Donald Trump: ట్రంప్‌ నోట.. అదే తిట్లపురాణం!

అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్‌ చెబుతున్నట్లు పదే పదే అబద్ధాలు వల్లె వేస్తున్నారు. 2024 అధ్యక్ష ఎన్నికల్లో మళ్లీ పోటీకి సిద్ధమవుతున్న ట్రంప్‌ బుధవారం రాత్రి సీఎన్‌ఎన్‌ టెలివిజన్‌ ఛానల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చారు.

Updated : 12 May 2023 08:32 IST

సీఎన్‌ఎన్‌ ఇంటర్వ్యూలో నోటిదురుసు

వాషింగ్టన్‌: అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్‌ చెబుతున్నట్లు పదే పదే అబద్ధాలు వల్లె వేస్తున్నారు. 2024 అధ్యక్ష ఎన్నికల్లో మళ్లీ పోటీకి సిద్ధమవుతున్న ట్రంప్‌ బుధవారం రాత్రి సీఎన్‌ఎన్‌ టెలివిజన్‌ ఛానల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చారు. 2020 ఎన్నికల్లో రిగ్గింగ్‌ జరిగిందని ట్రంప్‌ ఈ సందర్భంగా మళ్లీ ఆరోపించారు. న్యాయస్థానాలు రిగ్గింగుకు ఆధారాలు లేవని తేల్చినా ట్రంప్‌ పాత పాటే పాడుతున్నారు. 2020లో అధ్యక్షునిగా జో బైడెన్‌ ఎన్నికను సవాలు చేస్తూ ట్రంప్‌ మద్దతుదారులు పార్లమెంటు (కాంగ్రెస్‌)పై దండెత్తారు. బైడెన్‌ ఎన్నికను ధ్రువీకరిస్తూ నాటి ఉపాధ్యక్షుడు మైక్‌ పెన్స్‌ చేస్తున్న ప్రకటనను అడ్డుకోడానికి ప్రయత్నించారు. ఎన్నిక ఫలితాన్ని నిలిపివేసే అధికారం పెన్స్‌కు లేకపోయినా ఉందంటూ ట్రంప్‌ బుకాయించారు. పెన్స్‌ తప్పు చేశారని ఇంటర్వ్యూలో మళ్లీ ఉద్ఘాటించారు. ఆ రోజు కాంగ్రెస్‌పై దండెత్తిన 670 మంది ట్రంప్‌ అనుయాయులపై విద్రోహ కుట్ర, పోలీసు అధికారులపై దాడి అనే అభియోగాలను మోపారు. నాటి కాల్పుల్లో నల్లజాతికి చెందిన ఓ పోలీసు అధికారి మరణించారు. ఆ అధికారి దౌర్జన్యపరుడని ట్రంప్‌ అన్నారు. 2024 అధ్యక్ష ఎన్నికలు నిజాయితీగా జరిగితేనే ఫలితాన్ని ఆమోదిస్తానన్నారు. జీన్‌ కెరోల్‌ అనే పాత్రికేయురాలిపై ట్రంప్‌ లైంగికదాడికి పాల్పడినట్లు నిర్ధారించిన న్యూయార్క్‌ కోర్టు జ్యూరీ కెరోల్‌కు ట్రంప్‌ 50 లక్షల డాలర్ల పరిహారం చెల్లించాలని మంగళవారం తీర్పు చెప్పింది. సీఎన్‌ఎన్‌ ఇంటర్వ్యూలో ట్రంప్‌ దీన్ని బోగస్‌ కేసుగా వర్ణించారు. కెరోల్‌ పిచ్చిపట్టిన మనిషి అని దుయ్యబట్టారు. రష్యాపై ఉక్రెయిన్‌ గెలవాలనుకుంటున్నారా అని ప్రశ్నించగా.. గెలుపోటముల కోణంలో తాను ఆలోచించనని బదులిచ్చారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని