76 రోజులుగా నీటి అడుగునే ఆవాసం!

ఏకధాటిగా వంద రోజుల పాటు నీటి అడుగున నివసించి సరికొత్త చరిత్ర సృష్టించేందుకు అమెరికా ప్రొఫెసర్‌ ఒకరు నడుంబిగించారు.

Updated : 16 May 2023 09:42 IST

100 రోజుల వరకూ బయటకు రానంటున్న అమెరికా ఫ్రొఫెసర్‌

కీ లార్గో: ఏకధాటిగా వంద రోజుల పాటు నీటి అడుగున నివసించి సరికొత్త చరిత్ర సృష్టించేందుకు అమెరికా ప్రొఫెసర్‌ ఒకరు నడుంబిగించారు. ఇప్పటికే ఆయన 76 రోజులుగా సముద్రపు నీటి అడుగున నిర్మించిన ఆవాసంలో ఉంటూ గత రికార్డులను బద్ధలుకొట్టారు. ఫ్లోరిడాలోని కీ లార్గోలో సముద్ర జలాల్లో 30 అడుగుల దిగువున స్కూబా డైవర్స్‌ కోసం నిర్మించిన ఆవాసంలోకి మార్చి 1న ప్రొఫెసర్‌ జోసెఫ్‌ డిటురి ప్రవేశించారు. 2014లో ఇద్దరు ప్రొఫెసర్లు బ్రూస్‌ కాంట్రెల్‌, జెస్సికా ఫెయిన్‌.. ఇదే ప్రాంతంలో 73 రోజుల పాటు నీటిలో అడుగున జీవించి రికార్డు నెలకొల్పారు. అయితే, ప్రొఫెసర్‌ జోసెఫ్‌ డిటురి 76 రోజులుగా నీటి అడుగున జీవిస్తూ వారి రికార్డును అధిగమించారు. అంతేకాకుండా 100 రోజులు పూర్తైన తర్వాతే (జూన్‌ 9న) బయటకు వస్తానని స్పష్టం చేస్తున్నారు. తన ఆవాసంపై పీడనాన్ని తగ్గించే సాంకేతిక ఏర్పాట్లేవీ లేకుండానే ఆయన అక్కడ కొనసాగుతున్నారు. విద్య, వైద్య, సముద్ర పరిశోధనల్లో భాగంగా నీటి అడుగున నివసించే వసతిని ‘మెరైన్‌ రిసోర్సెస్‌ డెవలప్‌మెంట్‌ ఫౌండేషన్‌’ ఏర్పాటు చేసింది. తీవ్రమైన ఒత్తిళ్లకు మానవ శరీరం ఎలా స్పందిస్తుందన్న అంశంపై పరిశోధనలో భాగంగా ఈ ప్రయోగాన్ని చేస్తున్నట్లు ప్రొఫెసర్‌ డిటురి తెలిపారు. నీటి అడుగు నివాసం నుంచే ఆయన సౌత్‌ ఫ్లోరిడా వర్సిటీ విద్యార్థులు 2500 మందికి ఆన్‌లైన్‌ తరగతులు నిర్వహిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని