రష్యాపై మరిన్ని ఆంక్షలు

ఉక్రెయిన్‌పై యుద్ధానికి దిగిన రష్యాను మరింతగా ఆంక్షల పిడికిలిలో బిగించాలని శక్తిమంతమైన ‘జీ-7’ దేశాలు నిర్ణయించాయి. ఇప్పటికే విధించినవాటికి అదనంగా ఆ దేశంపై మరిన్ని నిషేధాజ్ఞలు అమల్లోకి తీసుకురావాలని తీర్మానించాయి.

Updated : 20 May 2023 05:52 IST

ఆ దేశాన్ని ఏకాకిగా మార్చడమే లక్ష్యం
జీ-7 సదస్సులో సభ్యదేశాల తీర్మానం
హిరోషిమాకు రానున్న జెలెన్‌స్కీ

 

హిరోషిమా: ఉక్రెయిన్‌పై యుద్ధానికి దిగిన రష్యాను మరింతగా ఆంక్షల పిడికిలిలో బిగించాలని శక్తిమంతమైన ‘జీ-7’ దేశాలు నిర్ణయించాయి. ఇప్పటికే విధించినవాటికి అదనంగా ఆ దేశంపై మరిన్ని నిషేధాజ్ఞలు అమల్లోకి తీసుకురావాలని తీర్మానించాయి. ఉక్రెయిన్‌కు తమ సంపూర్ణ మద్దతును పునరుద్ఘాటించాయి. మరోవైపు- ఈ కూటమి సదస్సులో ఉక్రెయిన్‌ అధ్యక్షుడు వొలొదిమిర్‌ జెలెన్‌స్కీ ఆదివారం నేరుగా పాల్గొననున్నారు. జపాన్‌లోని హిరోషిమా వేదికగా శుక్రవారం జీ-7 శిఖరాగ్ర సదస్సు ప్రారంభమైంది. తొలిరోజు అంతర్గత చర్చల అనంతరం కూటమి సభ్యదేశాలు సంయుక్త ప్రకటనను విడుదల చేశాయి. ‘‘ఉక్రెయిన్‌కు మా మద్దతు ఏమాత్రం బలహీనపడదు. ఆ దేశంపై రష్యా అతిక్రమణలు, అక్రమ చర్యలను మేం ఉమ్మడిగా వ్యతిరేకిస్తున్నాం. ఈ యుద్ధాన్ని రష్యా ప్రారంభించింది. అదే దాన్ని ముగించగలదు’’ అని అందులో పేర్కొన్నాయి. రష్యాకు ఆయుధాలు, ఇతర మద్దతు ఇవ్వడం ఆపేయాలని ఇతర దేశాలను జీ-7 కోరింది. లేనిపక్షంలో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించింది. తాజా ఆంక్షల్లో భాగంగా రష్యాకు చెందిన దాదాపు 70 కంపెనీలపై అమెరికా నిషేధం విధించనున్నట్లు తెలుస్తోంది. జీ-7లోని ఇతర సభ్యదేశాలూ అదే బాటలోనే నడవనున్నట్లు అమెరికాకు చెందిన ఓ అధికారి చెప్పారు. రష్యాను మరింతగా ఏకాకిని చేయడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు.

శాంతివనంలో శ్రద్ధాంజలి

హిరోషిమాలో అణుబాంబు దాడి కారణంగా మృత్యువాతపడ్డ వేలమంది జ్ఞాపకార్థం నిర్మించిన శాంతివనాన్ని జీ-7 నేతలు సదస్సు ప్రారంభానికి ముందు సందర్శించారు. అణుదాడిలో అసువులు బాసినవారికి శ్రద్ధాంజలి ఘటించారు.

మోదీతో భేటీ కానున్న జెలెన్‌స్కీ

జీ-7 సదస్సు కోసం హిరోషిమా రానున్న ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ.. ప్రధాని మోదీతో అక్కడ శనివారం సాయంత్రం ద్వైపాక్షిక చర్చలు జరపనున్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఉక్రెయిన్‌-రష్యా యుద్ధం ప్రారంభమయ్యాక ఈ ఇరువురు నేతలు నేరుగా భేటీ అవడం ఇదే తొలిసారి కానుంది. భారత్‌ నుంచి శుక్రవారం హిరోషిమా చేరుకున్న మోదీకి అక్కడ ఘన స్వాగతం లభించింది.


సార్వభౌమత్వ పరిరక్షణకు భారత్‌ సర్వసన్నద్ధం: మోదీ

దిల్లీ: భారత్‌ తన సార్వభౌమత్వం, గౌరవాన్ని కాపాడుకునేందుకు సర్వసన్నద్ధంగా ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. పొరుగు దేశాలతో ద్వైపాక్షిక సంబంధాలు బాగుండాలంటే సరిహద్దుల్లో శాంతియుత వాతావరణం నెలకొనడం అత్యంత కీలకమని పేర్కొన్నారు. జపాన్‌లో ఓ వార్తాసంస్థతో ముఖాముఖిలో.. చైనా, పాకిస్థాన్‌లతో సంబంధాలపై ఎదురైన ప్రశ్నలకు ఆయన శుక్రవారం ఈ మేరకు బదులిచ్చారు. తూర్పు లద్దాఖ్‌లో వాస్తవాధీన రేఖ (ఎల్‌ఏసీ) వెంబడి పలు ప్రాంతాల్లో భారత్‌-చైనా బలగాల మధ్య 2020 నుంచి ప్రతిష్టంభన కొనసాగుతున్న సంగతి తెలిసిందే. దీనిపై అడిగిన పలు ప్రశ్నలకు ముఖాముఖిలో మోదీ స్పందించారు. వివాదాలను శాంతియుతంగా పరిష్కరించుకునేందుకు భారత్‌ సిద్ధంగా ఉందన్నారు. పాకిస్థాన్‌తోనూ భారత్‌ సత్సంబంధాలనే కోరుకుంటోందని స్పష్టం చేశారు.



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు