పాక్‌ ప్రధాన న్యాయమూర్తి అధికారాలకు కత్తెర

పాకిస్థాన్‌ సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి(సీజే) అధికారాలకు కత్తెర వేసేలా ఆ దేశ పార్లమెంటు బుధవారం కీలక బిల్లును ఆమోదించింది.

Updated : 30 Mar 2023 06:12 IST

కీలక బిల్లుకు ఆ దేశ పార్లమెంటు ఆమోదం

ఇస్లామాబాద్‌: పాకిస్థాన్‌ సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి(సీజే) అధికారాలకు కత్తెర వేసేలా ఆ దేశ పార్లమెంటు బుధవారం కీలక బిల్లును ఆమోదించింది. సుమోటో కేసులు, రాజ్యాంగ సంబంధ ధర్మాసనాలపై నిర్ణయాలకు సంబంధించి సీజేకున్న సంపూర్ణ అధికారాలను తగ్గించేందుకు ఉద్దేశించిన ‘ది సుప్రీం కోర్టు(ప్రాక్టీస్‌ అండ్‌ ప్రొసీజర్‌) బిల్లు-2023’ పార్లమెంటు ఆమోదం పొందింది. దీని ప్రకారం ఇకపై ఏదైనా అంశాన్ని సుమోటోగా స్వీకరించే విషయమై ముగ్గురు సీనియర్‌ న్యాయమూర్తుల కమిటీ నిర్ణయం తీసుకుంటుంది. ఇందులో సీజే ఒక సభ్యుడిగా ఉంటారు. ఇప్పటివరకూ ఈ అధికారం సీజే ఒక్కరికే ఉండేది. దీంతోపాటు రాజ్యాంగాన్ని వివరించాల్సిన అవసరమున్న కేసుల విచారణకు ధర్మాసనంలో అయిదుగురు లేదా అంతకన్నా ఎక్కువ మంది న్యాయమూర్తులు ఉండాలన్న నిబంధనను చేర్చారు. ఈ బిల్లును పాకిస్థాన్‌ మాజీ ప్రధాని, పాకిస్థాన్‌ తెహ్రీక్‌-ఏ-ఇన్సాఫ్‌(పీటీఐ) పార్టీ అధ్యక్షుడు ఇమ్రాన్‌ ఖాన్‌ ఖండించారు. న్యాయవ్యవస్థసై నేరస్థుల దాడిగా అభివర్ణించారు.

మహిళా న్యాయమూర్తిని బెదిరించిన కేసులో.. ఇమ్రాన్‌ ఖాన్‌కు నాన్‌ బెయిలబుల్‌ అరెస్టు వారెంటు

మహిళా న్యాయమూర్తిపై బెదిరింపు వ్యాఖ్యలు చేసిన కేసులో పాక్‌ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌కు స్థానిక కోర్టు నాన్‌ బెయిలబుల్‌ అరెస్టు వారెంటు జారీ చేసింది. ఇమ్రాన్‌ గత ఆగస్టులో ఓ బహిరంగ సభలో మాట్లాడుతూ మహిళా న్యాయమూర్తి జెబా చౌధరిపై బెదిరింపు వ్యాఖ్యలు చేసినట్లు కేసు నమోదైంది. దీనికి సంబంధించి గతంలోనే కోర్టు ఇమ్రాన్‌కు నాన్‌ బెయిలబుల్‌ అరెస్టు వారెంటు జారీ చేసింది. ఈ నెల 24న జరిగిన విచారణలో కోర్టు దాన్ని బెయిలబుల్‌ వారెంటుగా మార్చింది. అయితే బుధవారం నాటి విచారణకు ఇమ్రాన్‌ వ్యక్తిగతంగా హాజరు కావాల్సి ఉండగా ఆయన రాలేదు. దీంతో కోర్టు ఆయనకు నాన్‌ బెయిలబుల్‌ అరెస్టు వారెంటు జారీ చేసింది. ఏప్రిల్‌ 18న ఇమ్రాన్‌ను కోర్టులో ప్రవేశపెట్టాలని అధికారులను ఆదేశించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని