నిఘా అంతరిక్ష ఉపగ్రహాన్ని పరిశీలించిన కిమ్‌

ఉత్తర కొరియా త్వరలో ప్రయోగించడానికి సిద్ధమవుతున్న సైనిక నిఘా అంతరిక్ష ఉపగ్రహాన్ని ఆ దేశాధ్యక్షుడు కిమ్‌ జోంగ్‌ ఉన్‌ మంగళవారం పరిశీలించారు.

Published : 18 May 2023 04:55 IST

కొన్ని వారాల్లో ప్రయోగానికి సిద్ధం

సియోల్‌: ఉత్తర కొరియా త్వరలో ప్రయోగించడానికి సిద్ధమవుతున్న సైనిక నిఘా అంతరిక్ష ఉపగ్రహాన్ని ఆ దేశాధ్యక్షుడు కిమ్‌ జోంగ్‌ ఉన్‌ మంగళవారం పరిశీలించారు. తన కుమార్తెతో కలసి అంతరిక్ష పరిశోధన, అభివృద్ధి కేంద్రానికి వచ్చిన ఆయన శాస్త్రవేత్తలతో చర్చించారు. దీనికి సంబంధించిన చిత్రాలను ఉత్తర కొరియా మీడియా బుధవారం విడుదల చేసింది. కిమ్‌, ఆయన కుమార్తె తెల్ల కోట్లు ధరించి ఉపగ్రహానికి సంబంధించిన ఓ భాగాన్ని పరిశీలిస్తున్నట్లు అందులో కనిపిస్తోంది. అమెరికా సామ్రాజ్యవాదులను, దక్షిణ కొరియా తోలుబొమ్మ విలన్లను ఎదుర్కోవడానికి అంతరిక్ష ఆధారిత నిఘా కీలకమని కిమ్‌ పేర్కొన్నట్లు కొరియన్‌ సెంట్రల్‌ న్యూస్‌ ఏజెన్సీ(కేసీఎన్‌ఏ) వెల్లడించింది. ఉపగ్రహ ప్రవేశానికి సంబంధించిన తదుపరి కార్యాచరణ ప్రణాళికకు కిమ్‌ ఆమోదం తెలిపినట్లు పేర్కొంది. కొన్ని వారాల్లో ఈ నిఘా ఉపగ్రహాన్ని ప్రయోగించనున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం సుదూర క్షిపణి సాంకేతికతను వినియోగించే అవకాశముందని విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే ఐరాస భద్రతా మండలి ఆ సాంకేతికతను గతంలో నిషేధించిన సంగతి గమనార్హం. నిఘా ఉపగ్రహంపై దక్షిణ కొరియా అభ్యంతరం వ్యక్తం చేసింది. బాలిస్టిక్‌ సాంకేతికతతో కూడిన ఎలాంటి ఉపగ్రహాలను ప్రయోగించకుండా ఉత్తర కొరియాపై ఐరాస భద్రతా మండలి విధించిన ఆంక్షలను ఉల్లంఘిస్తోందని పేర్కొంది. ప్రాంతీయ శాంతి, స్థిరత్వానికి ఇది ముప్పుగా మారుతుందని ఆందోళన వ్యక్తం చేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని