ఆ అణు అడుగుల వెనుక.. నాటో దేశాలపై రష్యా ‘వ్యూహాత్మక’ ఒత్తిడి
ఇన్నాళ్లూ సంప్రదాయ ఆయుధాలు, యుద్ధట్యాంకులకే పరిమితమైన రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో తొలిసారి అణు అడుగులు పడుతున్నాయి.
ఇన్నాళ్లూ సంప్రదాయ ఆయుధాలు, యుద్ధట్యాంకులకే పరిమితమైన రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో తొలిసారి అణు అడుగులు పడుతున్నాయి. రష్యా తన వ్యూహాత్మక అణ్వస్త్రాలు కొన్నింటిని బెలారస్‌కు తరలించనున్నట్లు ప్రకటించింది. నాటో కూటమిలో ఇది కలకలం రేపుతోంది. ఇంతకూ ఏంటీ వ్యూహాత్మక అణ్వస్త్రాలు? ఎందుకోసం వీటిని రష్యా బెలారస్‌కు పంపిస్తోంది? నాటో ఎందుకని ఉలిక్కిపడుతోంది?
బ్రిటన్ నిర్ణయంతో...
మా దేశ భూభాగాన్ని కాపాడుకోవటం కోసం ‘అన్ని మార్గాలనూ’ అనుసరిస్తాం... అంటూ హెచ్చరించిన కొద్దిరోజులకే రష్యా అధ్యక్షుడు పుతిన్ నోట వ్యూహాత్మక అణ్వస్త్రాల ప్రకటన వెలువడింది. తమ వ్యూహాత్మక అణ్వస్త్రాలను బెలారస్‌లో మోహరించనున్నట్లు ఆయన వెల్లడించారు. ఇందుకు కారణం ఇబ్బడిముబ్బడిగా నాటో దేశాల నుంచి ఉక్రెయిన్‌కు ఆయుధ సాయం అందుతుండటమే. తమపై దాడి చేయటానికి వీలుగా అత్యాధునిక యుద్ధట్యాంకులను ఉక్రెయిన్‌కు ఇవ్వటానికి జర్మనీ, అమెరికా అంగీకరించాయి. వీటికి తోడు... తాజాగా క్షీణించిన యురేనియంతో కూడిన మందుగుండు సామగ్రిని ఉక్రెయిన్‌కు సరఫరా చేసేందుకు బ్రిటన్ నిర్ణయించింది.
ఏమిటీ వ్యూహాత్మక అణ్వస్త్రాలు?
ప్రత్యర్థి శిబిరాలు, ఆయుధాలను నాశనం చేసేవే ఈ వ్యూహాత్మక అణ్వస్త్రాలు. మామూలు పూర్తిస్థాయి అణ్వస్త్రాలైతే సుదూర లక్షిత క్షిపణులకు అనుసంధానితమై భారీ విధ్వంసం సృష్టిస్తాయి. వీటిని భూమిపై లేదా సబ్‌మెరైన్‌లపై ఖండాంతర క్షిపణులకు అనుసంధానించి ఉంచుతారు. పట్టణాలకు పట్టణాలనే ధ్వంసం చేయగలుగుతాయి. వాటితో పోల్చుకుంటే ఈ వ్యూహాత్మక అస్త్రాలు అల్పప్రభావితాలు! వీటిలో ఎయిర్‌క్రాఫ్ట్‌ల్లో మోసుకెళ్లే బాంబులు, స్వల్పలక్షిత వార్‌హెడ్‌లు, క్షిపణులు తదితరాలుంటాయి. మామూలు అణ్వస్త్రాల వాడకంపై రష్యా-అమెరికా మధ్య అనేక ఒప్పందాలున్నాయి. వాటిని ఉల్లంఘించి వినియోగించటం చాలా కష్టం. కానీ ఈ వ్యూహాత్మక అస్త్రాలు ఆ ఒప్పందాల పరిధిలోకి రావు. అసలివి ఎవరి వద్ద ఎన్ని ఉన్నాయో కూడా తెలియదు. రష్యా వద్ద సుమారు 2వేల దాకా వ్యూహాత్మక అణ్వస్త్రాలున్నట్లు అమెరికా అంచనా. వీటిని అత్యంత సురక్షిత ప్రాంతంలో దాచి ఉంచుతారు. ఒకచోటి నుంచి మరోచోటికి సరఫరా చేయటానికి సమయం పడుతుంది. బెలారస్‌లో వీటికోసం ప్రత్యేక ఏర్పాట్లు జరుగుతున్నాయి. జులై 1కల్లా ఇవి పూర్తవుతాయని పుతిన్ పేర్కొనటం గమనార్హం. అంతేగాకుండా ఏప్రిల్ 3 నుంచి బెలారస్ వాయుసేన సిబ్బందికి అణ్వస్త్రాలను మోసుకుపోయే శిక్షణ కూడా రష్యా ఇవ్వబోతోంది.
రష్యాకిదే తొలిసారి..
ఇలా ఒకదేశం తమ అణ్వస్త్రాలను ఇతర దేశాలకు తరలించటం కొత్తేమీ కాదు. అమెరికా ఇప్పటిదాకా తన అణ్వస్త్రాలను బెల్జియం, జర్మనీ, ఇటలీ, నెదర్లాండ్స్, టర్కీల్లో మోహరించింది. రష్యా తొలిసారిగా తన సరిహద్దులను దాటించి బెలారస్‌కు పంపిస్తోంది. నిజానికి 1991లో సోవియట్ యూనియన్ విచ్ఛిన్నమైన తర్వాత బెలారస్, ఉక్రెయిన్, కజకిస్థాన్‌ల చేతిలో భారీస్థాయిలో అణ్వస్త్రాలున్నాయి. అవన్నీ ఒప్పందాల కారణంగా... రష్యాకు చేరుకున్నాయి.
బెలారసే ఎందుకు?
తమ వ్యూహాత్మక అణ్వస్త్రాలను బెలారస్‌లోనే మోహరించాలని పుతిన్ నిర్ణయించుకోవటం వెనక కారణముంది. ఒకనాటి సోవియట్‌లో భాగమై... తర్వాత స్వతంత్ర దేశంగా ఆవిర్భవించిన పొరుగుదేశం బెలారస్‌తో రష్యాకు సత్సంబంధాలున్నాయి. పైగా... ఉక్రెయిన్‌తో 1084 కిలోమీటర్ల మేర బెలారస్‌కు సరిహద్దుంది. అంటే... బెలారస్ నుంచి ఉక్రెయిన్‌లోని కీలక ప్రాంతాలపై దాడి చేసే అవకాశం రష్యాకుంటుంది. అంతేకాకుండా బెలారస్ గడ్డమీది నుంచి తూర్పు, సెంట్రల్ ఐరోపాలోని పలు నాటో దేశాలపైనా రష్యా గురిపెట్టగలుగుతుంది.
అణ్వస్త్రాల్లో వాడే యురేనియం కంటే తక్కువమోతాదు యురేనియంతో కూడిన మందుగుండును ఉక్రెయిన్‌కు ఇవ్వాలని బ్రిటన్ తీసుకున్న నిర్ణయం పుతిన్‌ను వ్యూహాత్మక అణ్వస్త్రాల దిశగా నడిపిస్తోందనే వాదన వినిపిస్తోంది.
బెలారస్‌లో అణ్వస్త్రాలను మోహరించటం ద్వారా... పుతిన్ నాటో దేశాలపై పరోక్షంగా ఒత్తిడి పెంచుతున్నారు. ఉక్రెయిన్‌కు మద్దతు విషయంలో దూకుడు ప్రదర్శించకుండా పాశ్చాత్యదేశాలకు ముకుతాడు వేసే ఎత్తుగడలో భాగంగా ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారని నిపుణుల భావన.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Sports News
WTC Final: అలాంటి బంతులను సంధించాలి.. లేదంటే గిల్ చేతిలో శిక్ష తప్పదు: గ్రెగ్ ఛాపెల్
-
India News
Odisha Train Accident: ఎన్డీఆర్ఎఫ్ను తొలుత అప్రమత్తం చేసింది అతడే..
-
World News
Odisha Train Accident: నా హృదయం ముక్కలైంది.. రైలు ప్రమాదంపై బైడెన్ దిగ్భ్రాంతి
-
General News
Katakam Sudarshan: గుండెపోటుతో మావోయిస్టు అగ్రనేత మృతి
-
Crime News
Kakinada: గుడిలోకి దూసుకెళ్లిన లారీ.. ముగ్గురి మృతి
-
General News
Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు