చైనా కట్టడికి భారత్‌కు సహకారం

సరిహద్దుల్లో చైనా చర్యలు రెచ్చగొట్టేవిగా ఉన్నాయని, వాటిని ఎదుర్కోవడానికి భారత్‌తో మరింత కలసికట్టుగా పని చేయాలనుకుంటున్నామని అమెరికా ఉన్నతాధికారి కుర్ట్‌ క్యాంప్‌బెల్‌ పేర్కొన్నారు.

Published : 01 Apr 2023 05:03 IST

డ్రాగన్‌ రెచ్చగొట్టే చర్యలతో యుద్ధానికి అవకాశం
భారత్‌కు సాంకేతికతను అందించాలి
ఆయుధ తయారీలో సహకరించుకోవాలి
అమెరికా ప్రభుత్వానికి భద్రతా సంస్థ సూచన

వాషింగ్టన్‌: సరిహద్దుల్లో చైనా చర్యలు రెచ్చగొట్టేవిగా ఉన్నాయని, వాటిని ఎదుర్కోవడానికి భారత్‌తో మరింత కలసికట్టుగా పని చేయాలనుకుంటున్నామని అమెరికా ఉన్నతాధికారి కుర్ట్‌ క్యాంప్‌బెల్‌ పేర్కొన్నారు. అమెరికా అధ్యక్షుడికి ఉప సహాయకుడు, ఇండో-పసిఫిక్‌ వ్యవహారాల సమన్వయకర్త అయిన ఆయన గురువారమిక్కడ సెంటర్‌ ఫర్‌ న్యూ అమెరికన్‌ సెక్యూరిటీ (సీఎన్‌ఏఎస్‌) సంస్థతో మాట్లాడారు. భారత్‌, అమెరికాల ద్వైపాక్షిక బంధం 21వ శతాబ్దంలో అత్యంత కీలకమైనదని పేర్కొన్నారు. అమెరికా సైనిక కూటమిలో భారత్‌ సభ్యురాలు కాకపోయినా తమ రెండు దేశాలు అత్యంత సన్నిహిత భాగస్వాములుగా పని చేస్తాయని క్యాంప్‌బెల్‌ వివరించారు. అమెరికన్లకు మరే ఇతర దేశ ప్రజలతోనూ లేనంత బంధం భారతీయులతో ఉందని చెప్పారు. అమెరికా విశ్వవిద్యాలయాల్లో మరింత మంది భారతీయ విద్యార్థులు చేరాలని ఆశిస్తున్నామని, అలాగే భారతీయ వర్సిటీల్లో మరింత మంది అమెరికన్‌ విద్యార్థులు చేరాలని కోరుకుంటున్నామని చెప్పారు. భారత్‌, చైనాల మధ్య 5,000 కిలోమీటర్ల సరిహద్దు వెంబడి సంఘర్షణలు పెరుగుతున్నాయని, అవి పూర్తి స్థాయి యుద్ధానికి దారితీసే ప్రమాదం ఉందని సీఎన్‌ఏఎస్‌ నివేదిక హెచ్చరించింది. సరిహద్దులో శాంతి సుస్థిరతలు నెలకొంటేనే చైనాతో సంబంధాలు సాధారణ స్థితికి వస్తాయని భారత విదేశాంగశాఖ తన 2022 నివేదికలో స్పష్టం చేసింది. పాకిస్థాన్‌, చైనా సరిహద్దుల్లో ఉద్రిక్త వాతావరణం సృష్టించడంద్వారా భారత్‌ తన వనరులను ఆ రెండు దేశాల సరిహద్దులకు మళ్లించాల్సిన ఆవశ్యకతను సృష్టించాలనేది బీజింగ్‌ పన్నాగమని సీఎన్‌ఏఎస్‌ నివేదిక వ్యాఖ్యానించింది. దీనివల్ల భారత్‌లో పోరాట సంకల్పం బలహీనపడి చైనా ఆధిపత్యాన్ని సవాలు చేయలేకపోతుందనేది బీజింగ్‌ భావన అని పేర్కొంది.  భారత్‌ తన సరిహద్దులను రక్షించుకోవడానికి అధునాతన సాంకేతికతలను అందించాలని అమెరికా ప్రభుత్వానికి సీఎన్‌ఏఎస్‌ సిఫార్సు చేసింది. సైన్యానికి కావాల్సిన ఆయుధాలను రెండు దేశాలు ఉమ్మడిగా రూపొందించి ఉత్పత్తి చేయాలని, భారతీయ నౌకా శక్తిని పటిష్ఠం చేయాలని సూచించింది. భారత్‌, అమెరికాలు గూఢచర్య సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకోవాలని, భారత్‌, చైనాల మధ్య యుద్ధం వస్తే ఎదుర్కోవడానికి ఇప్పటి నుంచే వ్యూహ రచన చేయాలని సీఎన్‌ఏఎస్‌ నివేదిక సూచించింది. భారత్‌, చైనాల మధ్య యుద్ధం వస్తే తటస్థంగా ఉండేలా పాకిస్థాన్‌కు సందేశమివ్వాలని సిఫార్సు చేసింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు