రష్యా అణు విన్యాసాలు!

ఉక్రెయిన్‌తో యుద్ధం కొనసాగుతున్న వేళ రష్యా కీలక అడుగులు వేసింది. సైబీరియా ఎడారిలో బుధవారం అణు విన్యాసాలు ప్రారంభించింది. వ్యూహాత్మక క్షిపణి దళాలు ఈ విన్యాసాల్లో పాలు పంచుకుంటున్నాయి.

Published : 30 Mar 2023 06:04 IST

సైబీరియా ఎడారిలో ఖండాంతర క్షిపణులతో పరీక్షలు
క్షిపణి ప్రయోగ వివరాలు అమెరికాతో పంచుకోబోమని ప్రకటన

మాస్కో:  ఉక్రెయిన్‌తో యుద్ధం కొనసాగుతున్న వేళ రష్యా కీలక అడుగులు వేసింది. సైబీరియా ఎడారిలో బుధవారం అణు విన్యాసాలు ప్రారంభించింది. వ్యూహాత్మక క్షిపణి దళాలు ఈ విన్యాసాల్లో పాలు పంచుకుంటున్నాయి. ఇందులో దేశ అణు సత్తాను అధ్యక్షుడు పుతిన్‌ స్వయంగా పరీక్షించనున్నారు. ఈ విన్యాసాల్లో 12 వేల కిలోమీటర్ల దూరం దూసుకెళ్లే యార్స్‌ ఖండాంతర క్షిపణులూ పాల్గొనడం గమనార్హం. వీటికి వివిధ రకాల అణ్వాయుధాలను మోసుకెళ్లే సత్తా ఉంది. ‘‘మొత్తం మీద 3 వేల మంది సైనిక సిబ్బందితో పాటు 300 వాహనాలు ఈ విన్యాసాల్లో పాలుపంచుకుంటాయి’’ అని రష్యా రక్షణశాఖ బుధవారం తెలిపింది. ట్రక్కులపై వెళుతున్న ఖండాంతర క్షిపణుల చిత్రాలను కూడా విడుదల చేసింది. మొత్తం మూడు ప్రాంతాల్లో యార్స్‌ సంచార వ్యవస్థలు తమ పాటవాన్ని చూపనున్నాయని సమాచారం. ప్రాంతాల పేర్లను మాత్రం మాస్కో వెల్లడించలేదు. ఈ సందర్భంగా క్షిపణి ప్రయోగాలు ఉంటాయా లేదా అన్న విషయంపైనా స్పష్టత ఇవ్వలేదు. అయితే క్షిపణి పరీక్షలకు సంబంధించి అమెరికాతో ఇక ఎలాంటి సమాచారం పంచుకోబోమని తేల్చిచెప్పింది. ఈ విషయాన్ని రష్యా ఉప విదేశాంగమంత్రి సెర్గీ రిబకోవ్‌ కూడా ధ్రువీకరించారు. గతంలో ఎలాంటి ప్రయోగాలు చేసినా మాస్కో, వాషింగ్టన్‌లు సమాచారం పంచుకొనేవి. అయితే గత నెల న్యూస్టార్ట్‌ అణ్వాయుధ ఒప్పందం నుంచి రష్యా వైదొలిగింది. ఈ నేపథ్యంలో అప్పటి నుంచి అగ్రరాజ్యానికి ఎలాంటి సమాచారం అందించడం లేదని మంత్రి స్పష్టం చేశారు.


పుతిన్‌కు చిన్న విజయం దక్కినా ప్రమాదకరమే: జెలెన్‌స్కీ

కీవ్‌: ప్రస్తుత యుద్ధంలో రష్యా సాధించే చిన్న విజయం కూడా అత్యంత ప్రమాదకరమని ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ అన్నారు. ఆయన ఏపీ వార్తాసంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో డాన్‌బాస్‌లోని బఖ్‌ముత్‌లో జరుగుతున్న పోరుపై ఆందోళన వ్యక్తం చేశారు. ‘‘ఒకవేళ అక్కడ రష్యా గెలుపు సాధిస్తే.. దాన్ని పాశ్చాత్య దేశాలకు, రష్యా సమాజానికి, చైనాకు, ఇరాన్‌కు పుతిన్‌ అమ్మే ప్రయత్నం చేస్తాడు. అంతర్జాతీయ సమాజాన్ని కూడగట్టి అంగీకారయోగ్యం కాని షరతులుకు ఉక్రెయిన్‌ను ఒప్పించేలా ఒత్తిడి తెస్తాడు. పుతిన్‌ ప్రమాదకారి. కాస్త రక్తం రుచి మరిగినా, మేం బలహీనంగా ఉన్నామని పసిగట్టినా.. ఇంకా మమ్మల్ని వెనక్కి నెట్టే ప్రయత్నం చేస్తాడు’’ అని జెలెన్‌స్కీ తెలిపారు. ఇటీవల రష్యాలో పర్యటించిన చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌ ప్రస్తావన కూడా ఉక్రెయిన్‌ అధ్యక్షుడు తెచ్చారు. తాను జిన్‌పింగ్‌తో మాట్లాడాలనుకుంటున్నానని తెలిపారు. తమ దేశంలో పర్యటించాల్సిందిగా చైనా నేతను జెలెన్‌స్కీ ఆహ్వానించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని