UNO: ప్రపంచం ముంగిట ప్రచండ జ్వాలలు.. ఐరాస హెచ్చరిక

వచ్చే అయిదేళ్లలో ప్రపంచం తాపమానం పెరుగుదల పరిమితిని తాత్కాలికంగా అధిగమించే అవకాశం మూడింట రెండు వంతులు ఉన్నట్లు ఐక్యరాజ్య సమితి వాతావరణ విభాగం బుధవారం హెచ్చరించింది.

Updated : 18 May 2023 08:27 IST

వాషింగ్టన్‌: వచ్చే అయిదేళ్లలో ప్రపంచం తాపమానం పెరుగుదల పరిమితిని తాత్కాలికంగా అధిగమించే అవకాశం మూడింట రెండు వంతులు ఉన్నట్లు ఐక్యరాజ్య సమితి వాతావరణ విభాగం బుధవారం హెచ్చరించింది. భూ ఉష్ణోగ్రత పెరుగుదలను 1.5 డిగ్రీల సెల్సియస్‌ (2.7 డిగ్రీల ఫారెన్‌హీట్‌) వద్ద నిలువరించకపోతే ప్రపంచమంతటా పర్యావరణ విధ్వంసం పెచ్చరిల్లుతుంది. అందుకే ఎట్టి పరిస్థితుల్లోనూ భూతాపం పెరుగుదలను 1.5 డిగ్రీల సెల్సియస్‌ వద్ద కట్టడి చేయాలని 2015లో పారిస్‌ వాతావరణ ఒప్పందం చేసుకున్నారు. కానీ, ప్రపంచ దేశాలు కర్బన ఉద్గారాలను ఆశించిన స్థాయిలో అరికట్టలేకపోతున్నందున 2030 తర్వాత భూఉష్ణోగ్రత పెరుగుదల 1.5 డిగ్రీలకు చేరుకొంటుందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తూ వచ్చారు. అయితే, అంతకంటే ముందే ప్రమాదం ముంచుకు వస్తోందని.. ఎల్‌నినో, లానినా సయ్యాట వల్ల ఇప్పటినుంచి 2027 లోపు 1.5 డిగ్రీలకు మించి భూతాపం పెరిగే అవకాశముందని ప్రపంచ వాతావరణ పరిశోధన సంస్థ తాజా నివేదిక బుధవారం హెచ్చరించింది. వాతావరణ రికార్డులను నమోదు చేయడం ఆరంభించినప్పటి నుంచి ఎన్నడూ లేని విధంగా రాగల అయిదేళ్లూ భూమికి అత్యుష్ణ సంవత్సరాలుగా నిలిచిపోయే అవకాశం 98 శాతం ఉన్నట్లు దీని సారాంశం. ఎల్‌నినో వల్ల పెరగనున్న వేడి శాశ్వతం కాదనీ, 2030 లోపు తరచుగా ఉష్ణోగ్రత 1.5 డిగ్రీలను దాటవచ్చని శాస్త్రజ్ఞులు వివరించారు.

* చల్లదనాన్ని తీసుకొచ్చే లానినా మూడేళ్లపాటు కొనసాగడం వల్ల మానవ కార్యకలాపాల వల్ల ఉత్పన్నమయ్యే వేడికి కొంతవరకు పగ్గాలు పడ్డాయి. ఈ ఏడాది నుంచి లానినా పక్కకు తొలగి.. అత్యుష్ణ జనక ఎల్‌నినో ముందుకొస్తోంది. 2016లో ఎల్‌నినో రికార్డు ఉష్ణోగ్రతకు కారణమైంది. ఆ రికార్డు ఇప్పటి నుంచి 2027 లోపు బద్దలయ్యే ప్రమాదం ఉంది. లానినా స్థానంలో ఎల్‌నినో ప్రవేశించడం వల్ల గత మూడేళ్లలో వరదలు వచ్చినచోట అనావృష్టి, అనావృష్టి ఎదురైనచోట వరదలు వస్తాయని బ్రిటిష్‌ వాతావరణ పరిశోధకుడు లియో హెర్మన్సన్‌ హెచ్చరించారు. వాతావరణ శాస్త్రజ్ఞులు 30 ఏళ్ల సగటును తీసుకుంటారు కాబట్టి, ఏదో ఒక సంవత్సరం ఉష్ణోగ్రత పెరగడాన్ని చూసి అతిగా కంగారు పడనక్కర్లేదన్నారు. రాబోయే అయిదేళ్లలో అమెజాన్‌ అడవుల్లో వర్షాభావం ఏర్పడితే, ఆఫ్రికాలో సహారా ఎడారి దిగువనున్న సాహెల్‌ ప్రాంతంలో అతివృష్టి ఏర్పడుతుంది. కాబట్టి, చెడులోనూ మంచి ఉందని హెర్మన్సన్‌ అన్నారు. మరోవైపు.. మానవ కార్యకలాపాల వల్ల సముద్రాలు వేడెక్కిపోతున్నాయని అమెరికన్‌ వాతావరణ శాస్త్రజ్ఞుడు మైకేల్‌ మాన్‌ హెచ్చరించారు. ఇప్పుడప్పుడే భూ ఉష్ణోగ్రత 1.5 డిగ్రీల లక్ష్మణరేఖను దాటే ప్రమాదం లేదని, మానవాళి కలిసికట్టుగా కృషి చేస్తే భూతాపాన్ని నిరోధించవచ్చని మాన్‌ అన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని