రష్యా అదుపులో ‘వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌’ పాత్రికేయుడు

ఉక్రెయిన్‌ యుద్ధంతో అమెరికా-రష్యా మధ్య తలెత్తిన ఉద్రిక్తతలు పతాక స్థాయికి చేరుకుంటున్నాయి. గూఢచర్య ఆరోపణలతో అమెరికా పాత్రికేయుడిని రష్యా అరెస్టు చేసింది.

Published : 31 Mar 2023 05:16 IST

గూఢచర్య ఆరోపణలపై అరెస్టు
నేరం రుజువైతే 20 ఏళ్ల వరకు జైలుశిక్ష!

మాస్కో: ఉక్రెయిన్‌ యుద్ధంతో అమెరికా-రష్యా మధ్య తలెత్తిన ఉద్రిక్తతలు పతాక స్థాయికి చేరుకుంటున్నాయి. గూఢచర్య ఆరోపణలతో అమెరికా పాత్రికేయుడిని రష్యా అరెస్టు చేసింది. ఈ విషయాన్ని గురువారం వెల్లడించింది. ప్రచ్ఛన్న యుద్ధం తర్వాత అగ్రరాజ్య విలేకరిని మాస్కో అదుపులోకి తీసుకోవడం ఇదే తొలిసారి. రష్యా మిలిటరీ కాంప్లెక్స్‌కు సంబంధించిన రహస్య సమాచారం సేకరిస్తుండగా వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌కు పనిచేస్తున్న ఇవాన్‌ గెర్షికోవిచ్‌ను యెక్తరీనాబర్గ్‌లో పట్టుకున్నట్లు ఫెడరల్‌ సెక్యూరిటీ అధికారులు తెలిపారు. చివరిసారిగా అమెరికా పాత్రికేయుడిని 1986లో రష్యా అదుపులోకి తీసుకుంది. 20 రోజుల తర్వాత అతనిపై ఎలాంటి అభియోగాల మోపకుండానే విడుదల చేసింది. ప్రతిగా తన అదుపులో ఉన్న రష్యా సిబ్బందినొకరిని అమెరికా నిఘా సంస్థ.. ఎఫ్‌బీఐ విడిచిపెట్టింది. గెర్షికోవిచ్‌ భద్రతపై వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌ ఆందోళన వ్యక్తం చేసింది. రష్యా ఆరోపణలు ఖండించింది. తమ విలేకరిని తక్షణం విడుదల చేయాలని డిమాండ్‌ చేసింది. గెర్షికోవిచ్‌ను అధికారులు కోర్టులో గురువారం హాజరుపరిచారు. విచారణ పూర్తయ్యేవరకు జైలులో ఉంచాలని న్యాయమూర్తి ఆదేశించారు. గూఢచర్య ఆరోపణలు రుజువైతే గెర్షికోవిచ్‌కు 20 ఏళ్ల వరకు జైలుశిక్ష పడే అవకాశం ఉంది. రష్యాలో అనర్గళంగా మాట్లాడే గెర్షికోవిచ్‌ గతంలో ఫ్రాన్స్‌-ప్రెస్‌, మాస్కో టైమ్స్‌, న్యూయార్క్‌ టైమ్స్‌లో పనిచేశారు.

*  నల్లసముద్రంలో రొమేనియా నావికాదళం నేతృత్వంలో జరుగుతున్న యుద్ధ విన్యాసాల్లో అమెరికా, నాటో కూటమిలోని ఇతర దేశాలు గురువారం పాలుపంచుకున్నాయి. సీషీల్డ్‌- 2023 పేరుతో జరుగుతున్న ఈ విన్యాసాల్లో 3,400 మంది సైనిక సిబ్బంది, 30కుపైగా నౌకలు, 14 యుద్ధ విమానాలు, వేగంగా జోక్యం చేసుకొనే 15 బోట్లు పాల్గొంటున్నాయి. ఈ నెల 20న విన్యాసాలు ప్రారంభమయ్యాయి. వచ్చే నెల రెండు వరకు కొనసాగుతాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని