శిక్ష పడ్డ అవి‘నేత’లెందరో..!

ఓ పోర్న్‌ స్టార్‌కు రహస్యంగా డబ్బు చెల్లించి అనైతిక ఒప్పందం కుదుర్చుకున్నందుకు ట్రంప్‌పై అమెరికా అధ్యక్ష పదవిలో ఉండగానే క్రిమినల్‌ కేసు నమోదైంది.

Published : 02 Apr 2023 04:37 IST

ఓ పోర్న్‌ స్టార్‌కు రహస్యంగా డబ్బు చెల్లించి అనైతిక ఒప్పందం కుదుర్చుకున్నందుకు ట్రంప్‌పై అమెరికా అధ్యక్ష పదవిలో ఉండగానే క్రిమినల్‌ కేసు నమోదైంది. ఇలా అధ్యక్ష హోదాలో ఉన్నప్పుడు క్రిమినల్‌ కేసు నమోదవటం ఇదే తొలిసారైనా... ప్రపంచ చరిత్రలోకి తొంగిచూస్తే ఇలాంటి కేసులు అనేకం కనిపిస్తాయి. చాలా దేశాల్లోని అధినేతలకు శిక్షలు పడ్డాయి కూడా. ఆ వివరాలివీ..


ఆత్మహత్య చేసుకున్న మాజీ అధ్యక్షుడు

దక్షిణ కొరియా మాజీ అధ్యక్షుడు రోహ్‌మూ హ్యున్‌ 2009లో అవినీతి ఆరోపణలను ఎదుర్కొంటూ ఆత్మహత్య చేసుకున్నారు. 2003-2008 మధ్య అధికారంలో ఉన్నప్పుడు ఓ వ్యాపారవేత్త నుంచి తన బంధువులకు రూ.50 కోట్ల రూపాయలు అందాయని ఆయన అంగీకరించారు. విచారణ కొనసాగుతుండగానే ఆత్మహత్య చేసుకున్నారు. 2008-13 మధ్య దక్షిణ కొరియా అధ్యక్షుడిగా పనిచేసిన లీ మ్యుంగ్‌ బాక్‌కూ అవినీతి ఆరోపణలపై 17 ఏళ్ల జైలు శిక్ష పడింది. రెండేళ్ల శిక్ష తర్వాత ఆయనకు క్షమాభిక్ష లభించింది. 2018లో మరో మాజీ అధ్యక్షుడు పార్క్‌ హ్యెకు కూడా శిక్ష పడ్డా క్షమాభిక్షతో బయటపడ్డారు.


ఇజ్రాయెల్‌ ప్రధాని, అధ్యక్షులకు...

2006-09 మధ్య ఇజ్రాయెల్‌ ప్రధానిగా ఉన్న ఎహుద్‌ ఓల్మర్ట్‌కు జెరూసలేంలో రియల్‌ ఎస్టేట్‌ ప్రాజెక్టుల్లో ముడుపులు తీసుకున్నారనే ఆరోపణలపై 2014లో 27 నెలల జైలు శిక్ష విధించారు. 16నెలల తర్వాత విడిచిపెట్టారు. 2000-07 దాకా అధ్యక్షుడిగా ఉన్న మోషె కత్సావ్‌ తన సహచర ఉద్యోగినిని అత్యాచారం చేసినందుకు శిక్ష అనుభవించారు. ఇజ్రాయెల్‌ ప్రస్తుత అధినేత బెంజమిన్‌ నెతన్యాహుపైనా అవినీతి ఆరోపణల విచారణ కొనసాగుతోంది.


ఎన్నికల్లో ఖర్చు ఎక్కువ చేసినందుకు..

ఎన్నికల్లో నిబంధనలకు మించి ఖర్చు చేసినందుకు ఫ్రాన్స్‌ మాజీ అధ్యక్షుడు నికోలస్‌ సర్కోజీ (2007-2012)కి 2021లో ఏడాదిపాటు గృహనిర్బంధం విధించారు. ఆయనకంటే ముందు అధ్యక్షుడిగా చేసిన జాక్వెస్‌ షిరాక్‌ పారిస్‌కు మేయర్‌గా ఉన్నప్పుడు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారనే ఆరోపణలపై రెండేళ్ల శిక్ష పడింది.


బ్రెజిల్‌ ప్రస్తుత అధ్యక్షుడు లులాకూ...

ప్రస్తుతం బ్రెజిల్‌ అధ్యక్షుడిగా ఉన్న లులా డిసిల్వా అవినీతి, హవాలా ఆరోపణలపై 2018లో జైలుకెళ్లారు. ఆయనకు విధించిన 12 ఏళ్ల జైలుశిక్షను సుప్రీంకోర్టు రద్దు చేయడంతో విడుదలయ్యారు. ఇటీవలి ఎన్నికల్లో గెలిచి అధ్యక్షుడయ్యారు.


తైవాన్‌లో 20 ఏళ్ల శిక్ష

తైవాన్‌కు 2000-08 మధ్య అధ్యక్షుడిగా చేసిన చెన్‌ షు బియాన్‌కు అవినీతి ఆరోపణలపై 20 ఏళ్ల జైలు శిక్ష పడింది. ఆరేళ్ల శిక్ష అనుభవించాక అనారోగ్య కారణాలతో పెరోల్‌పై విడుదలయ్యారు.


ప్రభుత్వ సొమ్ము కాజేసినందుకు..

ప్రభుత్వ ధనాన్ని తన వ్యక్తిగత ఖాతాలోకి మళ్లించుకున్న నేరానికి మలేసియా మాజీ ప్రధాని నజీబ్‌ రజాక్‌కు 12 ఏళ్ల జైలు శిక్ష విధించారు. ఆయన ప్రస్తుతం జైల్లో గడుపుతున్నారు.


ఇటలీ మాజీ ప్రధానికి సేవాశిక్ష

ఇటలీ మాజీ ప్రధాని సిల్వియో బెర్లుస్కోనీకి పన్నుల చెల్లింపులో అవకతవకలకుగాను 2014లో నాలుగేళ్ల జైలుశిక్ష పడింది. చివరకు ఆ శిక్షను తగ్గించి... సామాజిక సేవగా మార్చారు. మతిమరుపు బాధితులైన వృద్ధులకు సేవ చేయాలని ఆదేశించారు.

ఈనాడు ప్రత్యేక విభాగం


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని