ఆక్రమణదారులను మీరు సమర్థిస్తారా!

‘‘ఆక్రమణదారులు మీ దేశంలో మూడో భాగాన్ని స్వాధీనం చేసుకొంటామని అంటే మీరెవరూ ఎంతమాత్రం అంగీకరించరని నాకు కచ్చితంగా తెలుసు’’ అంటూ ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌ స్కీ అరబ్‌ నేతలను ఉద్దేశించి అన్నారు.

Published : 20 May 2023 05:25 IST

అరబ్‌ నేతల సదస్సులో జెలెన్‌స్కీ

కీవ్‌, జెద్దా: ‘‘ఆక్రమణదారులు మీ దేశంలో మూడో భాగాన్ని స్వాధీనం చేసుకొంటామని అంటే మీరెవరూ ఎంతమాత్రం అంగీకరించరని నాకు కచ్చితంగా తెలుసు’’ అంటూ ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌ స్కీ అరబ్‌ నేతలను ఉద్దేశించి అన్నారు. ఇటీవలి కాలంలో ఇటలీ, వాటికన్‌, జర్మనీ, ఫ్రాన్స్‌, బ్రిటన్‌ వంటి దేశాల్లో ఆకస్మికంగా పర్యటిస్తున్న జెలెన్‌ స్కీ శుక్రవారం సౌదీ అరేబియాలో అరబ్‌ నేతల భేటీలో ప్రత్యక్షమయ్యారు. రష్యా దాడుల వల్ల ఉక్రెయిన్‌లోని క్రిమియా వంటి ప్రాంతాల్లో ముస్లిం వర్గాల రక్షణ ప్రమాదంలో పడిందంటూ అరబ్‌ నేతల దృష్టిని ఆకర్షించే ప్రయత్నం చేశారు. 15 నెలలుగా కొనసాగుతున్న రష్యా దూకుడును అడ్డుకొని, తమ శాంతి ప్రతిపాదనకు ఆమోదం లభించేలా చూడాలని కోరారు. క్రిమియాకు చెందిన ముస్లిం నేత ముస్తఫా జెమిలెవ్‌ సైతం జెలెన్‌ స్కీ వెంట సౌదీ పర్యటనకు వచ్చారు. ఇక్కడి నుంచి జపాన్‌లో జరిగే జీ-7 సదస్సుకు జెలెన్‌ స్కీ వెళతారని తొలుత వార్తలు వచ్చినా, వీడియో లింక్‌ ద్వారా మాత్రమే ఆయన జీ-7 నేతలతో మాట్లాడతారని తర్వాత ఓ ప్రకటన వెలువడింది. బహుశా భద్రత కారణాల దృష్ట్యా గోప్యత పాటించి ఉండవచ్చు. ఇటు ఉక్రెయిన్‌పై రష్యా తన దాడులను కొనసాగిస్తూనే ఉంది.

12 ఏళ్ల తర్వాత సిరియా భాగస్వామ్యం

సౌదీ అరేబియా శుక్రవారం నిర్వహించిన అరబ్‌ లీగ్‌ సదస్సులో రెండు విశేష పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌ స్కీ సదస్సులో ప్రత్యక్షమవడం అందులో ఒకటి కాగా, 12 ఏళ్ల సస్పెన్షన్‌ తర్వాత సిరియా అధ్యక్షుడు బషర్‌ అసద్‌కు ఆహ్వానం అందటం మరోటి. రష్యా వైమానిక దాడులు ఈ రెండు దేశాల్లో విధ్వంసాన్ని మిగల్చడం గమనార్హం.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని