నాసా కొత్త ప్రాజెక్టు సారథిగా అమిత్‌ క్షత్రియ

భారత సంతతికి చెందిన సాఫ్ట్‌వేర్‌, రోబోటిక్స్‌ ఇంజినీర్‌ అమిత్‌ క్షత్రియ అరుదైన ఘనత సాధించారు. అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ(నాసా)లో కొత్తగా ఏర్పాటు చేసిన.

Published : 01 Apr 2023 04:09 IST

అరుణ గ్రహంపైకి మనుషుల్ని పంపే ప్రక్రియకు నేతృత్వం

వాషింగ్టన్‌: భారత సంతతికి చెందిన సాఫ్ట్‌వేర్‌, రోబోటిక్స్‌ ఇంజినీర్‌ అమిత్‌ క్షత్రియ అరుదైన ఘనత సాధించారు. అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ(నాసా)లో కొత్తగా ఏర్పాటు చేసిన ‘చంద్రుడి నుంచి అరుణుడి వరకు(మూన్‌ టు మార్స్‌)’ ప్రాజెక్టుకు తొలి సారథిగా నియమితులయ్యారు. మానవాళి ప్రయోజనాల కోసం నాసా చేపట్టిన... చంద్రుడు, అంగారక గ్రహాలపై జీవరాశి అన్వేషణ కార్యకలాపాలను నిర్వహించడం ఈ ప్రాజెక్టు ప్రధాన లక్ష్యం. ఇలాంటి ప్రతిష్ఠాత్మక విభాగానికి భారత సంతతి వ్యక్తి నేతృత్వం వహించడం ఇదే మొదటిసారి. అంతరిక్ష పరిశోధనల రంగంలో అమిత్‌ క్షత్రియ 2003లో తన ప్రస్థానం ప్రారంభించారు. ఎక్స్‌ప్లోరేషన్‌ సిస్టమ్స్‌ డెవలప్‌మెంట్‌ మిషన్‌ డైరెక్టరేట్‌(ఈఎస్‌డీఎండీ)కు తాత్కాలిక డిప్యూటీ అసోసియేట్‌ అడ్మినిస్ట్రేటర్‌గా పనిచేశారు. సాఫ్ట్‌వేర్‌, రోబోటిక్స్‌ ఇంజినీర్‌గానే కాకుండా స్పేస్‌క్రాఫ్ట్‌ ఆపరేటర్‌గానూ నాసాలో సేవలందించారు. 2014 నుంచి 2017 వరకు స్పేస్‌ స్టేషన్‌ ఫ్లైట్‌ డైరెక్టర్‌ బాధ్యతలు నిర్వర్తించారు. తన సేవలకుగానూ నాసా అవుట్‌స్టాండింగ్‌ లీడర్‌షిప్‌ మెడల్‌, సిల్వర్‌ స్నూపీ అవార్డు పొందారు. ఇకపై ‘చంద్రుడి నుంచి అరుణుడి వరకు’ ప్రాజెక్టు ప్రణాళికల రూపకల్పన, అమలులో ముఖ్య భూమిక పోషించనున్నారు. స్థూలంగా అంగారకుడిపై మనుషుల్ని పంపే బాధ్యత ఆయనదే.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని