ఇమ్రాన్‌ అరెస్టు అక్రమం

మాజీ ప్రధాని, తెహ్రీక్‌-ఎ-ఇన్సాఫ్‌ (పీటీఐ) పార్టీ అధినేత ఇమ్రాన్‌ ఖాన్‌ అరెస్టు అక్రమమని పాకిస్థాన్‌ సుప్రీంకోర్టు తేల్చింది. ఆయనను వెంటనే విడుదల చేయాలని ఆదేశించింది.

Updated : 12 May 2023 05:49 IST

వెంటనే విడుదల చేయాలి
పాక్‌ సుప్రీంకోర్టు ఆదేశం

ఇస్లామాబాద్‌: మాజీ ప్రధాని, తెహ్రీక్‌-ఎ-ఇన్సాఫ్‌ (పీటీఐ) పార్టీ అధినేత ఇమ్రాన్‌ ఖాన్‌ అరెస్టు అక్రమమని పాకిస్థాన్‌ సుప్రీంకోర్టు తేల్చింది. ఆయనను వెంటనే విడుదల చేయాలని ఆదేశించింది. రిజిస్ట్రార్‌ అనుమతి లేకుండా కోర్టు ప్రాంగణంలోకి ప్రవేశించి అరెస్టు చేయడంపై మండిపడింది. ఇది పూర్తిగా కోర్టు ధిక్కారమేనని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఉమర్‌ అతా బందియాల్‌, న్యాయమూర్తులు జస్టిస్‌ మహమ్మద్‌ అలీ మజార్‌, జస్టిస్‌ అథర్‌ మినాల్లాలతో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది. అల్‌ ఖదీర్‌ ట్రస్టుకు భూముల కేటాయింపు కేసులో ఇమ్రాన్‌ను బలవంతంగా అరెస్టు చేశారంటూ పీటీఐ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ఈ ఆదేశాలిచ్చింది. ‘కోర్టులో ఉన్న 70ఏళ్ల వ్యక్తిని అరెస్టు చేసే తీరు ఇదేనా.. కోర్టులో ఉన్న వ్యక్తిని అరెస్టు చేయడమంటే న్యాయాన్ని పొందే పౌరుడి హక్కును తిరస్కరించడమే. ఒక వ్యక్తి కోర్టుకు వచ్చాడంటే అతడు సరెండర్‌ అయినట్లే. అప్పుడు పోలీసులు అరెస్టు చేసేదేముంది.. 90 మంది కోర్టు ప్రాంగణంలోకి అక్రమంగా ప్రవేశిస్తే న్యాయస్థానం మర్యాద ఏమవుతుంది.. అరెస్టుకు ముందు వారు కోర్టు రిజిస్ట్రార్‌ నుంచి అనుమతి తీసుకోలేదు. ఇది పూర్తిగా కోర్టు ధిక్కారమే. అరెస్టు క్రమంలో న్యాయస్థానం సిబ్బందీ వేధింపులను ఎదుర్కొన్నారు’ అని సుప్రీం ఆగ్రహం వ్యక్తం చేసింది.

అల్‌ ఖదీర్‌ ట్రస్టుకు అక్రమంగా భూములను కేటాయించి 5,000 కోట్ల రూపాయలను దోచుకున్నారని ఆరోపిస్తూ దాఖలైన కేసులో మంగళవారం ఇమ్రాన్‌ ఖాన్‌ను పారామిలిటరీ రేంజర్లు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఆయనను.. రేంజర్లు చుట్టుముట్టి బలవంతంగా లాక్కెళ్లిన దృశ్యాలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి. అనంతరం దేశవ్యాప్తంగా అల్లర్లు చెలరేగాయి. అవినీతి నిరోధక కోర్టు ఇమ్రాన్‌ను 8 రోజుల ఎన్‌ఏబీ కస్టడీకి ఇచ్చింది. దీనిని సవాలు చేస్తూ పీటీఐ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దీంతో గంటలో ఆయనను కోర్టులో హాజరుపరచాలని సూచించిన కోర్టు అరెస్టు అక్రమమని, వెంటనే విడుదల చేయాలని ఆదేశించింది.

కొనసాగిన ఆందోళనలు

పాకిస్థాన్‌లో ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఇమ్రాన్‌ అరెస్టుతో మంగళవారం ప్రారంభమైన అల్లర్లు గురువారమూ జరిగాయి. మరోవైపు పీటీఐ పార్టీ నేతల అరెస్టులూ ఆగడం లేదు. తాజాగా ఆ పార్టీ ఉపాధ్యక్షుడు, విదేశాంగశాఖ మాజీ మంత్రి షా మహ్మద్‌ ఖురేషీని అరెస్టు చేశారు. ఆయన ఇమ్రాన్‌ ఖాన్‌కు అత్యంత సన్నిహితుడు. అల్లర్లకు పాల్పడిన 1500 మంది పీటీఐ కార్యకర్తలపై పోలీసులు కేసు నమోదు చేశారు.

పాకిస్థాన్‌లో డాలరు రూ.300

పాకిస్థాన్‌ రూపాయి విలువ దారుణంగా పడిపోతోంది. గురువారం అమెరికా డాలరు విలువ 300 రూపాయలకు చేరింది. ఇమ్రాన్‌ అరెస్టుతో దేశవ్యాప్తంగా అల్లర్లు చెలరేగిన మంగళవారం నుంచి రూపాయి విలువ మరింతగా దిగజారింది. కరాచీ స్టాక్‌ మార్కెట్‌పైనా అనిశ్చితి ప్రభావం పడింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని