Pakistan - Imran Khan: నివురుగప్పిన నిప్పులా పాక్
పాకిస్థాన్‌లో సోమవారం పలు కీలక పరిణామాలు చోటుచేసుకోనున్న నేపథ్యంలో దేశంలో మరోసారి హింస ప్రజ్వరిల్లే అవకాశం ఉందని ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
నేడు దేశంలో పలు కీలక పరిణామాలు
ఇస్లామాబాద్: పాకిస్థాన్‌లో సోమవారం పలు కీలక పరిణామాలు చోటుచేసుకోనున్న నేపథ్యంలో దేశంలో మరోసారి హింస ప్రజ్వరిల్లే అవకాశం ఉందని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వంలో కీలక భాగస్వామ్య పక్షం నిరసనలు నిర్వహించతలపెట్టడం, పంజాబ్ రాష్ట్రంలో మే 14న ఎన్నికలు నిర్వహించాలన్న తన ఉత్తర్వునకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టు విచారణ చేపట్టనుండటం, మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఒక హైకోర్టులో హాజరుకానుండటం వంటి పరిణామాలు ఒకేరోజు జరగబోతున్నాయి. ఈ నేపథ్యంలో ఇక్కడ పరిస్థితులు నివురుగప్పిన నిప్పులా ఉన్నాయి. అవినీతి కేసులో అరెస్టయిన ఇమ్రాన్ ఖాన్ పట్ల పాక్ సుప్రీంకోర్టు పక్షపాతాన్ని ప్రదర్శించి, ఆయనను విడుదల చేయించిందని మౌలానా ఫజ్లుర్ రెహ్మాన్ నేతృత్వంలోని పాకిస్థాన్ డెమోక్రటిక్ మూవ్‌మెంట్ (పీడీఎం), మరో డజను పార్టీలు ఆరోపిస్తున్నాయి. దీనిపై సుప్రీంకోర్టు వెలుపల నిరసన ర్యాలీ నిర్వహిస్తామని ప్రకటించాయి.
పీడీఎం.. పాక్ ప్రభుత్వంలో కీలక భాగస్వామి. అయితే ఇస్లామాబాద్‌లో రాజకీయ కార్యక్రమాలపై ఇప్పటికే నిషేధం విధించారు. సైన్యాన్ని కూడా మోహరించారు. ఈ నేపథ్యంలో సోమవారం జరగబోయే నిరసనలు హింసకు దారితీసే అవకాశం ఉందన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. పంజాబ్ రాష్ట్రంలో మే 14న ఎన్నికలు నిర్వహించాలంటూ గత నెల 4న సుప్రీంకోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. ఈ నిర్ణయాన్ని పునఃసమీక్షించాలంటూ ఎన్నికల సంఘం దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు తిసభ్య ధర్మాసనం సోమవారం విచారించనుంది. ఎన్నికల నిర్వహణకు కోర్టు పెట్టిన గడువు ఇప్పటికే ముగిసింది. ఈ విషయంలో చట్టం తన పని తాను చేసుకుపోతుందని ప్రధాన న్యాయమూర్తి ఇప్పటికే పేర్కొన్నారు. దీంతో ప్రధాన మంత్రి, అధికారులపై కోర్టు ధిక్కరణ చర్యలకు న్యాయస్థానం పూనుకునే అవకాశం ఉందన్న వాదన వినిపిస్తోంది. వివిధ కేసుల్లో బెయిలు కోసం ఇమ్రాన్ ఖాన్ సోమవారం లాహోర్ హైకోర్టుకు హాజరవుతారు. ఇటీవల దేశవ్యాప్తంగా జరిగిన అల్లర్లలో ఆయన హస్తం ఉందని తేలితే ఆయనను మరోసారి అరెస్టు చేసే అవకాశం ఉందని సనావుల్లా పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో దీనిపై ఉత్కంఠ నెలకొంది.
సైన్యానికి సిగ్గుండాలి: ఇమ్రాన్‌ఖాన్
పాకిస్థాన్ సైన్యంపై ఇమ్రాన్‌ఖాన్ తీవ్ర విమర్శలు చేశారు. రాజకీయాల్లో జోక్యం చేసుకోవడానికి ఆర్మీకి సిగ్గుండాలని వ్యాఖ్యానించారు. రాజకీయాలే చేయాలనుకుంటే సొంతంగా పార్టీ పెట్టుకోవాలని హితవు పలికారు. ఇస్లామాబాద్ న్యాయస్థానం పలు కేసుల్లో బెయిలిచ్చిన అనంతరం తొలిసారి ఇమ్రాన్ లాహోర్‌లోని తన నివాసం నుంచి జాతినుద్దేశించి ప్రసంగించారు. ముఖ్యంగా సైన్యానికి అనుబంధ సంస్థైన ఇంటర్ సర్వీసెస్ పబ్లిక్ రిలేషన్స్ (ఐఎస్‌పీఆర్) తనను కపటి.. నయవంచకుడు అంటూ దూషించడంపై తీవ్రంగా స్పందించారు. తాను ప్రపంచంలో పాకిస్థాన్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న సమయానికి ఐఎస్‌పీఆర్ పుట్టనే లేదని అన్నారు. ‘‘ప్రపంచవ్యాప్తంగా నేను పాక్ జెండాను గర్వంగా ఎగరేశాను. మీరేమో రాజకీయాలు చేస్తున్నారు. ఇందుకు సిగ్గుపడాలి. మీరు కూడా ఓ రాజకీయ పార్టీ పెట్టుకోండి’’ అని ఘాటుగా వ్యాఖ్యలు చేశారు. పాక్ సైన్యాధిపతి జనరల్ అసీమ్ మునీర్‌పైనా ఆరోపణలు చేశారు. తనకు కోర్టు బెయిలిచ్చినా.. మునీర్ కిడ్నాప్‌నకు పాల్పడ్డారని అన్నారు. ఎన్నికలొస్తే తుడిచిపెట్టుకుపోతామని ప్రభుత్వాన్నేలుతున్న పార్టీలకు తెలుసునని.. అందుకే దేశంలో అలజడులు సృష్టించడానికి అవి కుట్ర పన్నాయని తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
TDP: సీఐడీ చీఫ్ సంజయ్‌పై చర్యలు తీసుకోండి: అమిత్‌షాకు తెదేపా ఎంపీ రామ్మోహన్ ఫిర్యాదు
-
Cricket News: అత్యాచార ఆరోపణల నుంచి నిర్దోషిగా బయటపడిన శ్రీలంక క్రికెటర్
-
Hyundai, Kia Recall: అమెరికాలో 34 లక్షల హ్యుందాయ్, కియా కార్ల రీకాల్
-
Alia Bhatt: రణ్‌బీర్‌ను ముద్దాడిన అలియా.. పోస్ట్ వైరల్
-
Ganesh Nimajjanam: గంగమ్మ ఒడికి ఖైరతాబాద్ గణేశుడు.. ఘనంగా నిమజ్జనోత్సవం
-
Bengaluru: చివరి నిమిషంలో ట్రెవర్ షో రద్దు.. క్షమాపణలు కోరిన బుక్ మై షో