960 సార్లు పరీక్ష రాసి డ్రైవింగ్‌ లైసెన్స్‌

డ్రైవింగ్‌ లైసెన్స్‌ పొందడానికి ఓ మహిళ భగీరథ ప్రయత్నమే చేసింది. పరీక్షలో ఎన్నిసార్లు విఫలమైనా, ఫీజుల రూపంలో ఎంత డబ్బు ఖర్చవుతున్నా వెనుకడుగు వేయలేదు.

Updated : 30 Mar 2023 11:11 IST

ఓ మహిళ వజ్ర సంకల్పం

డ్రైవింగ్‌ లైసెన్స్‌ పొందడానికి ఓ మహిళ భగీరథ ప్రయత్నమే చేసింది. పరీక్షలో ఎన్నిసార్లు విఫలమైనా, ఫీజుల రూపంలో ఎంత డబ్బు ఖర్చవుతున్నా వెనుకడుగు వేయలేదు. చివరకు 960 ప్రయత్నాల తర్వాత లైసెన్స్‌ సంపాదించింది. ఆమెనే దక్షిణ కొరియాకు చెందిన చా సా-సూన్‌. డ్రైవింగ్‌ లైసెన్స్‌ కోసం ఆమె తొలిసారిగా 2005లో రాత పరీక్ష రాసి ఫెయిల్‌ అయింది. ఆ తర్వాతి రోజు నుంచి వారానికి ఐదు రోజుల చొప్పున మూడేళ్లలో 780 సార్లు పరీక్ష రాసింది. కానీ ఆమెకు నిరాశే ఎదురైంది. అయినా పట్టువదలకుండా ఈసారి వారానికి రెండుసార్ల చొప్పున ఏడాదిన్నరకు పైగా ప్రయత్నాలు చేసింది. చివరకు ప్రాక్టికల్‌ టెస్టుకు ఎంపికైంది. పది సార్లు ప్రయత్నించి ప్రాక్టికల్‌ టెస్టులోనూ పాసైంది. మొత్తంగా 960 ప్రయత్నాల తర్వాత డ్రైవింగ్‌ లైసెన్స్‌ పొందింది. అప్పటికి ఆమె వయసు 69 ఏళ్లు. ఈ క్రమంలో దాదాపు 11 వేల పౌండ్లు (రూ.11.16లక్షలు) వెచ్చించింది. తన మొక్కవోని సంకల్పంతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న చా సా-సూన్‌కు హ్యుందాయ్‌ సంస్థ ఓ కారును బహూకరించింది. ఇది 18 ఏళ్ల కిందటి సంగతైనా ఇటీవల ఓ వ్యక్తి సామాజిక మాధ్యమం రెడిట్‌లో పంచుకోవడంతో మరోసారి చర్చనీయాంశంగా మారింది. ఇది ఎంతో స్ఫూర్తిదాయకమని నెటిజన్లు చెబుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని