40 మంది వలసదారుల సజీవదహనం

అమెరికాలో స్థిరపడాలని కలలుగన్న 40 మంది వలసదారులు మెక్సికోలో సజీవదహనమయ్యారు. నిరసన ప్రదర్శనలో భాగంగా కొందరు చేసిన పని వారి పాలిట మృత్యుశాపమైంది.

Published : 29 Mar 2023 05:46 IST

మెక్సికోలో ఘోరం
అమెరికా సరిహద్దుకు సమీపంలోనే..

మెక్సికో సిటీ: అమెరికాలో స్థిరపడాలని కలలుగన్న 40 మంది వలసదారులు మెక్సికోలో సజీవదహనమయ్యారు. నిరసన ప్రదర్శనలో భాగంగా కొందరు చేసిన పని వారి పాలిట మృత్యుశాపమైంది. ఉత్తర మెక్సికోలోని సియూడడ్‌ వారెజ్‌ నగరం అమెరికాతో సరిహద్దుకు సమీపంలో ఉంటుంది. అగ్రరాజ్యంలోకి వలసదారులుగా/శరణార్థులుగా ప్రవేశించేందుకు వచ్చేవారు.. సంబంధిత ప్రక్రియ అధికారికంగా పూర్తయ్యేవరకు సియూడడ్‌ వారెజ్‌లోని తాత్కాలిక శిబిరాల్లో ఆశ్రయం పొందుతుంటారు. అందులో భాగంగానే- మధ్య అమెరికా, దక్షిణ అమెరికా దేశాలకు చెందిన 68 మంది కొన్నాళ్లుగా ఈ నగరంలోని వలసదారుల నిర్బంధ కేంద్రంలో ఉంటున్నారు. వారందర్నీ అమెరికాకు కాకుండా.. తమ సొంత దేశాలకే తిప్పిపంపేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని సోమవారం వార్తలు గుప్పుమన్నాయి. ఫలితంగా శరణార్థుల్లో ఆందోళన మొదలైంది. వారిలో కొందరు ఆ వార్తలపై నిరసన వ్యక్తం చేస్తూ.. సోమవారం రాత్రి బాగా పొద్దుపోయాక తమ కేంద్రంలోని పరుపులకు నిప్పుపెట్టారు. అయితే అనూహ్యంగా ఆ మంటలు క్షణాల్లో శిబిరం మొత్తానికీ వ్యాపించాయి. అందులో ఉన్నవారు తప్పించుకోలేక హాహాకారాలు చేశారు. అగ్నికీలల ధాటికి 40 మంది శరణార్థులు మృత్యువాతపడ్డారు. మరో 28 మంది తీవ్రంగా గాయపడ్డారు. వారిలో పలువురి పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని