమావేశమయ్యారు.

ఉక్రెయిన్‌ చేరిన లెపర్డ్‌ ట్యాంకులు..

జర్మనీ నుంచి అత్యాధునిక లెపర్డ్‌-2 యుద్ధ ట్యాంకులు ఉక్రెయిన్‌కు అందడం మొదలైంది. వీటి వినియోగంపై ఉక్రెయిన్‌ సైనికులకు ఇప్పటికే శిక్షణ ఇచ్చారు. దీనిపై జర్మనీ రక్షణ మంత్రి బోరిస్‌ పిస్టోరియస్‌ మాట్లాడుతూ ఈ ట్యాంకులు యుద్ధంలో నిర్ణయాత్మక పాత్రను పోషించనున్నాయని పేర్కొన్నారు. మరోవైపు బ్రిటన్‌ నుంచి ఛాలెంజర్‌-2 ట్యాంకులు కూడా ఇప్పటికే ఉక్రెయిన్‌కు చేరాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని