Pakistan: భగ్గుమన్న పాకిస్థాన్‌

మాజీ ప్రధాని, పాకిస్థాన్‌ తెహ్రీక్‌-ఎ-ఇన్సాఫ్‌ పార్టీ అధినేత ఇమ్రాన్‌ ఖాన్‌ అరెస్టుతో పాకిస్థాన్‌లో పరిస్థితి నిప్పుల కుంపటిలా తయారైంది.

Updated : 11 May 2023 07:56 IST

ఇమ్రాన్‌ అరెస్టుతో అట్టుడికిన దేశం
ఏడుగురి మృతి, పలువురికి గాయాలు
ప్రభుత్వ కార్యాలయాలపై దాడి.. వాహనాలకు నిప్పు

ఇస్లామాబాద్‌: మాజీ ప్రధాని, పాకిస్థాన్‌ తెహ్రీక్‌-ఎ-ఇన్సాఫ్‌ పార్టీ అధినేత ఇమ్రాన్‌ ఖాన్‌ అరెస్టుతో పాకిస్థాన్‌లో పరిస్థితి నిప్పుల కుంపటిలా తయారైంది. దేశంలో తీవ్ర ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. మంగళవారం ప్రారంభమైన అల్లర్లు, ఆందోళనలు బుధవారమూ కొనసాగాయి. పలుచోట్ల విధ్వంసాలు చోటుచేసుకున్నాయి. ఏడుగురు మృతి చెందగా 300 మందికి గాయాలయ్యాయి. పార్టీ ఆందోళనలతో అట్టుడికిన పంజాబ్, ఖైబర్‌ తదితర ప్రావిన్సుల్లో అల్లర్లను అదుపు చేసేందుకు సైన్యాన్ని మోహరించారు. మరోవైపు అల్‌ ఖదీర్‌ భూ కుంభకోణం కేసులో ఇమ్రాన్‌ ఖాన్‌కు అవినీతి నిరోధక కోర్టు 8 రోజుల కస్టడీ విధించింది. మరో అవినీతి కేసులో సెషన్స్‌ కోర్టు నేరాభియోగాలను మోపింది. ఇమ్రాన్‌ అరెస్టు సక్రమమేనని మంగళవారం హైకోర్టు ఇచ్చిన తీర్పును పీటీఐ నాయకులు సుప్రీంకోర్టులో సవాలు చేశారు.  

 

అల్‌ ఖదీర్‌ ట్రస్టుకు అక్రమంగా భూములను కేటాయించి 5,000 కోట్ల రూపాయలను దోచుకున్నారని ఆరోపిస్తూ దాఖలైన కేసులో మంగళవారం ఇమ్రాన్‌ ఖాన్‌ను అరెస్టు చేసిన పారామిలిటరీ రేంజర్లు బుధవారం అవినీతి నిరోధక కోర్టులో హాజరు పరిచారు. విచారణ జరిపిన జడ్జి మహమ్మద్‌ బషీర్‌ ఆయనను 8 రోజుల జాతీయ జవాబుదారీ బ్యూరో(ఎన్‌ఏబీ) కస్టడీకి అప్పగించారు. విచారణ సందర్భంగా తనకు ప్రాణ హాని ఉందని కోర్టుకు ఇమ్రాన్‌ తెలిపారు. 24 గంటల్లో కనీసం తనను వాష్‌రూంకూ వెళ్లనీయలేదని పేర్కొన్నారు. ‘ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌ మనీ లాండరింగ్‌ కేసులో సాక్షిగా ఉన్న మక్సూద్‌ చప్రాసీ గత ఏడాది అనుమానాస్పద స్థితిలో మరణించారు. ఆయన పరిస్థితే నాకు ఎదురయ్యేలా ఉంది’ అని ఇమ్రాన్‌ కోర్టుకు తెలిపారు. లండన్‌లోని అక్రమ ఆస్తుల కేసులో మాజీ ప్రధాని నవాజ్‌ షరీఫ్, ఆయన కుమార్తె మరియంలకు గతంలో ఈ జడ్జి మహమ్మద్‌ బషీరే శిక్ష విధించారు. అయితే ఆ తర్వాత మరియంను ఇస్లామాబాద్‌ హైకోర్టు నిర్దోషిగా విడుదల చేయగా.. షరీఫ్‌ కేసు పెండింగ్‌లో ఉంది.

అవినీతి నిరోధక కోర్టులో విచారణ తర్వాత ఇమ్రాన్‌ను సెషన్స్‌ కోర్టులో పోలీసులు హాజరుపరిచారు. తోషఖానా అవినీతి కేసులో ఆయనపై నేరాభియోగాలను జడ్జి హుమాయూన్‌ దిల్వర్‌ నమోదు చేశారు. ప్రభుత్వ పెద్దలకు, అధికారులకు ఖరీదైన బహుమతులను అందించేందుకు 1974లో ఏర్పాటు చేసిన సంస్థే తోషఖానా. దీనికి స్టోర్‌ ఉంది. ప్రధానిగా ఉన్నప్పుడు అక్కడ రాయితీతో వస్తువులను తీసుకున్న ఇమ్రాన్‌.. ఆ తర్వాత వాటిని అధిక ధరకు అమ్ముకున్నారనేది ఈ కేసులో ఆయనపై వచ్చిన ఆరోపణ. ఇస్లామాబాద్‌లో అత్యంత భద్రత కలిగిన పోలీస్‌ లైన్స్‌లోని నూతన పోలీస్‌ అతిథి గృహాన్ని ఈ కేసుల విచారణకు తాత్కాలిక కోర్టుగా నిర్ణయించారు. ఈ ప్రాంతానికి మీడియానూ అనుమతించలేదు. కోర్టు పరిసరాలకు వచ్చిన పార్టీ కీలక నేతలు ఖురేషీ, ఉమర్‌లనూ అడ్డుకున్నారు. పైగా రెండు అవినీతి కేసుల్లో ఆరోపణలను ఎదుర్కొంటున్న ఉమర్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ఖురేషీ కోర్టు ఆవరణలోకి వెళ్లి అరెస్టు నుంచి తప్పించుకున్నారు.  

కొనసాగిన ఆందోళనలు

ఇమ్రాన్‌ ఖాన్‌ అరెస్టు నేపథ్యంలో జరిగిన అల్లర్లలో ఏడుగురు మరణించారని, 300 మంది గాయపడ్డారని పోలీసులు తెలిపారు. దేశవ్యాప్తంగా తదుపరి ఆదేశాలు వచ్చే వరకూ ఇంటర్నెట్‌ సేవలను నిలిపివేసినట్లు పాకిస్థాన్‌ టెలికమ్యూనికేషన్స్‌ అథారిటీ ప్రకటించింది. దేశవ్యాప్తంగా లాహోర్, పెషావర్, క్వెట్టా, కరాచీ, రావల్పిండి నగరాలతోపాటు ఖైబర్, బలూచిస్తాన్‌ ప్రావిన్సుల్లో ఆందోళనలు జరిగాయి. పెషావర్‌లో అతి పురాతన రేడియో పాకిస్థాన్‌ కార్యాలయంలోకి చొరబడిన ఆందోళనకారులు వస్తువులను ధ్వంసం చేసి లూటీ చేశారు. ఆందోళనల నేపథ్యంలో సోమవారం వరకూ విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించారు. సింధ్‌లో 144వ సెక్షన్‌ అమల్లోకి తెచ్చారు. పంజాబ్‌లో 1150 మంది ఆందోళనకారులను అరెస్టు చేశామని, అల్లర్లలో 130 మంది పోలీసు అధికారులు గాయపడ్డారని పోలీసులు వెల్లడించారు. 25 ప్రభుత్వ వాహనాలను ఆందోళనకారులు ధ్వంసం చేశారని, 14 ప్రభుత్వ కార్యాలయాలపై దాడులు చేశారని వివరించారు. అల్లర్లకు పాల్పడితే తీవ్ర చర్యలు తప్పవని ఆర్మీ హెచ్చరించింది. 9వ తేదీ దేశ చరిత్రలో చీకటి అధ్యాయమని వ్యాఖ్యానించింది. తమ అధినేతను అక్రమంగా అరెస్టు చేశారని ఆరోపించిన పీటీఐ పార్టీ బుధవారం దేశవ్యాప్త సమ్మె చేసింది. ఇమ్రాన్‌కు మద్దతుగా లండన్‌లోనూ ఆందోళనలు జరిగాయి. ఆయన అరెస్టుపై అమెరికా, ఐరోపా కూటమి (ఈయూ) స్పందించాయి. ఆ దేశంలోని ప్రజాస్వామ్య సిద్ధాంతాలను, చట్టాన్ని గౌరవిస్తామని అమెరికా వ్యాఖ్యానించింది. ఇటువంటి పరిస్థితుల్లో సంయమనం పాటించడం ముఖ్యమని ఈయూ సూచించింది.


 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని