Coronation of King Charles III :వెయ్యేళ్ల సింహాసనం.. 360 ఏళ్ల కిరీటం..

రవి అస్తమించిన బ్రిటిష్‌ సామ్రాజ్యంలో తొలి రాజ పట్టాభిషేకం శనివారం జరగబోతోంది. బ్రిటన్‌ రాజుగా ఇప్పటికే అధికారికంగా నియమితులైన మూడో ఛార్లెస్‌కు వందల ఏళ్లనాటి సంప్రదాయాలను అనుసరించి కిరీటధారణ చేస్తారు.

Updated : 05 May 2023 11:24 IST

పురాతన సంప్రదాయాల మధ్య తైలాభిషేకం
రేపే బ్రిటన్‌ రాజుగా ఛార్లెస్‌ పట్టాభిషేకం

రవి అస్తమించిన బ్రిటిష్‌ సామ్రాజ్యంలో తొలి రాజ పట్టాభిషేకం శనివారం జరగబోతోంది. బ్రిటన్‌ రాజుగా ఇప్పటికే అధికారికంగా నియమితులైన మూడో ఛార్లెస్‌కు వందల ఏళ్లనాటి సంప్రదాయాలను అనుసరించి కిరీటధారణ చేస్తారు. 1953 తర్వాత బ్రిటన్‌లో ఇదే తొలి పట్టాభిషేకం! నిరాడంబరంగా జరగబోతున్న ఈ  వేడుకలో ఛార్లెస్‌తో పాటు ఆయన భార్య కెమిల్లా రాణిగా కిరీటం ధరిస్తారు.

ప్రదక్షిణ... పరిచయం

కాంటెర్‌బరీ ఆర్చ్‌బిషప్‌ తొలుత కింగ్‌ ఛార్లెస్‌ను ఆహూతులకు పరిచయం చేస్తారు. అన్నివైపులా కనిపించేలా నాలుగు దిక్కులా రాజు ప్రదక్షిణ చేస్తున్నట్లు తిరుగుతుంటే ఈ పరిచయం కొనసాగుతుంది. సభికులు ‘భగవంతుడు రాజును రక్షించుగాక’ (గాడ్‌ సేవ్‌ కింగ్‌) అంటూ ఆశీర్వదిస్తారు.

రెండు ప్రమాణాలు

చట్టాన్ని కాపాడతానని, దయతో, న్యాయంతో పాలన కొనసాగిస్తానని ఛార్లెస్‌ ప్రమాణం చేస్తారు. 973లో కింగ్‌ ఎడ్గర్‌ పట్టాభిషేకం సమయంలో చేసిన ప్రమాణంలోని భాగాల్నే నేటికీ చదువుతారు. తర్వాత చర్చి ఆఫ్‌ ఇంగ్లాండ్‌కు నమ్మకస్థుడైన ప్రొటెస్టెంట్‌ క్రిస్టియన్‌గా ఉంటానని ఛార్లెస్‌ రెండో ప్రమాణం చేస్తారు.


జెరూసలెం పవిత్ర నూనెతో

ప్రమాణం పూర్తికాగానే... 1300 సంవత్సరంలో కింగ్‌ ఎడ్వర్డ్‌ చేయించిన సింహాసనంపై కూర్చుంటారు. (పాతదే అయినా దీనికి సొబగులు అద్దారు. దీనికింది అరలో స్కాట్లాండ్‌ నుంచి తెచ్చిన పవిత్ర రాయిని ఉంచుతారు). వెంటనే ఆర్చ్‌బిషప్‌ కింగ్‌ ఛార్లెస్‌ను పవిత్ర నూనెతో అభిషేకిస్తారు. చేతులు, ఛాతీ, తలపై నూనెను పోస్తారు. ఇదంతా తెరచాటున జరుగుతుంది. జెరూసలెంలోని పర్వతశ్రేణి మౌంట్‌ ఆఫ్‌ ఆలివ్స్‌లోని ఆలివ్‌ చెట్ల నుంచి తీసిన నూనెను గులాబీ, మల్లె తదితర సుగంధాలతో కలిపి తయారు చేసి తీసుకొస్తారు.


గంటపాటే కిరీటం

నూనెతో అభిషేకం పూర్తికాగానే... ఛార్లెస్‌కు బంగారుతాపడంతో చేసిన మహారాజ గౌన్‌ తొడిగి కూర్చోబెడతారు. ఆ తర్వాత శిలువతో ఉన్న గోళాకారంలో ఉండే బంగారు రాజముద్ర, రాజదండంను ఆర్చ్‌బిషప్‌ ఆయనకు అందిస్తారు. కుడిచేతి నాలుగో వేలుకు ఉంగరం తొడిగి కిరీట ధారణ చేస్తారు. దీన్ని సెయింట్‌ ఎడ్వర్డ్‌ కిరీటం అంటారు. 1661లో తయారైన 2.23 కిలోల బరువైన ఈ బంగారు కిరీటాన్ని పట్టాభిషేకం నాడు ఒక గంటసేపు మాత్రమే ధరిస్తారు.  తర్వాతి (అంటే తదుపరి రాజు) పట్టాభిషేకం దాకా దీన్ని భద్రంగా దాచిపెడతారు. ప్రజల దర్శనార్థం ఛార్లెస్‌ మరో కిరీటాన్ని ధరిస్తారు.  కిరీట ధారణ కాగానే... వచ్చిన ఆహూతులంతా... మరోమారు ‘గాడ్‌ సేవ్‌ కింగ్‌’ అంటూ నినాదాలు చేస్తారు. దేవుడి నుంచి రాజుకు అధికారం సంక్రమించిందనటానికి సంకేతమే ఈ క్రాస్‌, పావురం ఉన్న రాజదండం. సుపరిపాలనకు సూచికిది.


కత్తి చేతపట్టి...

రాజు ఛార్లెస్‌ పట్టాభిషేక కుర్చీలోంచి లేచి... రాజ ఖడ్గాన్ని చేతిలో పట్టుకొని మెట్లుదిగి వచ్చి ప్రత్యేకంగా చేయించిన సింహాసనంపై ఆసీనులవుతారు. 


చేతిని ముద్దాడుతూ..

సింహాసనంపై రాజు కూర్చోగానే ఆర్చ్‌బిషప్‌తో పాటు రాజకుటుంబికులు, రక్తసంబంధీకులైన యువరాజులు,  రాజ కుటుంబ సిబ్బంది మోకాళ్లపై వంగి కూర్చొని రాజు కాళ్లకు చేతిని ఆనించి... ఆయన కుడి చేతిని ముద్దాడతారు. ఇది కాగానే... రాణి కెమిల్లాపై పవిత్ర నూనె చల్లి నిరాడంబరంగా కిరీట ధారణ చేస్తారు. ఆమెకు ఎలాంటి ప్రమాణం ఉండదు. మొత్తం ఈ ప్రక్రియంతా 2 గంటల పాటు సాగే అవకాశముంది.


1762లో తయారు చేసి 1831 నుంచి ప్రతి పట్టాభిషేకానికి వాడుతున్న బంగారు తాపడం బగ్గీలో రాజు, రాణి ప్రయాణిస్తారు.


14వ  శతాబ్దం  నుంచీ పట్టాభిషేకానికి ఇదే కుర్చీని వాడుతున్నారు.


రాజు ధరించే బంగారు గౌను, ఇతర దుస్తులు 1821లో జార్జ్‌-4 పట్టాభిషేకం సమయంలో తయారు చేయించినవి.


వివాదాలకు దూరంగా ఉండాలనే ఉద్దేశంతో రాణి కిరీటం లోంచి ప్రతిష్ఠాత్మక కోహినూర్‌ వజ్రాన్ని ఈసారి తొలగించారు.


500 కోట్ల పౌండ్లు?

* పట్టాభిషేకంలో కిరీటంతో పాటు ఇతర ఆభరణాలన్నీ కలిపి సుమారు 100 దాకా ఉంటాయి. వీటిలో 23వేల రత్నాలు, పగడాల్లాంటివి అమర్చారు. పట్టాభిషేకం కాగానే వీటన్నింటినీ టవర్‌ ఆఫ్‌ లండన్‌లో దాచి ఉంచుతారు. వీటి విలువ ఎంతన్నది ఎవ్వరూ కచ్చితంగా లెక్కవేయకున్నా కొంతమంది నిపుణుల ప్రకారం... పట్టాభిషేకంలో ధరించే రాజాభరణాల విలువ 300 కోట్ల నుంచి 500 కోట్ల పౌండ్ల దాకా ఉంటుందని అంచనా!

* సుమారు 2వేల మంది అతిథులు, రాజకుటుంబికులు, విదేశీ ప్రముఖుల సమక్షంలో లండన్‌ వెస్ట్‌మినిస్టర్‌ అబేలో ఈ పట్టాభిషేకం జరుగుతుంది.


35 ఏళ్లు ప్రేమించుకొని

బ్రిటన్‌ రాణిగా కిరీటధారణ చేయబోతున్న కెమిల్లా ఈ స్థాయికి చేరుకోవటం వెనుక సుదీర్ఘ ప్రణయం... ప్రయాణం ఉన్నాయి. 1947లో జన్మించిన కెమిల్లా బ్రిటిష్‌ సైనికాధికారి కుమార్తె! వయసులో కింగ్‌ ఛార్లెస్‌ కంటే 16నెలలు పెద్ద! 1970లో పోలోక్లబ్‌లో తొలిసారి కలుసుకున్న ఛార్లెస్‌, కెమిల్లా ఒకరిపై ఒకరు మనసుపడ్డారు. కానీ వెంటనే ఛార్లెస్‌ నౌకాదళంలో పనిచేసేందుకు వెళ్లాల్సి వచ్చింది. తిరిగి వచ్చేసరికి కెమిల్లాకు ఆండ్రూ పార్కర్‌ బోవెల్స్‌తో పెళ్లయింది. ఇద్దరు పిల్లలు పుట్టారు. ఈ ఆండ్రూ పార్కర్‌ గతంలో ప్రిన్స్‌ ఛార్లెస్‌ సోదరి ప్రిన్సెస్‌ ఆన్‌తో ప్రేమాయణం సాగించాడు. పెళ్లయినా ఛార్లెస్‌, కెమిల్లా స్నేహం కొనసాగింది. 1980లో డయానా సోదరితో డేటింగ్‌ చేసిన ఛార్లెస్‌... చివరకు డయానాను పెళ్లాడారు. వీరికీ ఇద్దరు పిల్లలు పుట్టారు. తర్వాత ఇద్దరి మధ్యా విభేదాలు తలెత్తి విడాకులకు దారితీశాయి. కారణం కెమిల్లాతో ఛార్లెస్‌ బంధం మళ్లీ చిగురించçమేనని చెబుతారు. అదే సమయంలో కెమిల్లా, ఆండ్రూ పార్కర్‌ కూడా విడాకులు తీసుకున్నారు. ఛార్లెస్‌, కెమిల్లా పెళ్లి చేసుకోవాలనుకున్నారు. కానీ నిబంధనల ప్రకారం రెండోపెళ్లి చేసుకునేవారికి రాజకిరీటంపై హక్కు ఉండదు. 2002లో ఈ నిబంధనను సవరించేదాకా ఆగి... 2005లో ఛార్లెస్‌-కెమిల్లాలు పెళ్లి చేసుకున్నారు. 1970లో మొదలైన ప్రేమాయణం... చివరకు 2005లో 35 ఏళ్ల తర్వాత పెళ్లిగా మారింది. అలా రాజభవనంలో కెమిల్లా రాజసంగా అడుగుపెట్టి... బ్రిటన్‌ రాణిగా కొలువుదీరనున్నారు.


రాణి ధరించే కిరీటాన్ని క్వీన్‌ మేరీ కిరీటం అంటారు. దీన్ని 1911లో చేయించారు


 ఈనాడు ప్రత్యేక విభాగం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని