సీజేపై పాకిస్థాన్‌ ప్రభుత్వ యుద్ధం

మాజీ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ అరెస్టుతో అల్లకల్లోలమైన పాకిస్థాన్‌లో సంక్షోభం మరింత ముదురుతోంది. ఇమ్రాన్‌ విడుదల వ్యవహారం శాసన, న్యాయ వ్యవస్థల మధ్య యుద్ధానికి దారి తీసింది.

Published : 16 May 2023 05:53 IST

కేసులు వేసేందుకు పార్లమెంటరీ కమిటీ
జాతీయ అసెంబ్లీలో తీర్మానం
సైన్యం తనను జైల్లో పెట్టేందుకు కుట్ర పన్నిందన్న ఇమ్రాన్‌

ఇస్లామాబాద్‌: మాజీ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ అరెస్టుతో అల్లకల్లోలమైన పాకిస్థాన్‌లో సంక్షోభం మరింత ముదురుతోంది. ఇమ్రాన్‌ విడుదల వ్యవహారం శాసన, న్యాయ వ్యవస్థల మధ్య యుద్ధానికి దారి తీసింది. ఈ విషయంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఉమర్‌ అతా బందియాల్‌ తీరును ప్రభుత్వం తీవ్రంగా తప్పుబట్టింది. ఆయనపై సుప్రీం జ్యుడీషియల్‌ కౌన్సిల్‌లో కేసులు వేయడానికి ఐదుగురు సభ్యులతో కమిటీని నియమిస్తూ సోమవారం పార్లమెంటులో తీర్మానాన్ని ఆమోదించింది. ‘సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి దుష్ప్రవర్తన, ప్రమాణ స్వీకార సమయంలో చేసిన ప్రతిజ్ఞ ఉల్లంఘనలపై సుప్రీం జ్యుడీషియల్‌ కౌన్సిల్‌లో కేసులు వేయాలని జాతీయ అసెంబ్లీ ఏకగ్రీవంగా తీర్మానించింది. దీని ప్రకారం.. ప్రధాన న్యాయమూర్తి, న్యాయమూర్తులపై కౌన్సిల్‌లో కేసులు వేయడానికి అధికారం లభిస్తుంది’ అని ఆరోగ్యశాఖ పార్లమెంటరీ కార్యదర్శి షాజియా సోబియా తెలిపారు. సిట్టింగ్‌ న్యాయమూర్తులపై విచారణకు పాకిస్థాన్‌లో ఉన్న ఏకైక ఫోరమే ఈ కౌన్సిల్‌. ఇమ్రాన్‌కు సీజేతో కూడిన ముగ్గురు న్యాయమూర్తుల ధర్మాసనం బెయిలు ఇచ్చిన నేపథ్యంలో ఈ వివాదం మొదలైంది. మరోవైపు సోమవారమే అధికార పార్టీల కూటమి సుప్రీంకోర్టు ఎదుట నిరసనలు వ్యక్తం చేసింది. పీఎంఎల్‌-ఎన్‌, జేయూఐ-ఎఫ్‌, పీపీపీల తదితర 13 పార్టీల నేతలు, కార్యకర్తలు ఇస్లామాబాద్‌లోని కోర్టు బయట ఆందోళనలు నిర్వహించారు.

పదేళ్లు జైల్లో ఉంచేందుకు పన్నాగం: ఇమ్రాన్‌

పాకిస్థాన్‌ సైన్యంపై ఇమ్రాన్‌ ఖాన్‌ మరోసారి తీవ్ర ఆరోపణలు చేశారు. దేశద్రోహం పేరుతో తనను పదేళ్ల పాటు జైల్లో ఉంచేందుకు సైన్యం కుట్ర పన్నిందని సోమవారం ఆరోపించారు. ఇటీవల తన అరెస్టు సమయంలో చెలరేగిన హింసను కారణంగా చూపుతూ మరోసారి అరెస్టు చేసేందుకు సైన్యం కుట్ర పన్నిందని ఆయన ఆరోపించారు. దేశంలో పాకిస్థాన్‌ తెహ్రీక్‌-ఎ-ఇన్సాఫ్‌ (పీటీఐ) కార్యకర్తలు ఇటీవల హింసాత్మక ఆందోళనలు చేపట్టిన నేపథ్యంలో పెట్టిన కేసులో బెయిలు కోసం సోమవారం లాహోర్‌ హైకోర్టుకు ఇమ్రాన్‌ వచ్చారు. అయితే బెయిలుపై విచారణను కోర్టు మంగళవారానికి వాయిదా వేసింది. మరోవైపు ఇమ్రాన్‌ భార్య బుష్రా బీబీకి హైకోర్టు బెయిలు మంజూరు చేసింది. ఆమె తోషఖానా, అల్‌ ఖదీర్‌ ట్రస్టు అవినీతి కేసుల్లో నిందితురాలిగా ఉన్నారు.

పంజాబ్‌ ప్రావిన్సులో ఎన్నికల నిర్వహణపై అధికార, ప్రతిపక్ష పార్టీలు చర్చించి నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు సూచించింది. శాంతి భద్రతలను నెలకొనేలా చూసి ఎన్నికలకు మార్గం సుగమం చేయాలని ఆదేశించింది. పంజాబ్‌లో ఎన్నికల నిర్వహణ క్లిష్టతర ప్రక్రియని ఎన్నికల కమిషన్‌ దాఖలు చేసిన పిటిషన్‌ విచారణ సందర్భంగా అత్యున్నత న్యాయస్థానం ఈ సూచన చేసింది. తదుపరి విచారణను వారంపాటు వాయిదా వేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని